తెలంగాణలో ఆ పరీక్ష కేంద్రాలు పెంపు.. G. Kishan Reddy లేఖకు కేంద్రం రిప్లై!
పరీక్ష కేంద్రాలు పెంచాలని యూనియన్ ఎడ్యుకేషన్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్‌కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గతంలో లేఖ రాశారు.
దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో గేట్ పరీక్ష కేంద్రాలను పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. పరీక్ష కేంద్రాలు పెంచాలని యూనియన్ ఎడ్యుకేషన్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్‌కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గతంలో లేఖ రాశారు. ఈ లేఖపై స్పందించిన కేంద్రం.. రాష్ట్రంలో మరో నాలుగు పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆదిలాబాద్, కొత్తగూడెం, మెదక్, నల్గొండ జిల్లాల్లో కొత్తగా గేట్ పరీక్ష కేంద్రాలు ఏర్పాటు కానున్నాయి.
ఇప్పటికే తెలంగాణలో ఏడు ఎగ్జామ్స్ సెంటర్లు ఉండగా కొత్తగా ఏర్పాటు కాబోతున్న వాటితో కలిపితే రాష్ట్రంలో మొత్తం పరీక్ష కేంద్రాల సంఖ్య పదకొండుకు చేరనుంది. పరీక్ష కేంద్రాలను పెంచుతూ కేంద్రం తీసుకున్న నిర్ణయంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ట్విట్టర్ వేదికగా రియాక్ట్ అయ్యారు. గతంలో నేను రాసిన లేఖకు స్పందించి తెలంగాణలో గేట్ పరీక్ష కేంద్రాలను పెంచుతూ నిర్ణయం తీసుకున్న ఈడీయూ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్‌కు, గేట్ 2023 పరీక్షల నిర్వహణ కమిటీకి కృతజ్ఞతలు తెలిపారు. విద్యార్థులు ఇకపై పూర్తి సమయాన్ని పరీక్షలకు సన్నద్ధం అవడంపై కేటాయించి మంచి ఉత్తీర్ణత సాధించాలని ఆకాంక్షించారు.