CM Revanth: పవర్ ప్లాంట్ల పేరిట రాష్ట్రంలో భారీ దోపిడీ
పవర్ ప్లాంట్ల పేరిట రాష్ట్రంలో భారీ దోపిడీ జరిగిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. సోమవారం అసెంబ్లీలో విద్యుత్ శాఖపై జరిగిన చర్చలో భాగంగా ఆయన మాట్లాడారు.
దిశ, వెబ్‌డెస్క్: పవర్ ప్లాంట్ల పేరిట రాష్ట్రంలో భారీ దోపిడీ జరిగిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. సోమవారం అసెంబ్లీలో విద్యుత్ శాఖపై జరిగిన చర్చలో భాగంగా ఆయన మాట్లాడారు. యాదాద్రి పవర్ ప్లాంట్ ఒప్పందం రూ.25 వేల కోట్లకే జరిగిందని.. కానీ ఇప్పుడు అది రూ.40 వేల కోట్లకు వ్యయం పెరిగే అవకాశం ఉందని అన్నారు. ఎన్టీపీసీ నుంచి పవర్ తీసుకునే అవకాశం ఉందని.. పర్ మెగావాట్‌కు రెండున్నర కోట్ల అంచనాలు పెంచారని తెలిపారు. భద్రాద్రి, యాదాద్రి పవర్ ప్లాంట్లలో అవినీతిని తేల్చేందుకే విద్యుత్ శాఖపై కమిషన్ వేశామని చెప్పారు.
అసలు ఎన్టీపీసీతో అగ్రిమెంట్ చేసుకున్నది తాము అని అన్నారు. అందుకే కమిషన్‌ను రద్దు చేయాలని కోర్టుకు వెళ్లారు. కోర్టులో మొట్టికాయలు పడగానే.. గొంతులో వెలక్కాయపడ్డట్లయిందని తెలిపారు. 45 శాతం అంచనాలు పెంచి విద్యుత్ సంస్థల్ని నష్టాల్లో ముంచారని అన్నారు. ఇవాళ జగదీశ్ రెడ్డి, కేసీఆర్‌లు సత్యహరిశ్చంద్రులు అనేలా మాట్లాడుతున్నారని విమర్శించారు. లోకల్ సెంటిమెంట్‌ను రగిల్చేందుకే జగదీశ్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. జగదీశ్ రెడ్డి మీద నల్లగొండ ప్రజలకు ఎంత విశ్వసనీయత ఉందో మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో తెలిసిపోయిందని ఎద్దేవా చేశారు.