MLC Kavitha: ఎమ్మెల్సీ కవిత కీలక నిర్ణయం.. త్వరలో జిల్లాల టూర్‌కు ప్లాన్!

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించనున్నారు.

Update: 2024-12-24 02:12 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించనున్నారు. దీని కోసం బీఆర్ఎస్‌తో పాటు జాగృతి సైతం ప్రణాళికలు రూపొందిస్తున్నది. తెలంగాణ అస్తిత్వం, బతుకమ్మ, రైతు, మహిళా, బీసీ అంశాలే ప్రధాన ఎజెండాతో ముందుకు వెళ్లాలని భావిస్తున్నారు. ఈ టూర్‌లో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు కేడర్‌ను సన్నద్ధం చేసేలా ప్లాన్ చేస్తున్నారు.

అన్ని జిల్లాల్లో పర్యటించేలా..

పథకాల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వ జాప్యం అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేలా కవిత టూర్ ఉండబోతున్నట్టు తెలుస్తున్నది. మరో వైపు పార్టీ కేడర్‌ను రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధం చేయాలని కాన్సెప్ట్‌తో కవిత రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ పర్యటించన్నారు. ఏ జిల్లా నుంచి పర్యటించాలనే దానిపై ఓ వైపు పార్టీ, మరోవైపు జాగృతి కలిసి కార్యాచరణ రూపొందిస్తున్నాయి. నేతల అభిప్రాయాలు క్రోడీకరించి మంథని, జగిత్యాల, నల్లగొండతో పాటు అన్ని జిల్లాల్లోనూ వరుస కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు పార్టీ నేతలు తెలిపారు. దీనికి సంబంధించి త్వరలో షెడ్యూల్ విడుదల చేయనున్నట్టు సమాచారం.

తెలంగాణ అస్తిత్వం, బతుకమ్మపై ఉద్యమ కార్యాచరణ

తెలంగాణ అస్తిత్వాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం దెబ్బతీసే కుట్ర చేస్తున్నదని దానిని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కవిత సన్నద్ధమవుతున్నారు. అన్ని జిల్లాల్లో తెలంగాణ అస్తిత్వంపై జరుగుతున్న దాడిని వివరించాలని భావిస్తున్నారు. రాష్ట్రంలోని గ్రామ గ్రామాన ఉద్యమ తెలంగాణ తల్లి విగ్రహాలను ప్రతిష్టించేందుకు సిద్ధమవుతున్నారు. అందుకోసం పార్టీతో పాటు జాగృతి నేతలకు సైతం పిలుపు ఇవ్వనున్నట్లు సమాచారం.

ప్రభుత్వ పథకాలు, ప్రజా సమస్యలు, బీసీల రిజర్వేషన్లపై

రైతు భరోసా, రైతుబీమా, యాంత్రీకరణ, రైతురుణమాఫీ, భూభారతి అంశాల్లో కాంగ్రెస్ విఫలమైందని కవిత ప్రజలకు వివరించేందుకు సిద్ధవుతున్నారు. మహిళలకు ప్రభుత్వం ఇస్తానన్న రూ.2,500, పెన్షన్ పెంపు, నిరుద్యోగులకు ఉద్యోగాల కల్పన, పోలీసుల ప్రాబ్లమ్స్, గురుకులాల సమస్యలు ఇలాంటి వన్నీ ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కార్యాచరణను రూపొందిస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. రాబోయే స్థానిక సంస్థల్లో బీసీ జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించాలని ఇప్పటికే జాగృతి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించారు. డెడికేషన్ కమిషన్ పై ఒత్తిడి మరింత పెంచాలని జాగృతి, బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. అందులో భాగంగానే అన్ని మండల, నియోజకవర్గ కేంద్రాల్లో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించనున్నారు. వారి అభిప్రాయాల మేరకు బీసీ ఉద్యమ కార్యాచరణ రూపొందించనున్నట్టు తెలుస్తున్నది.

Tags:    

Similar News