బీఆర్ఎస్ నయా ప్లాన్స్.. పార్టీ కేడర్ లో ఊపొస్తుందా ?
బీఆర్ఎస్ పార్టీ దూకుడుకు సిద్ధమైంది. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని భావిస్తోంది. అందుకోసం వరుస కార్యక్రమాలకు శ్రీకారం చుడుతోంది.
దిశ, తెలంగాణ బ్యూరో: బీఆర్ఎస్ పార్టీ దూకుడుకు సిద్ధమైంది. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని భావిస్తోంది. అందుకోసం వరుస కార్యక్రమాలకు శ్రీకారం చుడుతోంది. ప్రభుత్వం ప్రజా విజయోత్సవాలను నిర్వహిస్తుండటంతో అందుకు దీటుగా ప్రభుత్వ హామీలు, గ్యారెంటీల్లో వైఫల్యాలను ప్రజలకు వివరించనుంది. దీంతో పాటు ఈ నెల 29న దీక్షదివస్ ను అన్ని నియోజకవర్గాల్లో ఘనంగా నిర్వహించాలని కేడర్ కు పార్టీ పిలుపునిచ్చింది. ఈ కార్యక్రమాలతో కేడర్ లో జోష్ నింపాలని, పార్టీకి మళ్లీ మునుపటి రోజులు తీసుకురావాలని భావిస్తోంది.
ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోనే ఎండగడతామని గులాబీ పార్టీ ప్రకటించింది. అందుకు అనుగుణంగానే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన -ప్రజావిజయోత్సవాలను తిప్పికొట్టేలా బీఆర్ఎస్ తీవ్రస్థాయిలో విమర్శలకు పదును పెట్టింది. విజయోత్సవాలు కాదు... అపజయోత్సవాలు జరపండి అని కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడుతోంది. ఏం సాధించారని.. ప్రజలకు ఏం చేశారో చెప్పాలని.. ఏ గ్యారెంటీని పూర్తి స్థాయిలో అమలు చేశారని, ఏ వర్గానికి న్యాయం చేశారో చెప్పాలంటూ నిలదీస్తున్నారు. ప్రభుత్వాన్ని ఇరుకున బెట్టే కార్యక్రమాలకు శ్రీకారం చుడుతోంది.
నేడు ఖమ్మంలో రైతు ధర్నా..
మరోవైపు వరుస కార్యక్రమాలకు బీఆర్ఎస్ శ్రీకారం చుట్టింది. ఖమ్మం మార్కెట్లో పత్తికి గిట్టుబాటు ధర కల్పించడం లేదని రైతులు ఆందోళన బాటపట్టడంతో వారికి అండగా నిలబడేందుకు శుక్రవారం బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమానికి పిలుపునిచ్చారు. ఈ ధర్నాలో మాజీ మంత్రులు హరీశ్ రావు, గంగుల కమలాకర్, పువ్వాడ అజయ్, ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ నేతలు పాల్గొననున్నట్లు సమాచారం. లగచర్ల బాధితులతో పాటు దళిత, గిరిజనుల పక్షాన మహబూబాబాద్‌లో ఈ నెల 20న మహా ధర్నాకు ప్లాన్ చేసింది. పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో కోర్టును బీఆర్ఎస్ ఆశ్రయించడంతో మహా ధర్నాకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నెల 25న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ధర్నా చేపట్టేందుకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. 29న కరీంనగర్ అల్గునూరు చౌరస్తాలో దీక్షా దివస్ ను ఘనంగా నిర్వహించేందుకు పార్టీ సిద్ధమైంది. ఈ దీక్ష దివాస్ లో కేటీఆర్ సైతం పాల్గొనున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు ప్లాన్
రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా సమస్యల పరిష్కారానికి బీఆర్ఎస్ పోరాట కార్యచరణకు సిద్ధమవుతోంది. క్షేత్రస్థాయిలో ప్రజల ఇబ్బందులను నేతల ద్వారా సేకరిస్తున్నారు. ప్రాధాన్యత క్రమంలో సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని భావిస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడైతే ప్రజాపాలన-ప్రజా విజయోత్సవాలను నిర్వహిస్తుందో అక్కడే బీఆర్ఎస్ సైతం ప్రభుత్వ వైఫల్యాలపై ధర్నాలు, నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఏదీ ఏమైనా వరుస ఓటములతో నైరాశ్యంలో ఉన్న కేడర్ లో జోష్ నింపేందుకు ఈ కార్యక్రమాలు దోహదపడతాయని పార్టీ నేతలు భావిస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సైతం వరుస కార్యక్రమాలు కలిసి వస్తాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
29న రాష్ట్ర వ్యాప్తంగా దీక్షా దివస్ : కేటీఆర్
రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ఈ నెల 29న దీక్ష దివస్ ను ఘనంగా నిర్వహించాలని పార్టీ శ్రేణులకు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రజల స్వరాష్ట్ర సాధనలో అత్యంత కీలకమైన ఘట్టంగా దీక్ష దివస్ నిలుస్తుందని గురువారం మీడియా ప్రకటన విడుదల చేశారు. 2009 నవంబర్ 29న బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షతో మలిదశ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసి స్వరాష్ట్ర సాధనకు బలమైన పునాదులు వేసిందన్నారు. దీక్షకు వెళ్లే ముందు తెలంగాణ వచ్చుడో - కేసీఆర్ సచ్చుడో అనే తెగింపుతో చేపట్టిన ఈ దీక్ష సబ్బండవర్ణాల తెలంగాణ ప్రజలను ఏకం చేసిందని తెలిపారు. ఈ దీక్ష యావత్ భారత దేశ రాజకీయ వ్యవస్థను కదిలించి చరిత్రలో తొలిసారి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తున్నామని కేంద్ర ప్రభుత్వం స్వయంగా ప్రకటన చేసేలా చేసి దశాబ్దాల తెలంగాణ ప్రజల చిరకాల ఆకాంక్షను నెరవేర్చిందని వెల్లడించారు.