రాష్ట్ర అవతరణ వేడుకలు అంబరాన్నంటాలి: సీఎం కేసీఆర్
రాష్ట్ర అవతరణ వేడుకలు జూన్ 2 నుంచి 21 రోజుల పాటు రాష్ట్రమంతా ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించగా ఏ రోజు ఏ యాక్టివిటీ జరుగుతుందో ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్షించారు.
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర అవతరణ వేడుకలు జూన్ 2 నుంచి 21 రోజుల పాటు రాష్ట్రమంతా ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించగా ఏ రోజు ఏ యాక్టివిటీ జరుగుతుందో ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్షించారు. గ్రామం మొదలు రాజధాని వరకు అంబరాన్నంటే తీరులో సంబురాలు జరగాలని ఇప్పటికే స్పష్టమైన దిశానిర్దేశం చేయగా ప్రత్యేక కమిటీ రూపొందించిన క్యాలెండర్ షెడ్యూలుపై వివిధ శాఖల అధికారులతో లోతుగా చర్చించారు. సచివాలయంలో మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు జరిగిన సమావేశంలో వేడుకల నిర్వహణపై స్పష్టమైన ఆదేశాలు జారీచేశారు. పల్లెపల్లెనా ప్రగతి ప్రస్థానం ప్రజల్లోకి విస్తృతంగా వెళ్ళాలని, ఇందుకోసం లఘుచిత్రాలు, డాక్యుమెంటరీలు, పోస్టర్లు, ఫ్లెక్సీలు లాంటి ప్రదర్శనలతో పాటు ప్రజలను భాగస్వామ్యం చేసేలా సాహితీ, సాంస్కృతిక కార్యక్రమాలపైనా అధికారులకు సూచనలు చేశారు.
రాష్ట్రం ఏర్పడకముందు తెలంగాణలో విద్యుత్, వ్యవసాయ, సాగునీరు, త్రాగునీరు, విద్య, వైద్యం.. తదితర అనేక రంగాల్లో ఎలాంటి పరిస్థితులు ఉండేవో తొమ్మిదేళ్ళ పాలన తర్వాత ప్రస్తుతం వాటి ప్రగతి ఏ విధంగా ఉన్నదో ప్రజల్లోకి వెళ్ళేలా రకరకాల రూపాల్లో వివరించి చెప్పడంపై కేసీఆర్ ఎక్కువగా దృష్టి పెట్టారు. ఆయా శాఖలు రూపొందించిన డాక్యుమెంటరీలను ఇప్పటికే చూసిన ఆయన కొన్ని మార్పులు చేర్పులు కూడా చేయాలని సూచించారు. ఫస్ట్ డే సచివాలయంలోనే వేడుకలు ప్రారంభమవుతాయని, వేలాది మంది ఉద్యోగులు హాజరవుతున్నందున భద్రత మొదలు వారి సౌకర్యం కోసం స్టేజీ ఏర్పాటు, కుర్చీల, షామియానా లాంటి అనేక అంశాలపై అధికారులకు ఆదేశాలు జారీచేశారు.
దశాబ్ది వేడుకల నిర్వహణ, కార్యాచరణ తదితర అంశాలపై జరిగిన సమీక్ష సందర్భంగా సచివాలయంలో జరిగే ఈవెంట్‌లో పోలీసుల గౌరవ వందనం స్వీకరించడం మొదలు జాతీయ జెండాను ఎగురవేయడం, అతిథులకు ఏర్పాట్లు చేయడం, కార్యక్రమాల నిర్వహణ, పార్కింగ్ సౌకర్యం, ‘హై టీ’ (అల్పాహార విందు) ఏర్పాటు తదితరాలపై అధికారులకు సూచనలు చేశారు. అన్ని జిల్లాలు, అసెంబ్లీ నియోజకవర్గాల్లో రాష్ట్ర వ్యాప్తంగా 21 రోజుల పాటు నిర్వహించే కార్యక్రమాల ఏర్పాట్లపై కేసీఆర్ చర్చించారు. దశాబ్ది ఉత్సవాలు రాష్ట్ర చరిత్రలో గొప్ప సందర్భమని, ఒకప్పుడు అవమానాలకు, అపోహలకు గురైన తెలంగాణ ఇప్పుడు అనేక రంగాల్లో ఊహించని అభివృద్ధిని, ప్రగతిని సాధించిందని, దీన్ని ప్రజలకు అర్థం చేయించాలన్నారు. అన్ని రంగాల్లో దేశానికే ఆదర్శంగా నిలిచిన విషయాన్ని వివరించాలన్నారు.
ఆయా రంగాల్లో రాష్ట్రం సాధించిన అభివృద్ధిని పేరు పేరునా ప్రజలకు పలు ప్రసార మాధ్యమాలు, సోషల్ మీడియా తదితర వేర్వేరు ప్లాట్‌ఫామ్‌ల ద్వారా చేరవేయాలన్నారు. తెలంగాణ ప్రజలతో మూడు వారాల పాటు మమేకం కావాలన్నారు. వారి భాగస్వామ్యంతో పల్లె నుంచి పట్నం దాకా దశాబ్ధి ఉత్సవాలు ఆటాపాటలతో పండుగ వాతావరణంలో ఘనంగా జరగాలని నొక్కిచెప్పారు. ఈ సమావేశంలో మంత్రులు హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, శేరి సుభాష్ రెడ్డి, దేశపతి శ్రీనివాస్, ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, సీఎం ప్రధాన సలహాదారు సోమేష్ కుమార్, ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్ శర్మ, సీఎస్ శాంతి కుమారి, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ నర్సింగ్ రావు, డీజీపీ అంజనీ కుమార్, సీపీ సీవీ ఆనంద్, సీఎం సెక్రటరీలు స్మితా సభర్వాల్, భూపాల్ రెడ్డి, రోడ్లు-భవనాల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీనివాస రాజు, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్, సమాచార పౌర సంబంధాల శాఖ స్పెషల్ కమిషనర్ అశోక్ రెడ్డి, జాయింట్ డైరక్టర్ జగన్ తదితరులున్నారు.