New Railway Project : తెలుగు రాష్ట్రాలకు రైల్వేశాఖ భారీ గుడ్ న్యూస్

తెలుగు రాష్ట్రాల ప్రజలకు రైల్వేశాఖ భారీ గుడ్ న్యూస్ తెలిపింది.

Update: 2024-12-24 16:00 GMT

దిశ, వెబ్ డెస్క్ : తెలుగు రాష్ట్రాల ప్రజలకు రైల్వేశాఖ భారీ గుడ్ న్యూస్ తెలిపింది. రెండు రాష్ట్రాల మధ్య మరో రైల్వే లైన్ అందుబాటులోకి రానుంది. ఇది అందుబాటులోకి వస్తే రైల్వే కనెక్టివిటీ మరింత పెరగనుంది. సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న భద్రాచలం రోడ్డు(కొత్తగూడెం) - కొవ్వూరు రైల్వే లైన్(Bhadrachalam Road-Kovvuru Railway Line) ప్రాజెక్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రూ.2,155 కోట్ల అంచనా వ్యయంతో పనులు మంజూరు చేయడంతో త్వరలోనే ఈ ప్రాజెక్టు పట్టాలెక్కనుంది. ఏపీ ప్రభుత్వంతో 50 శాతం కాస్ట్ షేరింగ్ ప్రాతిపదికన ప్రాజెక్టును మంజూరు చేశారు. ఇటీవల లోక్‌సభలో రాజమండ్రి ఎంపీ పురందేశ్వరి(MP Purandeshwari) అడిగిన ప్రశ్నకు కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్(Ashwini Vaishnav) ఈ రైల్వే ట్రాక్ నిర్మాణంపై లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. 119 కి.మీ కొత్త రైల్వే లైన్ ప్రాజెక్ట్‌ను ఏపీ ప్రభుత్వం 50 శాతం కాస్ట్ షేరింగ్ ప్రాతిపదికన మంజూరు చేయబడిందని ఆయన పార్లమెంట్‌లో వెల్లడించారు.

కాగా, భద్రాచలం రోడ్డు-కొవ్వూరు (ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా) రైల్వే లైను మొదటిసారిగా 1969-70లో ప్రారంభించారు. ఈ సమయంలో లొకేషన్ సర్వే కూడా జరిగింది. అయితే కొన్ని కారణాల వల్ల ప్రాజెక్టు పట్టాలెక్కలేదు. భద్రాచలం రోడ్డు-కొవ్వూరు లైన్‌లో భాగమైన కొత్తగూడెం, సత్తుపల్లి మధ్య 56.25 కి.మీ పొడవైన రైలు మార్గం ఇప్పటికే అందుబాటులో ఉంది. రూ.990 కోట్లతో 2022 మేలో ఈ ట్రాక్ పనులు పూర్తి చేశారు. బొగ్గు రవాణాకు రైల్వే ట్రాక్ అవసరం కావటంతో ఇందులో 70 శాతం నిధులను సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL) అందించింది. అయితే మిగిలిన పనుల పూర్తికి అనేక సర్వేలు జరిగాయి కానీ పట్టాలెక్కలేదు. 2009లో అప్పటి కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి KH మునియప్ప లోక్‌సభలో ఒక ప్రశ్నకు సమాధానంగా.. ప్రతిపాదిత బ్రాడ్‌గేజ్ లైన్ కోసం తుది లొకేషన్ సర్వే పూర్తయిందని చెప్పారు.

Tags:    

Similar News