T BJP: టీ బీజేపీకి నయా చీఫ్..! సంక్రాంతి నాటికి నియమించేలా హైకమాండ్ కసరత్తు
వచ్చేనెల చివరి నాటికి టీబీజేపీకి కొత్త చీఫ్‌ను నియమించేందుకు అధిష్టానం కసరత్తు చేస్తున్నది.
దిశ, తెలంగాణ బ్యూరో: వచ్చేనెల చివరి నాటికి టీబీజేపీకి కొత్త చీఫ్‌ను నియమించేందుకు అధిష్టానం కసరత్తు చేస్తున్నది. సంక్రాంతి నాటికి సంస్థాగత ఎన్నికలను పూర్తి చేయాలని భావిస్తున్నది. ఇందులో భాగంగానే ఇందులో భాగంగానే టీబీజేపీ రాష్ట్ర ఇన్‌చార్జి సునీల్ బన్సల్ వరుసగా సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఆయా జిల్లాల వారీగా సంస్థాగత ఎన్నికల సరళిపై ఆరా తీస్తున్నారు. ఈ ఎన్నికల అనంతరం పార్టీకి కొత్త సారథిని నియమించాలని పార్టీ పెద్దలు భావిస్తున్నారు.
30 జిల్లాల నేతలతో సమావేశం
నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అధ్యక్షతన సునీల్ బన్సల్ ఆయా జిల్లాల అధ్యక్షులు, నాయకులతో వరుసగా సమీక్షలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా సోమవారం ఒకేరోజు 30 జిల్లాలకు (బీజేపీ దృష్టిలో తెలంగాణలో మొత్తం 38 జిల్లాలు) చెందిన నేతలతో ఆయన సమావేశమయ్యారు. ఒక్కో రౌండ్‌కు 8 జిల్లాల చొప్పున రివ్యూ చేపట్టారు. బూత్, మండల కమిటీ అధ్యక్షుల ఎన్నికలపై సమీక్ష నిర్వహించినట్టు తెలిసింది. సంక్రాంతి నాటికి జిల్లాల అధ్యక్ష ఎన్నికలు పూర్తిచేయాలని ఆయన వారికి దిశానిర్దేశం చేశారు. కాగా సునీల్ బన్సల్ మంగళవారం మరో 8 జిల్లాలకు చెందిన నేతలతో నేడు సమీక్ష నిర్వహించనున్నారు. దీంతో పాటుగా పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలతోనూ సునీల్ బన్సల్ సమావేశం కానున్నట్టు తెలుస్తున్నది.
కాస్త ఆలస్యం..
ఈ నెల చివరి నాటకే రాష్ట్రానికి కొత్త అధ్యక్షుడి నియామకం పూర్తిచేయాలని బీజేపీ జాతీయ నాయకత్వం తొలుత భావించింది. కానీ సంస్థాగత ఎన్నికలు, బూత్ కమిటీల నియామకం పూర్తికాకపోవడంతో కాస్త ఆలస్యం కానుంది.