కీర్తించడంతో సరిపెట్టి.. తీవ్ర నిరాశను మిగిల్చిన సీఎం కేసీఆర్!

పెద్దాయన వస్తే నిధులు వరద పారుతుందని.. తమ ప్రాంతంలో నెలకొన్న ప్రధాన సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని ఆశించిన వారికి నిరాశే ఎదురైంది.

Update: 2022-12-08 02:09 GMT

దిశ, కరీంనగర్ బ్యూరో: పెద్దాయన వస్తే నిధులు వరద పారుతుందని.. తమ ప్రాంతంలో నెలకొన్న ప్రధాన సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని ఆశించిన వారికి నిరాశే ఎదురైంది. పల్లె నుంచి పట్నం వరకు ప్రతి చోటు గురించి సంపూర్ణ అవగాహన ఉన్న ఉద్యమ నేత తమ జిల్లాకు వస్తున్నాడంటే వరాల జల్లులో తడిసి ముద్దయిపోతామని భావించిన ఆ జిల్లా వాసులకు కాస్త నిరాశే ఎదురైంది. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ జగిత్యాల పర్యటనలో మంజూరీలు ప్రకటించకపోవడం జిల్లా వాసులను విస్మయానికి గురి చేసింది.

భూషణ 'వికాసం' ఏమైందో..?

'భూషణ వికాస శ్రీ ధర్మపురి నివాస' అంటూ ధర్మపురి శ్రీ లక్ష్మీ నారసింహున్ని కీర్తించిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలయ వికాసాన్ని మాత్రం పట్టించుకోవడం లేదన్న విమర్శలు వెల్లువెత్తాయి. రాష్ట్ర ప్రభుత్వం అట్టహాసంగా చేపట్టిన గోదావరి పుష్కరాలకు సీఎం ధర్మపురికే అత్యధిక ప్రాధాన్యం ఇచ్చారు. ఏడేళ్ల క్రితం జరిగిన ఈ పుష్కరాలను లాంఛనంగా సీఎం కేసీఆర్ ఇక్కడి నుంచే ప్రారంభించారు. ఈ సందర్భంగా ధర్మపురి ఆలయ అభివృద్ధి కోసం రూ. 100 కోట్లు కేటాయిస్తున్నట్టు ప్రకటించినప్పటికీ నేటికీ ఆ నిధులతో పనులు చేపట్టడం లేదని స్థానికులు అంటున్నారు. దక్షిణ భారత దేశంలోనే అత్యంత అరుదైన ఆలయాల్లో ఒకటిగా నిలవడమే కాకుండా నేలపై నరసింహుడు వెలసిన ఏకైక క్షేత్రం ధర్మపురి అని అయితే ఈ ఆలయం కోసం మంజూరు చేసిన వంద కోట్ల ఊసే లేకుండా పోవడంపై స్థానికులు నిరాశ వ్యక్తం చేశారు.

ఇదే జిల్లాలో ఉన్న మరో ప్రసిద్ధ ఆలయం కొండగట్టు అంజన్న గుడికి రూ. వంద కోట్లు కేటాయిస్తున్నామని సీఎం ప్రకటించారు. ఇక్కడ తానే దగ్గరుండి అభివృద్ధి కార్యక్రమాలు చేపడతానని ప్రకటించారు. దీంతో ధర్మపురి వంతయిపోయింది... కొండగట్టు వంతు వచ్చిందా? అని స్థానికులు కామెంట్ చేస్తున్నారు. తీపి కబురందించని వైనం తమ జిల్లాలో పర్యటిస్తున్న నేపథ్యంలో తమకు తీపి కపురు చెప్తారని చెరుకు రైతులు ఆశించినప్పటికీ వారికి చేదు అనుభవమే మిగిలిపోయింది. ముత్యంపేట చక్కర ఫ్యాక్టరీ తెరిపించే విషయంలో సీఎం కేసీఆర్ స్పష్టత ఇస్తారని ఆశించినప్పటికీ ఫలితం లేకుండా పోవడం రైతాంగాన్ని విస్మయపరిచింది. చక్కెర ఫ్యాక్టరీ పునరుద్ధరణ కోసం తాను అన్ని విధాలుగా కృషి చేస్తానని కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు గతంలో ప్రకటించారు. అయితే ఆయన హామీ ఇచ్చి ఏండ్లు గడుస్తున్నా లాభం లేకుండా పోయిందని వేదనకు గురువతున్న రైతులు సీఎం పర్యటన నేపథ్యంలో సానుకూల ప్రకటన వస్తుందని ఆశించినప్పటికీ వారికి భంగపాటు తప్పలేదు.

ఎన్ఆర్ఐ పాలసీ పైనా...

అంతేకాకుండా ఎన్ఆర్ఐల పాలసీపై కూడా సీఎం ఈ సభలో క్లారిటీ ఇస్తారని భావించినప్పటికీ ఆ ఊసే ఎత్తలేదు. పొట్ట చేత పట్టుకుని అప్పులు చేసి విదేశాలకు వెళ్లి కూలీ నాలీ చేసుకుంటూ జీవనం సాగిస్తున్న వారు జగిత్యాల జిల్లాలో వేలాదిగా ఉంటారు. వారికి భరోసా కల్పించే విషయంలో సీఎం ప్రకటన చేసినట్టయితే పార్టీకి జిల్లాలో సానుకూలత వ్యక్తం అయ్యేదన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. విదేశాలకు వెళ్లిన వలస పక్షుల కోసం ప్రత్యేక చర్యలు తీసుకునే విషయంలో సీఎం నోటి నుంచి ఓ ప్రకటన వెలువడితే జిల్లా వ్యాప్తంగా పార్టీకి బలం చేకూరేదని, ఇప్పటికే ఎన్ఆర్ఐల కోసం ప్రత్యేక పార్టీకూడా ఆవిర్భవించిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ విధానాన్ని వ్యక్తం చేస్తే బావుండేదని అంటున్నారు.


Similar News