ముఖ్యమంత్రి గారు.. ఎందుకంత చిన్న చూపు.. కేటీఆర్ ఎమోషనల్ ట్వీట్
నిన్న పంటలు ఎండుతున్నా పట్టించుకోలేదు.. నేడు వడగండ్లు ముంచెత్తినా కన్నెత్తి చూడటంలేదని, ముఖ్యమంత్రి గారు.. రైతులంటే మీకు ఎందుకంత చిన్న చూపు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిండెంట్ కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు
దిశ, డైనమిక్ బ్యూరో: నిన్న పంటలు ఎండుతున్నా పట్టించుకోలేదు.. నేడు వడగండ్లు ముంచెత్తినా కన్నెత్తి చూడటంలేదని, ముఖ్యమంత్రి గారు.. రైతులంటే మీకు ఎందుకంత చిన్న చూపు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిండెంట్ కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు. బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్ధి వినోద్ వడగండ్ల వానకు నష్టపోయిన రైతులను పరామర్శిస్తున్న వీడియోని షేర్ చేస్తూ.. రేవంత్ రెడ్డిపై విమర్శలు చేశారు. ఢిల్లీ పెద్దల చుట్టూ ప్రదక్షిణలు తప్ప, గల్లీలో రైతుల కన్నీళ్లు కనిపించవా..? అన్నదాతల ఆర్థనాదాలు వినిపించవా..?? ఎన్నికల గోల తప్ప.. ఎన్నో కష్టాలు పడుతున్న రైతులపై కనికరం లేదా..? అంటు ప్రశ్నించారు.
అలాగే సీట్లు, ఓట్ల పంచాయతీ తప్ప.. అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకుంటున్నా ఆదుకోరా..?? ప్రజా పాలన అంటే, 24/7 ఫక్తు రాజకీయమేనా..? పార్టీ ఫిరాయింపులపై ఉన్న దృష్టి.. పంటనష్టంపై లేదెందుకు అని విమర్శలు చేశారు. పాడైపోయిన పంటలను పరిశీలించే తీరిక లేదా ? హైకమాండ్ చుట్టూ చక్కర్లు కొట్టీ కొట్టీ.. రైతుల సమస్యలు వినే ఓపిక లేదా ? ఇంతకాలం పచ్చని పైర్లు ఎండుతున్నా.. సాగునీరు ఇవ్వడం చేతకాలేదు..! ఇప్పుడు నష్టపోయిన పంటలకు.. పరిహారం ఇవ్వాలన్న మనసు రావడం లేదా..? అని దుయ్యబట్టారు. అంతేగాక గుర్తు పెట్టుకోండి..!! ఎద్దేడ్సిన ఎవుసం..! రైతేడ్సిన “రాజ్యం బాగుండదు ..” !! అన్నదాతలకు జరుగుతున్న అన్యాయంపై.. భారత “రైతు” సమితి పోరాడుతూనే ఉంటది..!!! ఎక్స్ లో రాసుకొచ్చారు.