బీఆర్ఎస్‌లో ‘దీక్షా దివస్’ జోరు.. భారీగా తరలివచ్చిన కేడర్

రాష్ట్రంలోని అన్ని జిల్లాకేంద్రాల్లో దీక్షాదివస్‌ను శుక్రవారం ఘనంగా నిర్వహించారు.

Update: 2024-11-30 01:50 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోని అన్ని జిల్లాకేంద్రాల్లో దీక్షాదివస్‌ను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత దీక్షా దివస్‌ను ఏటా నిర్వహిస్తున్నారు. ఈ ప్రోగ్రామ్‌ను ప్రతిపక్షంలో తొలిసారి భారీగా గులాబీ కేడర్‌ను తరలించి బీఆర్ఎస్ నాయకులు విజయవంతం చేశారు. కేడర్‌లో ఉత్తేజం నింపడంతో పాటు రాబోయే ‘స్థానిక’ ఎన్నికలకు సన్నద్ధానికి శ్రీకారం చుట్టారు. కేటీఆర్, హరీశ్‌రావు, కవితలు దివస్‌లో పాల్గొని పార్టీ కేడర్‌లో జోష్ నింపారు. అన్ని జిల్లాకేంద్రాల్లో కేసీఆర్ చేపట్టిన దీక్ష ఘట్టానికి సంబంధించిన డాక్యుమెంటరీని ప్రదర్శించడంతో పాటు ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్లు ఆకట్టుకున్నాయి.

దీక్షా దివస్ విజయవంతం

ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 2009 నవంబర్ 29న గులాబీ బాస్ కేసీఆర్ దీక్ష చేపట్టిన రోజును పురస్కరించుకొని పార్టీ ఆధ్వర్యంలో అన్ని జిల్లా కేంద్రాల్లో వేలాదిమందితో దీక్షాదివస్ ప్రోగ్రామ్ చేపట్టారు. ఆస్పత్రుల్లో రోగులకు బ్రెడ్లు పంపిణీ చేశారు. అంతేకాదు ఉద్యమ ఘట్టాలను తెలిపే ఫొటో ఎగ్జిబిషన్లు ఏర్పాటు చేశారు. దీనికి తోడు దీక్షకు సంబంధించి డాక్యుమెంట్లరీలను ప్రదర్శించారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత పార్లమెంటు, ఎమ్మెల్సీ ఎలక్షన్స్‌లో వరుస ఓటముల నేపథ్యంలో పార్టీ కేడర్‌లో కొంత నిరాశ, నిస్పృహ నెలకొని.. నైరాశ్యంతో కూడిన స్తబ్ధత ఏర్పడింది. కాగా, రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజలు పెట్టుకున్న ఆశలను నెరవేర్చడంలో జాప్యం జరుగుతుండటంతో నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఇదే సరైన సమయమని భావించిన గులాబీ అధిష్టానం అధికారంలో ఉన్నప్పటికన్న ప్రతిపక్షంలోనే ఘనంగా దీక్షాదివాస్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టి అదే స్థాయిలో సక్సెస్ చేసింది. లీడర్లు, కార్యకర్తలు భారీగా తరలిరావడంతో పాటు ఉద్యమ ఘట్టాలు, పోరాట పటిమను వివరించి ప్రభుత్వహామీలను ఎండగట్టారు. తమదైన శైలిలో నేతలు రాష్ట్ర సర్కారుపై విమర్శలు చేశారు. మొత్తంగా పార్టీ కేడర్‌లో దీక్షాదివస్ ప్రోగ్రామ్‌తో జోష్ నింపారు.

కేడర్‌లో ఉద్యమ స్ఫూర్తి నింపే ప్రయత్నాలు

కరీంనగర్‌లోని అలుగునూర్‌లో కేసీఆర్ దీక్ష చేపట్టిన స్థలంలో దీక్షాదివస్ నిర్వహించారు. తిమ్మాపూర్ ఎల్ఎండీ ఇరిగేషన్ ఆఫీసు నుంచి బైక్ ర్యాలీతో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దీక్షాస్థలానికి చేరుకొని ప్రభుత్వంపై తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. పదవి త్యాగంతో ఉద్యమాన్ని మొదలుపెట్టి.. ప్రాణాన్ని పణంగా పెట్టి రాష్ట్రాన్ని సాధించిన నేత కేసీఆర్ మాత్రమే అంటూ కేడర్‌లో ఉద్యమ స్ఫూర్తిని నింపే ప్రయత్నం చేశారు. కేసీఆర్ అంటే ఒక పేరు కాదు.. కేసీఆర్ అంటే ఒక పోరు అన్నారు. కేసీఆర్ దీక్ష స్ఫూర్తిగా మళ్లీ ఒకసారి సంకల్పం తీసుకొని కాంగ్రెస్ పార్టీపై పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. ఎన్నో అబద్ధపు హామీలు, ఆరు గ్యారంటీలు, నంగనాచి మాటలు చెప్పి కాంగ్రెస్ వాళ్లు అధికారంలోకి వచ్చారని ఆరోపించారు.

సిద్దిపేటలో మాజీ మంత్రి హరీశ్‌రావు ప్రోగ్రామ్‌లో పాల్గొని కేడర్‌లో జోష్ నింపారు. తెలంగాణ రాష్ట్రం కోసం రాజీనామా చేయమంటే వెన్నుచూపి పారిపోయిన వాడు రేవంత్‌రెడ్డి అని తెలిపారు. ఆ రోజు తాము తప్ప ఎవరు రాజీనామా చేశారని అడిగారు. కిషన్‌రెడ్డి రిజైన్ చేయమంటే చేయకుండా ఢిల్లీ పారిపోయాడని మండిపడ్డారు. బీజేపీ, కాంగ్రెస్ లీడర్లపై హరీశ్ విరుచుకుపడ్డారు. కొత్త ఉత్సాహంతో అందరం ముందుకు సాగుదాం.. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని కొనసాగిద్దాం అని పిలుపు‌నిచ్చారు. తెలంగాణ భవన్‌లో జరిగిన దీక్షాదివస్‌లో ఎమ్మెల్సీ కవిత పాల్గొని కేడర్‌లో నూతనోత్తేజం నింపారు.

హైదరాబాద్‌లో గులాబీ నేతల బైక్ ర్యాలీలు

అన్ని జిల్లాకేంద్రాల్లో కళాకారుల ఆటపాట ఆకట్టుకున్నాయి. గిరిజనుల నృత్యాలు, కళాకారుల ఆటాపాట, ఉద్యమం నాటి పాటలు ఆకట్టుకున్నాయి. హైదరాబాద్‌లోని అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో బైక్ ర్యాలీలు నిర్వహించారు. బసవతారకం ఆసుపత్రి నుంచి తెలంగాణ భవన్ వరకు ఎమ్మెల్సీ కవిత కేడర్‌తో కలిసి పాదయాత్ర నిర్వహించారు. వారితో డ్యాన్స్ చేసి ఆకట్టుకున్నాయి. భవన్‌లో ఉద్యమఘట్టాలను తెలిపే ఫొటోలు ఆకట్టుకున్నాయి.

కవితకు సెంటిమెంట్ తెలంగాణ భవన్

ఎమ్మెల్సీ కవిత ఢిల్లీ లిక్కర్ స్కాం ఆరోపణలతో జైలుకు వెళ్లి వచ్చిన తర్వాత తొలిసారి తెలంగాణ భవన్‌కు వచ్చారు. శుక్రవారం నిజామాబాద్‌లో జరిగే దీక్షాదివస్ పాల్గొంటారని పార్టీ లీడర్లు తెలిపారు. కానీ, భవన్ ఆమెకు సెంటిమెంట్ కాగా, ఉదయమే భవన్‌లో దీక్షాదివస్ నిర్వహిస్తే పాల్గొని నిజామాబాద్‌కు వెళ్లి పాల్గొంటారని పేర్కొన్నారు. కానీ సాయంత్రం ప్రోగ్రామ్ కావడంతో కవిత సొంత జిల్లాకు వెళ్లలేదు. తెలంగాణ భవన్‌లో జరిగిన దీక్షాదివస్‌లో పాల్గొని గులాబీ కేడర్‌లో జోష్ నింపారు. ఎమ్మెల్సీ కవిత ఇక ప్రజాక్షేత్రంలోకి వెళ్లనున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి.

Tags:    

Similar News