Maheshwaram: వక్ఫ్ భూముల్లో రాత్రికి రాత్రే ఆక్రమణలు..! అక్రమ కట్టడాలు
తుక్కుగూడ మున్సిపాలిటీ అక్రమ నిర్మాణాలకు కేరాఫ్‌గా మారిందన్న విమర్శలున్నాయి.
దిశ, మహేశ్వరం : తుక్కుగూడ మున్సిపాలిటీ అక్రమ నిర్మాణాలకు కేరాఫ్‌గా మారిందన్న విమర్శలున్నాయి. మున్సిపాలిటీ పరిధిలోని రావిరాల, ఇమామ్ గూడ, మహేశ్వరం గేట్ నుంచి ప్రజెయ్ విల్లాస్ వరకు మహేశ్వరం మండల కేంద్రానికి వెళ్లే ప్రధాన రహదారిపైనే అక్రమ నిర్మాణాలు సాగుతున్నాయి. రహదారి పక్కన గతంలో మొక్కలు నాటిన స్థలంలో గోడను నిర్మించారు. రహదారిపైన నిర్మిస్తున్న గోడను తొలగించాలని పలువురు టౌన్ ప్లానింగ్ అధికారికి, మున్సిపల్ శాఖ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. అక్రమార్కులకు స్థానికంగా ఉన్న కౌన్సిలర్లు, టౌన్ ప్లానింగ్ అధికారి, మున్సిపల్ శాఖ అధికారుల అండదండలు ఉండడంతో అక్రమార్కులు నిర్మాణాలు చేపడుతున్నారు. మున్సిపల్ శాఖ అధికారులు, స్థానికంగా ఉన్న కౌన్సిలర్లు కాసుల కక్కుర్తికి ఆశపడి అక్రమ నిర్మాణాలు జరుగుతున్నా అటువైపు కన్నెత్తి చూడడం లేదంటున్నారు.
వక్ఫ్ భూమిలో అక్రమ నిర్మాణాలు..
రావిరాల ఔటర్ రింగురోడ్డు సర్వీస్ రోడ్డు పక్కన వక్ఫ్ భూమిలో రాత్రికి రాత్రే అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయి. నిషేధిత జాబితాలో ఉన్న వక్ఫ్ భూమిలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదు. కానీ రాత్రికిరాత్రే అక్రమార్కులు పుట్టగొడుగుల్లా అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారు. వక్ఫ్ భూమిలో నిర్మించిన ఇండ్లకు ఇంటి నంబర్లను కేటాయించారు. ఒక ఇంటి నంబర్ కావాలంటే మున్సిపల్ శాఖ అధికారులు ముడుపులు తీసుకుంటున్నట్లు సమాచారం. ఇంటి నిర్మాణం పూర్తిగా కాకముందే కేవలం ప్రీకాస్ట్ వేసిన ఇండ్లకు కూడా మున్సిపల్ శాఖ అధికారులు ఇంటి నంబర్లు కేటాయిస్తున్నారు. తుక్కుగూడ మున్సిపాలిటీలో సామాన్యుడు తన సొంత స్థలంలో ఇల్లు నిర్మించుకొని ఇంటి నంబర్ కావాలని మున్సిపల్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకుంటే మున్సిపల్ శాఖ అధికారుల చుట్టూ చెప్పులు అరిగేలా తిరిగినా కేటాయించడం లేదని ఆరోపిస్తున్నారు. అక్రమ కట్టడాలు కట్టే వారికి అధికారులు అనుకూలంగా ఉంటూ అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వక్ఫ్ భూమిలో స్థానికంగా ఉన్న కౌన్సిలర్లు, అధికార, ప్రతిపక్ష నాయకుల అండదండతోనే అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని పలువురు ఆరోపిస్తున్నారు.
రాజకీయ నాయకుల అండదండలు..
తుక్కుగూడ మున్సిపాలిటీ పరిధిలోని తుక్కుగూడ, రావిరాల, సర్దార్ నగర్, ఇమామ్ గూడ, మహేశ్వరం గేట్ నుంచి ప్రజేయ్ వరకు అక్రమ నిర్మాణాలు రాజకీయ నాయకుల, టౌన్ ప్లానింగ్, మున్సిపల్ శాఖ అధికారుల అండదండలు పుష్కలంగా ఉన్నాయి. దీంతో మున్సిపాలిటీ నుంచి ఎలాంటి అనుమతులు లేకుండానే అక్రమార్కులు నిర్మాణాలు చేపడుతున్నారని పలువురు ఆరోపిస్తున్నారు.