CM Revanth: తెలంగాణ భద్రతపై మరింత ఫోకస్ చేయాల్సిన అవసరముంది

దేశ, రాష్ట్ర అంత‌ర్గ‌త భ‌ద్ర‌త‌ను దృష్టిలో ఉంచుకొని కొత్తగూడెం జిల్లా చర్ల మండలం కొండవాయి, ములుగు జిల్లా వెంకటాపురం మండలం

Update: 2024-10-07 16:17 GMT

దిశ, వెబ్‌డెస్క్: దేశ, రాష్ట్ర అంత‌ర్గ‌త భ‌ద్ర‌త‌ను దృష్టిలో ఉంచుకొని కొత్తగూడెం జిల్లా చర్ల మండలం కొండవాయి, ములుగు జిల్లా వెంకటాపురం మండలం ఆలుబాక గ్రామాల్లో సీఆర్ఫీఎఫ్ జేటీఎఫ్ (జాయింట్ టాస్క్ ఫోర్స్) క్యాంపులను ఏర్పాటు చేయాల‌ని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాకు ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞ‌ప్తి చేశారు. ఎస్పీవో (స్పెషల్ పోలీస్ ఆఫీసర్స్)ల‌కు చెల్లించాల్సిన నిధుల్లో కేంద్రం వాటాగా రావాల్సిన 60% ఫండింగ్ నాలుగేళ్లుగా పెండింగ్‌లో ఉన్నద‌ని, ఆ మొత్తాన్ని (రూ.18.31 కోట్లు) వెంటనే విడుదల చేయాల‌ని కోరారు. వామపక్ష ప్రభావిత ప్రాంతాల్లో అవసరాలకు అనుగుణంగా 1,065 మందిని ఎస్పీవోల్లో చేర్చుకోవాల్సి ఉన్నదని, కానీ ఇందుకు గతంలో రూపొందించిన నిబంధనలను స‌డ‌లించాలని కోరారు.

గతంలో వామ‌ప‌క్ష తీవ్ర‌వాద ప్ర‌భావిత (ఎల్‌డ‌బ్ల్యూఈ) జిల్లాల జాబితాలో ఆదిలాబాద్‌, మంచిర్యాల‌, ఆసిఫాబాద్ జిల్లాల‌ ఉండేవని, కానీ ఆ తర్వాత వీటిని తొలగించారని, ఇప్పుడు మళ్లీ వాటిని లిస్టులో చేర్చాల‌ని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాను ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి కోరారు. మావోయిస్టు సమస్య బలంగా ఉన్న మ‌హారాష్ట్ర, ఛ‌త్తీస్‌గ‌ఢ్‌ల‌తో తెలంగాణ‌కు సరిహద్దు ఉన్నందున లల అలాంటి సరిహద్దుల్లోని ములుగు జిల్లా పేరూరు, ములుగు, క‌న్నాయిగూడెం, జ‌య‌శంక‌ర్ భూపాల‌ప‌ల్లి జిల్లాలోని ప‌లిమెల‌, మహాముత్తారం, కాటారం తదితర పోలీస్ స్టేష‌న్ల‌ను బ‌లోపేతం చేయాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు. తెలంగాణ పోలీస్ శాఖ కొత్త‌గా నియ‌మితులైన సిబ్బందికి గ్రేహౌండ్స్ ద్వారా తీవ్ర‌వాద వ్య‌తిరేక వ్యూహాల్లో (యాంటీ ఎక్స్ ట్రీమిస్ట్స్ ట్రెయినింగ్) శిక్ష‌ణ ఇప్పిస్తున్న‌ట్లు ముఖ్య‌మంత్రి తెలిపారు.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024-25)లో ఈ ర‌క‌మైన శిక్ష‌ణ‌కు అదనంగా రూ. 25.59 కోట్లు ఖర్చవుతున్నదని, ఈ ఫండ్‌ను విడుద‌ల చేయాల‌ని ముఖ్య‌మంత్రి విజ్ఞ‌ప్తి చేశారు. ఆధునిక అవ‌స‌రాల‌కు అనుగుణంగా పోలీసు ద‌ళాలను తీర్చిదిద్దే ప‌నుల‌కు ఉద్దేశించిన ప్ర‌త్యేక మౌలిక‌వ‌స‌తుల ప‌థ‌కం (స్పెషల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ స్కీమ్)కు తెలంగాణ‌కు కేవ‌లం రూ. 6.70 కోట్లు మాత్ర‌మే విడుద‌లైందని, ఇది ఏమాత్రం స‌రిపోనందున అద‌నంగా రూ. 23.56 కోట్లను విడుద‌ల చేయాల‌ని కోరారు.


Similar News