హీరో సాయిధరమ్ తేజ్ రిక్వెస్ట్ కి స్పందించిన సీఎం, డిప్యూటీ సీఎం!.. అతని అభ్యర్ధన ఏంటంటే?

సోషల్ మీడియా వేదికగా సినీ హీరో సాయిధరమ్ తేజ్ చేసిన అభ్యర్ధనకు సీఎం రేవంత్ రెడ్డి సహా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పందించారు.

Update: 2024-07-07 13:00 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: సోషల్ మీడియా వేదికగా సినీ హీరో సాయిధరమ్ తేజ్ చేసిన అభ్యర్ధనకు సీఎం రేవంత్ రెడ్డి సహా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పందించారు.అంతేగాక దీనిపై తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు. ఫన్ పేరుతో చిన్న పిల్లలపై అసభ్యకరమైన జోకులు వేస్తూ కొందరు వ్యక్తులు చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీనిపై సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ స్పందిస్తూ.. ఇది అసహ్యకరమైనదే కాకుండా భయానకంగా కూడా ఉందని, మనం ఎక్కువగా ఉపయోగించే సామాజిక వేదికలపై ఫన్ అండ్ డాంక్ పేరుతో చిన్నపిల్లలపై అసభ్యకరమైన వీడియోలు చేసే ఇలాంటి రాక్షసులు గుర్తించబడటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే ఈ రోజుల్లో పిల్లల భద్రత చాలా అవసరమని, దయచేసి దీనిపై చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఏపీ సీఎం చంద్రబాబా నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తోపాటు మంత్రి నారా లోకేశ్ లను హీరో అభ్యర్ధించారు.

దీనిపై ముందుగా తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పందిస్తూ.. ఈ క్లిష్టమైన సమస్యను లేవనెత్తినందుకు సాయిధరమ్ తేజ్ కి ధన్యవాధాలు తెలియజేశారు. అలాగే నిజానికి పిల్లల భద్రత ప్రముఖ ప్రాధాన్యత అని, సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో పిల్లలపై జరిగే అసభ్యకరమైన, దోపిడీని నిరోధించడానికి మా ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. మన పిల్లలకు సురక్షితమైన ఆన్‌లైన్ వాతావరణాన్ని సృష్టించడానికి కలిసి పని చేద్దామని భట్టి రిప్లై ఇచ్చారు. అనంతరం రిప్లై ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి.. ఈ సమస్యను మా దృష్టికి తీసుకొచ్చినందుకు ధన్యవాదాలు అంటూ.. మన ప్రభుత్వానికి పిల్లల భద్రత అత్యంత ప్రాధాన్యత అని, ఈ ఘటనను పరిశీలించి తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దీనికి సాయిధరమ్ తేజ్ ట్విట్టర్ వేదికగా ధన్యవాదాలు తెలియజేశారు.


Similar News