నా భర్తను మళ్లీ చూస్తానని అనుకోలేదు

ఆరేళ్ళ క్రితం మాసిన బట్టలు... మానసిక స్థితి సరిగ్గాలేని రోడ్డుపై ఓ వృద్దుడిని మాతృ దేవో భవ అనాధ ఆశ్రమ నిర్వాహకులు చేరదీసి.

Update: 2024-11-29 16:04 GMT

దిశ, బడంగ్ పేట్ : ఆరేళ్ళ క్రితం మాసిన బట్టలు... మానసిక స్థితి సరిగ్గాలేని రోడ్డుపై ఓ వృద్దుడిని మాతృ దేవో భవ అనాధ ఆశ్రమ నిర్వాహకులు చేరదీసి.... ఎర్రగడ్డ మానసిక వైద్యశాలలో చికిత్స అందించి మరీ కుటుంబ సభ్యుల చెంతకు చేర్చారు. వివరాల్లోకి వెళితే.. ఆంధ్రప్రదేశ్ పశ్చిమగోదావరి జిల్లా పొలమూరు తాలుక కు చెందిన కవూరు నాగభూషణం (61) మతిస్థిమితం సరిగా లేకపోవడంతో సరిగ్గా ఆరేళ్ళ క్రితం ఇంటి నుండి తప్పిపోయి రైలులో హైదరాబాద్ కు వచ్చాడు. ఎక్కడికి వెళ్తున్నాడో అర్థం కాక చివరికి బంజారాహిల్స్ ప్రాంతంలో రోడ్డు డివైడర్ పై మాసిన బట్టలతో పెరిగిన జుట్టు,గడ్డలతో రోజుల తరబడి నాగభూషణం అక్కడే కూర్చోని ఉండడాన్ని గమనించిన మాతృదేవోభవ అనాధ ఆశ్రమ నిర్వాహకుడు గట్టు గిరికి సమాచారం అందించారు.

ఆశ్రమ వ్యవస్థాపకుడు గట్టు గిరి అతని టీంతో అక్కడకు చేరుకొని అతని వివరాలు కనుకొనే ప్రయత్నం చేయగా తన పేరు నాగభూషణం అని మాత్రమే చెప్పాడు. తన చిరునామా స్పష్టంగా చెప్పలేకపోవడం తో అతన్ని చేరదీసి మాతృదేవోభవ అనాధ ఆశ్రమంలో ఆశ్రయం కల్పించారు. అంతేగాకుండా ఎర్రగడ్డ మానసిక వైద్యాశాలలో అతనికి చికిత్స అందించిన తర్వాత ఆరేళ్లకు ఆయన ఆరోగ్యం కుదుటపడింది. ఆయన పూర్తి వివరాలు కనుగొని వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించడంతో ఆశ్రమానికి వచ్చిన భార్య సత్యవతి, కూతురు పద్మ లు నాగభూషణం ను చూసి కన్నీరు కార్చారు. తన భర్త ఇంకా బతికే ఉన్నాడని కలలో కూడా అనుకోలేదని, అందులో ఇంకా ఆరోగ్యంగా ఉంటాడని ఊహించలేదని, నాగభూషణం ను మళ్ళీ మామూలు మనిషిగా మార్చి తమ కుటుంబానికి క్షేమంగా అప్పగించిన మాతృదేవోభవ ఆశ్రమ వ్యవస్థాపకుడు గట్టు గిరికి కృతజ్ఞతలు తెలిపారు.


Similar News