Burra Venkatesham: కాసేపట్లో గ్రూప్-2 పరీక్ష.. టీజీపీఎస్సీ చైర్మన్ ఆసక్తికర కీలక వ్యాఖ్యలు
రాష్ట్ర వ్యాప్తంగా టీజీపీఎస్సీ గ్రూప్-2 పరీక్షలు ఇవాళ, రేపు నిర్వహించనున్నారు.
దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర వ్యాప్తంగా టీజీపీఎస్సీ గ్రూప్-2 (TGPSC Group-2) పరీక్షలు ఇవాళ, రేపు నిర్వహించనున్నారు. ఈ మేరకు అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. తాజాగా, టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం (Burra Venkatesham) బేగంపేట (Begumpet)లోని ఓ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలకు వెళ్లి అక్కడ పరీక్షా ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులకు ఆయన కొన్ని సూచనలు చేశారు. అనంతరం బుర్రా వెంకటేశం (Burra Venkatesham) మాట్లాడుతూ.. గ్రూప్-2 (Group-2) పరీక్షకు ప్రతిష్టాత్మకంగా ఏర్పాట్లు చేశామని తెలిపారు. చాలా ఏళ్ల తరువాత పరీక్ష జరుగుతోందని అన్నారు. ఈ క్రమంలో అభ్యర్థులు ఎలాంటి ఆందోళన లేకుండా పరీక్ష రాయాలని సూచించారు. గ్రూప్-2 పరీక్షకు గ్రూప్-3 కంటే ఎక్కువ మంది అభ్యర్థులు హాజరు అవుతున్నారని పేర్కొన్నారు. వచ్చే ఏడాది మార్చి చివరి నాటికి గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-3 పరీక్షల తుది ఫలితాలను వెల్లడిస్తామని బుర్రా వెంకటేశం (Burra Venkatesham) స్పష్టం చేశారు.