హైడ్రా కమిషనర్ రంగనాథ్‌పై హెచ్‌‌ఆర్‌సీలో కేసు నమోదు

హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌(AV Ranganath)పై మానవ హక్కుల కమిషన్(HRC)లో కేసు నమోదైంది.

Update: 2024-09-28 15:02 GMT

దిశ, వెబ్‌డెస్క్: హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌(AV Ranganath)పై మానవ హక్కుల కమిషన్(HRC)లో కేసు నమోదైంది. హైడ్రా అధికారులు ఇల్లు కూల్చేస్తామని భయభ్రాంతులకు గురి చెయ్యడంతో బుచ్చమ్మ అనే వృద్ధురాలు ఆత్మహత్య చేసుకున్నట్లు వార్తలు వినిపించిన విషయం తెలిసిందే. ఇదే విషయమై ఆమె కుటుంబసభ్యులు హెచ్‌ఆర్‌సీలో హైడ్రా కమిషనర్‌పై కంప్లైంట్ చేశారు. దీంతో 16063/IN/2024 కింద కేసు నమోదు చేసి విచారణ చేపట్టనున్నట్లు మానవ హక్కుల కమిషన్ తెలిపింది.

కాగా, ఇప్పటికే బుచ్చమ్మ ఆత్మహత్యపై రంగనాథ్ స్పందించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘హైడ్రా ఎవరికి ఎలాంటి నోటీసులు ఇవ్వలేదు. బుచ్చమ్మ ఇళ్లు ఎఫ్‌టీఎల్‌ పరిధికి దూరంగా ఉన్నాయి. కూల్చివేతల్లో భాగంగా తమ ఇళ్లను కూలుస్తారనే భయంతో వారి కూతుర్లు బుచ్చమ్మను ప్రశ్నించారు. దీంతో మనస్తాపానికి గురైన బుచ్చమ్మ ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనతో హైడ్రాకు సంబంధం లేదు. హైడ్రా గురించి మీడియాలో గానీ, సామాజిక మాధ్యమాల్లోగానీ భయాలు పుట్టించవద్దని కోరుతున్నాను. రాష్ట్రంలో జరుగుతున్న కూల్చివేతలను హైడ్రాకు ఆపాదిస్తున్నారు. హైడ్రా కూల్చివేతల గురించి అనవసర భయాలు వద్దు’ అని రంగనాథ్‌ పేర్కొన్నారు.


Similar News