ఈ ప్రభుత్వంలో సర్వమతాలకు స్వేచ్ఛ.. జగన్నాథ్ రథయాత్రను ప్రారంభిచిన సీఎం రేవంత్ రెడ్డి!

హైదరాబాద్ ఇస్కాన్ టెంపుల్ ఆధ్వర్యంలో జరుగుతున్న జగన్నాథ్ రథయాత్రను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు.

Update: 2024-07-07 11:14 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్ ఇస్కాన్ టెంపుల్ ఆధ్వర్యంలో జరుగుతున్న జగన్నాథ్ రథయాత్రను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జగన్నాధుడికి హారతి ఇచ్చిన రేవంత్ రెడ్డి.. సంప్రదాయం ప్రకారం రథయాత్ర పరిసరాలను చీపురుతో ఊడ్చారు. ఆయనతో పాటు కాంగ్రెస్ మాజీ రాజ్యసభ సభ్యుడు అంజన్ కుమార్ యాదవ్ సహా పలువురు కాంగ్రెస్ నాయకులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఈ ప్రభుత్వం అందరిదీ అని, మత సమారస్యాన్ని కాపాడుతుందని, సర్వమాతాలకు స్వేచ్ఛనిచ్చి వాళ్ల భావజాలాన్ని ఇతరులకు వివరించుకోవడానికి అవకాశం ఇస్తుందన్నారు.

భక్తులకు అవసరమైన ఏర్పాట్లు చేయడమే కాకుండా.. హరేకృష్ణకు సంబంధించిన శోభాయాత్రలో పాల్గొనడం మంచి అనుభూతినిచ్చిందని పేర్కొన్నారు. రాష్ట్రం సుభీక్షంగా ఉండాలని, పాడి పంటలతో వర్ధిల్లాలని ఇస్కాన్ సంస్థ ఏ విధంగా ప్రార్థన చేస్తుందో.. వారి ప్రార్ధనలు తెలంగాణ రాష్ట్రానికి మేలు చేకూరుస్తాయని బలంగా విశ్వసిస్తున్నానన్నారు. అందుకే ఈ రోజు సర్వమత సమ్మేళనంలో భాగంగా.. అందరినీ సమానంగా చూడాలనే భావనతో ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగిందన్నారు. ఏ అవకాశం వచ్చినా.. ఇలాంటి కార్యక్రమాలను ప్రోత్సహించడం ద్వారా సమాజంలో హింసను తగ్గించి, ఒక ప్రశాంతమైన వాతవరణంలో మానవ సేవే మాధవ సేవ అనే సూక్తిని అందరికీ చేరే విధంగా మా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.


Similar News