MLA గెలుపుకోసం సొంత డబ్బులు ఖర్చు చేసి మరీ పనిచేశా: కడియం
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కడియం శ్రీహరి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనాలకు తనను పిలవట్లేదంటూ సొంత నేతలపై మండిపడ్డారు.
దిశ, వరంగల్ బ్యూరో: మాజీ ఉప ముఖ్యమంత్రి, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. ఆత్మీయ సమ్మేళనాల్లో అందరినీ కలుపుకుని ముందుకు సాగాలని ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా చెప్పినా, క్షేత్రస్థాయిలో అది జరగడం లేదని అన్నారు. స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గం వేలేరులో ఎమ్మెల్యే రాజయ్య, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఆత్మీయ సమ్మేళనాలకు తనకు కనీసం ఆహ్వానం కూడా అందలేదని అన్నారు.
ఆదివారం జనగామ జిల్లా స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గ కేంద్రంలో జరిగిన చెక్కుల పంపిణీ కార్యక్రమంలో కడియం మీడియాతో మాట్లాడారు. నియోజకవర్గంలో జరుగుతున్న పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాల్లో తనను పక్కన పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. స్టేషన్ ఘన్‌పూర్‌లో 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ బీ ఫామ్ ఇచ్చిన అభ్యర్థికి తాను సపోర్టు చేశానన్నారు. పార్టీ నిర్ణయానికి కట్టుబడి పల్లా రాజేశ్వర్ రెడ్డికి ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ సహకరించానన్నారు. కానీ ఇప్పుడు స్థానిక నాయకత్వం తనను విస్మరిస్తోందని కడియం ఆవేదన వ్యక్తం చేశారు.
స్థానిక నాయకులతో చేపట్టిన ఆత్మీయ సమ్మేళనాలకు తనను పిలువట్లేదంటూ పల్లా రాజేశ్వర్‌రెడ్డిని ఉద్దేశించి అన్నారు. కేసీఆర్ ఆదేశాల మేరకు ఎమ్మెల్యే గెలుపుకు కృషిచేశానని, సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని మరీ ప్రచారం చేశానని.. అయినా తనను పార్టీ సమావశాలకు పిలువకుండా పక్కన పెడుతున్నారని కడియం శ్రీహరి అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా నిస్వార్థంగా పనిచేశానని.. ఆ విషయాన్ని ఇప్పటికే పల్లా రాజేశ్వర్ రెడ్డి స్పష్టం చేశాడని కడియం శ్రీహరి గుర్తు చేశారు. ఇకనైనా అందరిని కలుపుకుని పోవాలని, లేనట్లయితే పార్టీలో విభేదాలు వస్తాయని ఎమ్మెల్యే రాజయ్యను ఉద్దేశించి కడియం శ్రీహరి వ్యాఖ్యానించారు.