అడ్వాన్స్ అప్పు కోసం కేంద్రానికి స్టేట్ రిక్వెస్ట్..! డిసెంబర్‌లో అదనపు రుణం కోసం ప్లాన్

బీఆర్ఎస్ హాయంలో ఇబ్బడిముబ్బడిగా చేసిన అప్పులను తీర్చడం కాంగ్రెస్ ప్రభుత్వానికి పెద్ద సమస్యగా మారింది.

Update: 2024-11-30 02:09 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: బీఆర్ఎస్ హాయంలో ఇబ్బడిముబ్బడిగా చేసిన అప్పులను తీర్చడం కాంగ్రెస్ ప్రభుత్వానికి పెద్ద సమస్యగా మారింది. ఆ అప్పులను చెల్లించేందుకు కొత్తగా అప్పులు చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. ఎఫ్ఆర్బీఏం చట్టం ప్రకారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024–25) చివరి త్రైమాసికంలో తీసుకోవాల్సిన అప్పులను ముందుగానే సమీకరించేందుకు ప్రభుత్వం సిద్దమైంది. అయితే అందుకు కేంద్ర ఆర్థిక శాఖ అనుమతి కోరుతూ, రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసినట్టు తెలుస్తున్నది. అక్కడ్నించి గ్రీన్ సిగ్నల్ వచ్చిన వెంటనే డిసెంబర్ మొదటి వారంలో అప్పులు చేసేందుకు రెడీ అవుతున్నట్టు సమాచారం.

ప్రతినెల కిస్తీలకు రూ.6వేల కోట్లు

బీఆర్ఎస్ హయాంలో చేసిన అప్పులకు కిస్తీలను చెల్లించడం సవాలుగా మారింది. నిర్ణీత గడువులో వాయిదా చెల్లించకపోతే సమస్యలు వస్తాయి. దీనితో ప్రభుత్వం అప్పు చెల్లించేందుకు కావాల్సిన ఆర్థిక వనరులను ముందుగానే రెడీ చేసుకుంటున్నది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రతి నెల సగటున సుమారు రూ. 6 వేల కోట్లు వాయిదాలు చెల్లించేందుకు వ్యయం చేస్తున్నారు. జీతాలు, పెన్షన్ల కోసం ప్రతి నెల రూ.5 వేల కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఈ రెండు పద్దులకు కావాల్సిన నిధులను సమీకరించేందుకే ప్రభుత్వం నానా తంటాలు పడుతోందని తెలిసింది.

అయితే, చివరి త్రైమాసికంలో (జనవరి 2025– మార్చి2025) బాండ్ల విక్రయం ద్వారా సేకరించే రుణాలను అడ్వాన్స్ గా తీసుకునే వెసులుబాటు ఇవ్వాలని సెంట్రల్ ఫైనాన్స్ డిపార్ట్ మెంట్ కు స్టేట్ గవర్నమెంట్ లేఖ రాసినట్టు తెలిసింది. రెండు మూడు రోజుల్లో కేంద్రంనుంచి సానుకూల స్పందన వస్తుందని ఆశలో ఆర్థిక శాఖ ఉంది. ఈ ఫైనాన్స్ ఇయర్ లో సమారు రూ. 49,500 కోట్ల ఆదాయం సమకూరుతుందని అంచనా వేశారు. కానీ అక్టోబరు చివరి నాటికి రూ.35,120 కోట్లను సేకరించారు. మరో రూ.10 వేలకోట్లను చివరి త్రైమాసకంలో తీసుకునే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు.

Tags:    

Similar News