విద్యుత్ అధికారులతో సీఎం సమీక్ష.. ట్రాన్స్ కో సీఎండీ గైర్హాజరు

రాష్ట్రంలోని విద్యుత్ పరిస్థితి, అప్పులు, ఆర్థిక వ్యవస్థలో జరిగిన అవకతవకలు తదితర అంశాలపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన శుక్రవారం

Update: 2023-12-08 07:13 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోని విద్యుత్ పరిస్థితి, అప్పులు, ఆర్థిక వ్యవస్థలో జరిగిన అవకతవకలు తదితర అంశాలపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన శుక్రవారం సచివాలయంలో జరిగే సమావేశానికి ట్రాన్స్ కో – జెన్ కో సీఎండీ ప్రభాకర్ రావు హాజరుకావడంలేదు. ముందుగానే ఖరారైన సదరన్ రీజియన్ పవర్ కమిటీ సమావేశంలో పాల్గొనేందుకు కొడైకెనాల్ వెళ్ళారు. తెలంగాణకు సంబంధించిన పలు థర్మల్ ప్రాజెక్టుల నిర్మాణం, వాటి పురోగతి, విద్యుత్ వినియోగానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు మీటర్లు పెట్టే అంశం తదితరాలపై ఈ సమావేశంలో చర్చ జరగనున్నది. ఎస్సార్పీసీ సభ్యుడిగా ఉన్నందున ఆయన ఈ సమావేశానికి వెళ్ళినట్లు రాష్ట్ర విద్యుత్ శాఖ అధికారులు పేర్కొన్నారు.

గడిచిన తొమ్మిదిన్నరేళ్ళలో రాష్ట్ర విద్యుత్ రంగంలో (ట్రాన్స్ కో, జెన్ కో, రెండు డిస్కంల) అప్పులు పేరుకుపోయాయని, ప్రభుత్వం నుంచి బకాయిలు సకాలంలో చెల్లింపు కాకపోవడం, థర్మల్ విద్యుత్ ఉత్పత్తి అంశంలో సింగరేణికి జెన్-కో బకాయి పడడం, ప్రభుత్వ కార్యాలయాల నుంచి విద్యుత్ బిల్లుల చెల్లింపు లేకపోవడంతో డిస్కంలు అప్పుల్లో కూరుకుపోవడం.. ఇలాంటి అనేక అంశాలతో ఉత్తర, దక్షిణ డిస్కంలు రుణాల ఊబిలో కూరుకుపోయాయి. సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో గురువారం జరిగిన తొలి క్యాబినెట్ మీటింగ్‌లో విద్యుత్ రంగంపై లోతుగా చర్చ జరిగింది. అధికారుల నుంచి సరైన సమాచారం రాకపోవడంతో సీఎండీ ప్రభాకర్ రావును సమావేశానికి తీసుకురావాల్సిందిగా ఆ శాఖ అధికారులను ఆదేశించిన సీఎం.. శుక్రవారమే రివ్యూ మీటింగ్ ఉంటుందని స్పష్టం చేశారు.

సీఎండీ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు రాజీనామా లేఖ రాసినా దానికి ఇప్పటివరకూ ప్రభుత్వం ఆమోదించకపోవడంతో ఇకపైన కూడా ఆమోదించవద్దని అధికారులను సీఎం స్పష్టం చేశారు. ఆ రంగానికి సంబంధించిన ఆర్థికపరమైన అంశాలపై సీఎండీ నుంచి వివరణ తీసుకోవాలన్న ఉద్దేశంతో ఈ సమావేశంలో ఆయనను భాగస్వామిని చేయాలనుకున్నారు ముఖ్యమంత్రి. కానీ ఆయన గైర్హాజరు అవుతుండడంతో ఆయన తరపున ఎవరు ప్రాతినిథ్యం వహిస్తారు, తొమ్మిదిన్నరేళ్ళలో అప్పులు, బకాయిలు తదితరాలపై ఎవరు వివరాలు ఇస్తారు, తదుపరి సమావేశాన్ని ఎప్పుడు ఫిక్స్ చేయాలి తదితర అంశాలపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోనున్నది.

సీఎండీ ప్రభాకర్ రావు ఈ సమావేశానికి గైర్హాజరైనా విద్యుత్ శాఖ తరపున రెండు డిస్కంల తరఫున సీఎండీలు, విద్యుత్ శాఖ కార్యదర్శి సునీల్ శర్మ, సింగరేణి సీఎండీ శ్రీధర్, ఆర్థిక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు తదితరులు ఈ సమావేశంలో పాల్గొని విద్యుత్ రంగానికి సంబంధించిన కీలకమైన అంశాలపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరాలు అందించారు.

Tags:    

Similar News