బై ఎలక్షన్స్‌కు బీఆర్ఎస్ రెడీ.. పోటీ చేయబోయే ముగ్గురు అభ్యర్థులు ఖరారు?

నెల రోజుల్లోగా పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల విషయంలో నిర్ణయం తీసుకోవాలని హై కోర్టు తీర్పు ఇవ్వడంతో.. ఖైరతాబాద్, స్టేషన్ ఘన్ పూర్, భద్రాచలం నియోజకవర్గాల్లో బైఎలక్షన్స్ వస్తాయని బీఆర్ఎస్ భావిస్తున్నది.

Update: 2024-09-10 02:23 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: నెల రోజుల్లోగా పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల విషయంలో నిర్ణయం తీసుకోవాలని హై కోర్టు తీర్పు ఇవ్వడంతో.. ఖైరతాబాద్, స్టేషన్ ఘన్ పూర్, భద్రాచలం నియోజకవర్గాల్లో బైఎలక్షన్స్ వస్తాయని బీఆర్ఎస్ భావిస్తున్నది. దీంతో ఇప్పటి నుంచే కసరత్తు ప్రారంభించినట్లు తెలిసింది. హై కోర్టు జడ్జిమెంట్ ప్రకారం పార్టీ మారిన ఎమ్మెల్యేలపై వేటు తప్పదని పార్టీ నిర్ణయానికి వచ్చింది. దీంతో ఆయా నియోజకవర్గాలపై బీఆర్ఎస్ ఇప్పటి నుంచే ఫోకస్ పెట్టింది. ఆయా అసెంబ్లీ సెగ్మెంట్లలోని నేతలతో పార్టీ సీనియర్లు మాట్లాడినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సంసిద్ధంగా ఉండాలని సూచించినట్లు పార్టీ సీనియర్ నేత ఒకరు తెలిపారు. మండలాల నేతలకు సైతం సమాచారం ఇవ్వాలని, త్వరలోనే సమావేశాలు నిర్వహించుకుందామని చెప్పినట్లు సమాచారం.

మూడు సెగ్మెంట్లలో..

ఖైరతాబాద్ నుంచి దాసోజు శ్రవణ్ ను పోటీ చేయించాలని పార్టీ మొగ్గుచూపుతున్నట్లు సమాచారం. ఆయనతో పాటు విష్ణువర్దన్ రెడ్డి, మన్నె గోవర్ధన్ రెడ్డి పేర్లను సైతం పరిశీలిస్తున్నట్లు తెలిసింది. స్టేషన్ ఘన్ పూర్ నుంచి కడియం రాజయ్యను ఇప్పటికే బరిలో నిలుపుతామన పార్టీ ప్రకటించింది. భద్రాచలం నుంచి బోదెబోయిన బుచ్చయ్య పేరును పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఆయన వాజేడు మండలం మాజీ ఎంపీపీ, మాజీ జడ్పీటీసీ, మార్కెట్ కమిటీ చైర్మన్ గా పనిచేశారు. బుచ్చయ్యతో పాటు మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు పేరును సైతం పరిశీలిస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

హైకోర్టు తీర్పుతో డైలమాలో చేరే నేతలు

కాంగ్రెస్ లో బీఆర్ఎస్ ఎల్పీ విలీనం అవుతుందని ఆ పార్టీ లీకులు ఇచ్చినా.. అయితే పలు కారణాలతో తాత్కాలికంగా వాయిదా వేసినట్లు తెలుస్తున్నది. ఈ తరుణంలో హైకోర్టులో తీర్పుతో పార్టీ మారాలనుకున్న ఎమ్మెల్యేలు డైలమాలో పడినట్లు సమాచారం. అయితే కోర్టు ఆదేశాలను స్పీకర్ కార్యాలయం పాటిస్తుందా? అని అనుమానం సైతం వ్యక్తమవుతున్నది. కోర్టు ఇచ్చిన గడువు వరకు వేచిచూద్దామని కొంతమంది, పార్టీ మారడం ఎందుకు అని మరికొంతమంది ఆలోచిస్తున్నట్లు సమాచారం.

మళ్లీ తిరిగి వస్తారనే ధీమాలో గులాబీ

రాష్ట్రంలో అధికారం కోల్పోవడంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కాంగ్రెస్ వైపు మొగ్గుచూపారు. పది మంది ఎమ్మెల్యేలు, ఎనిమిది మంది ఎమ్మెల్సీలు కాంగ్రెస్ లో చేరారు. మరికొంతమంది సైతం చేరేందుకు సిద్ధమవుతున్నారు. అయితే హైకోర్టు తాజా తీర్పుతో పార్టీని వీడిన వారంతా తిరిగి గులాబీ గూటికీ వస్తారని పార్టీ భావిస్తున్నది. పార్టీ మారాలనుకున్నవారికి సైతం కోర్టు తీర్పు ఓ గుణపాఠం అవుతుందని పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు.


Similar News