రాష్ట్రంలో ఇప్పటికీ కుల వివక్ష కొనసాగుతోంది: ఎంఎల్సీ కల్వకుంట్ల కవిత

గ్రామాల్లో ఇప్పటికీ కూడా కుల వివక్షత, అంటరానితనం , రెండు గ్లాసుల పద్ధతి ఇంకా కొనసాగుతోందని, గుళ్లు, దేవాలయాల్లోకి దళితులను రానివ్వడం లేదని బీఆర్ఎస్​ ఎంఎల్​సీ కల్వకుంట్ల కవిత శాసన మండలి దృష్టికి తీసుకుని వచ్చారు.

Update: 2024-12-21 16:41 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: గ్రామాల్లో ఇప్పటికీ కూడా కుల వివక్షత, అంటరానితనం , రెండు గ్లాసుల పద్ధతి ఇంకా కొనసాగుతోందని, గుళ్లు, దేవాలయాల్లోకి దళితులను రానివ్వడం లేదని బీఆర్ఎస్​ ఎంఎల్​సీ కల్వకుంట్ల కవిత శాసన మండలి దృష్టికి తీసుకుని వచ్చారు. శనివారం ఉదయం విధాన మండలి ప్రారంభం కాగానే స్పెషల్​మెన్షన్ అంశాన్ని శాసన మండలి చైర్మన్ ​గుత్తా సుఖేందర్​రెడ్డి అనుమతించగా.. ఎమ్మెల్సీ కవిత ఈ అంశాన్ని సభ ముందు ఉంచారు. కుల వివక్షత, అంటరానితనం ఇంకా కొనసాగడం సరికాదన్నారు. కుల వివక్షత నిర్మూలన కోసం బీఆర్​ఎస్​ ప్రభుత్వ హయాంలో ప్రతి నెల చివరి ఆదివారం సివిల్​రైట్స్​డే గా పాటించి అస్పృశ్యత నివారణకు చర్యలు తీసుకున్నామని గుర్తు చేశారు. కాగా ఇప్పుడు పరిస్థతులు మళ్లీ మారుతున్నాయని, గ్రామాల్లో దళితులు హోటళ్లకు వెళితే ఎవరి గ్లాస్​ను వారే కడుక్కోవాలంటూ రెండు గ్లాస్​ల పద్దతి అమలు చేస్తున్నారని, ఇది మన తెలంగాణ రాష్ట్రంలోనే ఎక్కువగా కొనసాగడం అన్యాయం అని అన్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఇవన్నీ నివారించాలనే ఉద్దేశంతో అప్పట్లో ప్రభుత్వ పరంగా సివిల్​రైట్స్​డేను పెట్టుకుని ప్రతి నెల చివరి ఆదివారం అమలు చేశామని, ఎంఆర్ఓ, తహసీల్దార్​ సాంఘీక సంక్షేమ శాఖ అధికారి, పోలీస్​ఎస్ఐ, వీళ్లంతా గ్రామాల్లోకి వెళ్లి ప్రజలను చైతన్య పరిచారని అన్నారు.

ప్రస్తుతం కాంగ్రెస్​ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సివిల్​రైట్స్​డే జరపకపోవడం వల్ల రెండు గ్లాసుల పద్ధతి మళ్లీ పునరావృతం అవుతుందని కల్వకుంట్ల కవిత మండలి దృష్టికి తీసుకువచ్చారు. అలాగే రూరల్ క్రైమ్​రేటు కూడా ఇటీవల కాలంగా పెరుగుతోందన్నారు. కుల వివక్షత విషయంలో అవకాశం ఉంటే మండల స్థాయిలో రాజకీయ ప్రజా ప్రతినిధులను కూడా అందులో చేర్పించి కుల వివక్ష తగ్గేలా చూడాలని కల్వకుంట్ల కవిత అన్నారు. అనంతరం తీన్మార్​మల్లన్న మాట్లాడుతూ కిమ్స్ ఆసుపత్రిలో 60 నుంచి 70 శాతం వరకు మందిని ఇటీవల ఆంధ్ర ప్రాంతం నుండి వచ్చిన వారినే నియమించుకోవడం వల్ల తెలంగాణకు చెందిన పారామెడికల్​చదివిన యువత ఉద్యోగాలు రాక ఇబ్బందులు పడుతున్నరని తెలంగాణ బిడ్డలను నియమించుకున్న తర్వాతే సరిపోక పోతే ఆంధ్ర వారిని నియమించుకోవాలని సభ దృష్టికి తీసుకువచ్చారు. ప్రభుత్వ జూనియర్​డిగ్రీ కాలేజీల్లోని ప్రైవేటు ఉద్యోగాల్లో కూడా ఏపీ వారికే ప్రాధాన్యత ఇవ్వడం సరికాదన్నారు. కాంగ్రెస్ ​ఎంఎల్​సీ మహేశ్​ కుమార్​ గౌడ్ ​మాట్లాడుతూ పార్లమెంట్​సాక్షిగా రాహుల్​గాంధీకి అవమానం జరిగిందని, ఈ ఘటనను తెలంగాణ విధాన మండలి ద్వారా ఖండించాల్సిన అవసరం ఉందని అవసరమైతే సభాధ్యక్షిడిగా మీరు ఒక నిర్ణయం తీసుకోండని సభ దృష్టికి తీసుకువచ్చారు.


Similar News