CM Revanth Reddy: ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యలకు సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్
ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యలకు సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు.
దిశ, తెలంగాణ బ్యూరో/డైనమిక్ బ్యూరో: ప్రజలకు తాము ఇచ్చిన ప్రతి వాగ్దానం నెరవేర్చే విషయంలో నిబద్ధతతో ఉన్నామని, బీజేపీ పాలిత రాష్ట్రాలతో పోలిస్తే తమదే రికార్డు అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) స్పష్టం చేశారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలపై ప్రధాని మోడీ (Pm Narendra Modi) నిన్న చేసిన విమర్శలపై ఇవాళ ఎక్స్ వేదికగా సీఎం స్పందించారు. ప్రధాని వ్యాఖ్యలు అవాస్తవాలని ఖండించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన నాటి నుంచి బీఆర్ఎస్ హయాంలో నెలకొన్న చీకటి, నిరాశను పారదోలుతున్నామని పేర్కొన్నారు. కాంగ్రెస్ పాలనలో తెలంగాణ ఉదయిస్తున్న సూర్యుడిలా వెలుగుతోందన్నారు. హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నామంటూ ట్వీట్ చేశారు.
అధికారంలోకి వచ్చిన రెండు రోజుల్లోనే..
కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యతలు స్వీకరించిన రెండురోజుల్లోనే ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం (Free Bus Journey), రాజీవ్ ఆరోగ్యశ్రీ (Rajiv Aarogyasri) కింద రూ.10 లక్షల సదుపాయాన్ని అమల్లోకి తీసుకొచ్చామని సీఎం గుర్తు చేశారు. ఏడాది కాలంలోపే 22.22 లక్షల మంది రైతులకు రూ. 18 వేల కోట్లకు పైగా రుణమాఫీ (Loan Waiver) చేశామన్నారు. అలాగే 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు (Free Electricity) ఇస్తున్నామని పేర్కొన్నారు. గ్యాస్ సిలిండర్‌పై రూ. 500 సబ్సిడీ ఇస్తున్నామని, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఉన్న ధరలతో పోలిస్తే తెలంగాణలో గ్యాస్ సిలిండర్‌ను (subsidy gas cylinder) తక్కువకే ఇస్తున్నామన్నారు. ఇప్పటివరకు 1.31 కోట్లకు పైగా గ్యాస్ సిలిండర్ రీఫిల్లింగ్స్ జరిగాయని, 42,90,246 మంది లబ్ధిపొందారని తెలిపారు. దీంతోపాటు అన్ని పోటీ పరీక్షలను విజయవంతంగా నిర్వహిస్తున్నామన్నారు. 11 నెలల్లోనే 50 వేలకు పైగా ఉద్యోగ నియామకాలు చేపట్టామని సీఎం వెల్లడించారు. నియామకాల్లోనూ ఏ బీజేపీ పాలిత రాష్ట్రంతో పోల్చినా తమదే రికార్డు అని పేర్కొన్నారు.
మూసీ పునరుజ్జీవానికి నడుం బిగించాం..
మూసీ (MUSI) పునరుజ్జీవానికి నడుం బిగించామని, నదిని శుభ్రం చేసి పూర్వ వైభవం తీసుకొస్తామని సీఎం పేర్కొన్నారు. గత 10 ఏళ్లలో ఆక్రమణలకు గురైన చెరువు, కుంటలు, నాలాలను పరిరక్షించే చర్యలు చేపట్టామని తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఒక్క అంగుళం సరస్సు కూడా ఆక్రమణకు గురికాలేదన్నారు. అలాగే ఫ్యూచర్ సిటీకి (future city) మాస్టర్‌ప్లాన్ ఖరారు చేస్తున్నామని, స్కిల్ వర్సిటీ, స్పోర్స్ట్ వర్సిటీ, ఇంటిగ్రెటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం రాసుకొచ్చారు.
మోడీ ఏమన్నారంటే..
అయితే ఆర్థికంగా చేయగలిగే హామీలు మాత్రమే ఇవ్వాలని తమ పార్టీ నేతలకు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే సూచించిన నేపథ్యంలో ప్రధాని మోడీ శుక్రవారం ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. బూటకపు వాగ్దానాలు చేయడం సులభమే కానీ వాటిని అమలుపరచడం చాలా కష్టమని కాంగ్రెస్ గ్రహిస్తోందని విమర్శించారు. అమలుకు సాధ్యం కాని హామీలు ఇచ్చి ఇప్పుడు ప్రజల ముందు ఘోరంగా నిలబడ్డారని ధ్వజమెత్తారు. తెలంగాణ, కర్ణాటక, హిమాచల్‌ప్రదేశ్‌లో అభివృద్ధి కుంటుపడిందన్నారు. ఫేక్ ప్రామిసెస్ ఆఫ్ కాంగ్రెస్ అనే హ్యాష్ ట్యాగ్‌తో ప్రధాని ట్వీట్స్ చేశారు.