మిషన్ భగీరథకు కాల్ సెంటర్.. అందుబాటులో 24 గంటల సేవలు
గత ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణితో మిషన్ భగీరథ ప్రాజెక్టు కోసం కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి నిధులను సేకరించలేదు. రాష్ట్ర ప్రభుత్వ నిధులతోనే ప్రాజెక్టును ముందుకు నడిపించారు.
దిశ, తెలంగాణ బ్యూరో: గత ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణితో మిషన్ భగీరథ ప్రాజెక్టు కోసం కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి నిధులను సేకరించలేదు. రాష్ట్ర ప్రభుత్వ నిధులతోనే ప్రాజెక్టును ముందుకు నడిపించారు. ఫలితంగా ఈ ప్రాజెక్టులో ఎన్నో సమస్యలు తిష్ట వేశాయి. ఇంటింటికీ నీరందలేదు. కుళాయిలను అమర్చలేదు. పైపులైన్‌ల మరమ్మతులు, లింకేజీ తదితర అంతర పనులు అసంపూర్తిగా ఉన్నాయి. తాగునీటి ఎద్దడి ఉన్న గ్రామాలు, ఆవాసాలను గుర్తించలేదు. వీటిని గుర్తించేందుకు ఇప్పటికే సమగ్ర సర్వేను కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం నిర్వహించింది. చివరి మైలు కనెక్టివిటీని పూర్తి చేసేందుకు కొత్తగా ప్రతిపాదనలు తయారు చేసి జల్ జీవన్ మిషన్ కింద రూ. 14 వేల కోట్ల ను సేకరించాలని కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం గతంలోనే నిర్ణయించింది. వీటన్నింటిని పరిష్కరించేందుకు ప్రభుత్వం కొత్తగా 24 గంటలు పని చేసేలా కాల్ సెంటర్ ను తీసుకొచ్చింది.
24 గంటల కాల్ సెంటర్
మిషన్ భగీరథ కోసం పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ఆదేశాలతో ఎర్రమంజిల్‌లోని మిషన్ భగీరథ ప్రధాన కార్యాలయంలో కాల్ సెంటర్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మిషన్ భగీరథ ఈఎన్సీ కృపాకర్ రెడ్డి మిషన్ భగీరథ టోల్ ఫ్రీ నెంబర్ 1800-599-4007 సోమవారం నుంచి అందుబాటులోకి వచ్చిందని వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాల్లో మిషన్ భగీరథ నీటి సరఫరాలో వచ్చే ఇబ్బందుల పై ఫిర్యాదు చేసే వెసులుబాటు దీని ద్వారా ఉంటుందని చెప్పారు. సూపరిండెంట్ ఇంజనీర్ నేతృతంలో ఐదుగురు సిబ్బందితో 24 గంటలు ఈ కాల్ సెంటర్ పని చేస్తుందని తెలిపారు. పగలు వచ్చే కాల్స్ ను అటెండ్ చేసి వివరాలు నమోదు చేసుకోవడంతో పాటు రాత్రి వచ్చే కాల్స్ ను కూడా రికార్డు చేయనున్నట్టు తెలిపారు. తొలి రోజు 9 ఫోన్ కాల్స్ వచ్చాయని వెల్లడించారు. ప్రతిరోజు ఫిర్యాదులను ఈఎన్సీ కృపాకర్ రెడ్డి ఎప్పటికప్పుడు సమీక్షించనున్నారు. 24 గంటల్లో సమస్యకు పరిష్కారం చూపేలా చర్యలు తీసుకోనున్నట్టు వెల్లడించారు.
మంత్రి సీతక్క దృష్టి
పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా మంత్రిగా సీతక్క బాధ్యతలు స్వీకరించిన తర్వాత మిషన్ భగీరథ పై ప్రత్యేక దృష్టి పెట్టారు. నిరంతరం సమీక్షలతో మిషన్ భగీరథలో సమస్యలు తలెత్తకుండా అధికారులకు ఎప్పటికప్పుడు స్పష్టమైన ఆదేశాలను జారీ చేస్తూ చివరి మైలు కనెక్టివిటీ వరకు తాగునీరు అందించేలా ప్రణాళికలను రూపొందిస్తూ ముందుకు వెళ్తున్నారు. ఈ క్రమంలోనే కలెక్టర్ల ఆధ్వర్యంలో పది రోజుల పాటు గ్రామాల వారీగా సర్వే చేయించారు. దీని కోసం ప్రత్యేక యాప్ రూపొందించారు. ప్రతి ఉద్యోగి రోజుకు 20 నుంచి 25 ఇళ్లలో సర్వే నిర్వహించాలి. ఇంటింటికీ వెళ్లి.. మిషన్ భగీరథ నీరు అందుతోందా? నల్లా కనెక్షన్ ఉందా? అది పనిచేస్తోందా? పైపుల ద్వారా నీరు వస్తుందా? ఎన్ని రోజులకు ఒకసారి వస్తుంది? లబ్ధిదారు పేరు, చిరునామా, భార్య/భర్త, ఇతర కుటుంబ సభ్యుల వివరాలు, మొబైల్ నంబర్, ఆధార్ సంఖ్య, ఇంటి నెంబర్, కులం, ఇతర వివరాలను నమోదు చేయించడం ద్వారా సమస్యల తీవ్రతను అర్థం చేసుకునేందుకు ప్రభుత్వానికి అవకాశం దొరికింది. ఫలితంగా టోల్ ఫ్రీ ద్వారా అందే ఫిర్యాదులను క్షేత్ర స్థాయికి చేరవేసి పరిష్కారానికి అవసరమైన సలహాలు, సూచనలు చేయడంతో పాటు పరిష్కారం కోసం అవసరమయ్యే ఏర్పాట్లను సైతం మిషన్ భగీరథ కార్యాలయ సిబ్బంది చేయనున్నది. మిషన్ భగీరథ నీటిపై ప్రజలకు విశ్వాసం కల్పించేలా అవగాహన కార్యక్రమాలను నిర్వహించనున్నారు.
నీటి సరఫరా, లీకేజీలు..
ప్రధానంగా నీటి సరఫారాలో లీకేజీలు, అవాంతరాలను అరికట్టేందుకు ఈ టోల్ ఫ్రీ నెంబర్ ను ఏర్పాటు చేశారు. తాగునీటి సరఫరా సజావుగా సాగేలా చూసేందుకు గ్రామాలలో మంచి నీటి సహయకుల నియామకం ద్వారా ఎలాంటి సమస్య ఉత్పన్నమైనా తక్షణం రంగంలోకి దిగి మరమ్మత్తులు చేసేలా శిక్షణ ఇచ్చారు. ఒకవేళ మిషన్ భగీరథ సరఫరాలో ఇబ్బందులు తలెత్తితే ప్రత్నామ్నాయ మార్గాల ద్వారా తాగునీటిని సరఫరా చేసేలా ఏర్పాట్లను చేశారు. గత బీఆర్ఎస్ సర్కార్ పట్టించుకోని 64, 218 చేతి పంపులను, 45,882 సింగిల్ ఫేజ్ మోటర్లను, 32, 517 పీడబ్ల్యూడీ (పైప్డ్ వాటర్ సప్లై) మోటర్లను రిపేర్ చేయించి వినియోగం లోకి తీసుకు వచ్చారు. కాల్ సెంటర్ ఏర్పాటుతో గ్రామీణ నీటి సరఫరా సమస్యలకు ప్రభుత్వం చెక్ పెట్టింది.