సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం.. ఇక ఆ బోర్డులో మహిళలకు చాన్స్

యూనివర్శిటీ రిక్రూట్మెంట్ బోర్డులో మహిళలకు అవకాశం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఈ మేరకు కేంద్రానికి లేఖ రాసినట్టు తెలిసింది.

Update: 2024-09-10 03:23 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: యూనివర్శిటీ రిక్రూట్మెంట్ బోర్డులో మహిళలకు అవకాశం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఈ మేరకు కేంద్రానికి లేఖ రాసినట్టు తెలిసింది. దీంతో రాష్ట్రపతి వద్ద ఇంతకాలం పెండింగ్‌లో ఉన్న రిక్రూట్మెంట్ బోర్డు బిల్లుకు ఆమోదం లభిస్తుందని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి.

బీఆర్ఎస్ హయాంలో మహిళలకు నో ఛాన్స్

బీఆర్ఎస్ హయాంలో 2022 జూన్ లో ‘ది తెలంగాణ యూనివర్శిటీస్ కామన్ రిక్రూట్ మెంట్ బోర్డు’ ఏర్పాటు చేశారు. హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్ బోర్డుకు చైర్మన్ గా, ఎడ్యుకేషన్, ఫైనాన్స్ సెక్రటరీలు సభ్యులుగా, కళాశాల విద్యాశాఖ కమిషనర్ కన్వీనర్ గా ఎంపిక చేశారు. ఈ బిల్లును అప్పటి గవర్నర్ తమిళి సైకి పంపగా, ఆమె బిల్లుపై సంతకం చేయకుండా, రాష్ట్రపతి ఆమోదానికి పంపారు. దీంతో కేంద్ర హోంశాఖ రాష్ట్రం పంపిన బిల్లుపై కేంద్రంలోని వివిధ శాఖల అభిప్రాయాలను తీసుకున్నది. బోర్డులో మహిళలకు చోటు కల్పించకపోవడంపై మహిళా శిశు సంక్షేమ శాఖ అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో బోర్డులో మహిళా సభ్యులు తప్పనిసరిగా ఉండాలని కేంద్రం సూచించింది. ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి వద్దే విద్యాశాఖ ఉండటంతో, ఈ విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లగా, ‘బోర్డులో మహిళకు అవకాశం కల్పించడం సబబుగా ఉంటుంది’ అని ఆయన అభిప్రాయపడినట్టు తెలిసింది. కేంద్రం ప్రతిపాదనకు ఒప్పుకోవాలని సూచించడంతో అధికారులు ఆ మేరకు లేఖ రాసినట్టు సమాచారం.

త్వరలో రాష్ట్రపతి ఆమోదం!

కేంద్రం ప్రతిపాదనకు రాష్ట్రం సానుకూలంగా స్పందించడంతో వర్సిటీ రిక్రూట్ మెంట్ బోర్డు బిల్లుకు ఆమోదం లభిస్తుందని, వెంటనే ఖాళీల భర్తీ ప్రక్రియ ప్రారంభమవుతుందని అధికారులు కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం వివిధ వర్సిటీల్లో సుమారు రెండు వేల టీచింగ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సరైన స్టాఫ్ లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కామన్ రిక్రూట్ మెంట్ బోర్డును వ్యతిరేకిస్తూ బిల్లును రద్దు చేస్తారేమోనని ప్రచారం జరిగింది. కానీ పలువురు నిపుణుల సూచనల మేరకు బోర్డు ఆధ్వర్యంలోనే నియామకాలు చేపట్టాలని నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తున్నది.


Similar News