ప్రజాపాలన - ప్రజా విజయోత్సవాలను విజయవంతం చేయాలి

మహబూబ్ నగర్ జిల్లాలో నిర్వహిస్తున్న రైతు పండుగ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు.

Update: 2024-11-29 15:31 GMT

దిశ, రంగారెడ్డి బ్యూరో: మహబూబ్ నగర్ జిల్లాలో నిర్వహిస్తున్న రైతు పండుగ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ భవనంలోని సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి, అదనపు కలెక్టర్ తో కలిసి జిల్లా అధికారులతో పలు అంశాలపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ… శనివారం మహబూబ్ నగర్ జిల్లా నందు నిర్వహిస్తున్న రైతు పండుగ కార్యక్రమానికి జిల్లాలోని షాద్ నగర్, కల్వకుర్తి నుంచి రైతులు, మహిళా రైతులను తీసుకెళ్లుటకు ఏర్పాట్లు చేయాలని సూచించారు. రైతులకు 95 బస్సులు, మహిళా రైతులకు 45 బస్సులు ఏర్పాటు చేయాలని, ప్రతి బస్సుకు ఒక లైజన్ అధికారి, ఒక కానిస్టేబుల్ ను నియమించాలని తెలిపారు. బస్సులు సమయానికి బయలుదేరి విధంగా ప్రణాళిక రూపొందించుకోవాలని సూచించారు.

ప్రతి బస్సులో త్రాగునీరు అందుబాటులో ఉంచాలని, రైతులకు భోజన వసతి, వారికి కావలసిన సదుపాయాలు చేపట్టాలని, ఎక్కడ ఎలాంటి పొరపాట్లు జరగకుండా సంబంధిత అధికారులు సమిష్టిగా పని చేయాలని, ప్రత్యేక శ్రద్ద వహించి బాధ్యతతో పని చేయాలని తెలిపారు. అనంతరం డిసెంబర్ 1వ తేదీ నుంచి 9వ తేదీ వరకు తొమ్మిది రోజుల పాటు నిర్వహించే ప్రజాపాలన - ప్రజా విజయోత్సవాల్లో భాగంగా ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు సంబంధించి జిల్లాలో చేపట్టవలసిన కార్యక్రమాల పై సమావేశం నిర్వహించారు. డిసెంబర్ 1వ తేదీన ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ రెండో దశకు శంకుస్థాపన చేస్తారని, అందులో భాగంగా విద్యార్థులు వ్యాసరచన పోటీలలో పాల్గొనే విధంగా చూడాలని సంబంధిత అధికారులకు తెలిపారు. డిసెంబర్ 1వ తేదీ నుంచి 8వ తేదీ వరకు "CM కప్" క్రీడా కార్యక్రమాలు జరుగుతాయని అందుకు సంబంధించిన ఏర్పాట్లు చూడాలని సంబంధిత అధికారులకు సూచించారు.

డిసెంబర్ 2వ తేదీన 16 నర్సింగ్ కళాశాలలు, 28 పారామెడికల్ సంస్థల ప్రారంభోత్సవం, 213 అంబులెన్స్‌లు, 33 ట్రాన్స్‌జెండర్ క్లినిక్‌ల ప్రారంభం, ట్రాన్స్‌జెండర్ వ్యక్తులను ట్రాఫిక్ వాలంటీర్లుగా చేర్చే పైలట్ ప్రాజెక్ట్ ను చేపట్టడం జరుగుతుందని, జిల్లాలో నర్సింగ్ కళాశాల ప్రారంభోత్సవానికి కావాల్సిన ఏర్పాట్లు చేయాలని సంబంధిత ఆర్డీఓ, వైద్య అధికారికి ఆదేశించారు. డిసెంబర్ 3వ తేదీన హైదరాబాద్ రైజింగ్ ఇనిషియేటివ్ ఆవిష్కరణ, జూ ఫ్లైఓవర్ ప్రారంభోత్సవం, నగరంలో రూ.150 కోట్ల విలువైన సుందరీకరణ ప్రాజెక్టులు, కెబిఆర్ పార్క్ సమీపంలోని ఆరు ఫ్లైఓవర్లు/జంక్షన్ల అభివృద్ధి పనులు ప్రారంభం ఉంటుందని తెలిపారు. డిసెంబరు 4వ తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థ భవనానికి శంకుస్థాపన, వర్చువల్ సఫారీ, ట్రీ ఇంట్రడక్షన్ సెంటర్ ప్రారంభం కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. డిసెంబర్ 5వ ఇందిరా మహిళా శక్తి బజార్ ప్రారంభం; మహిళా స్వయం సహాయక సంఘాలతో చర్చలు, మేడ్చల్, మల్లేపల్లి, నల్గొండలో ప్రారంభించనున్న మూడు అధునాతన సాంకేతిక కేంద్రాలు (ఏటీసీ) ఘట్‌కేసర్‌లోని బాలికల ఐటీఐ కళాశాల.

డిసెంబర్ 6వ తేదీన యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ కార్యకలాపాలు ప్రారంభం; 244 విద్యుత్ సబ్ స్టేషన్లకు శంకుస్థాపన ఉంటుందని, జిల్లాలో విద్యుత్ సబ్ స్టేషన్ల శంకుస్థాపనకు ఏర్పాటు చేయాలని అన్నారు. డిసెంబర్ 7వ తేదీన స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ప్రారంభం; లొకేషన్‌లలో ప్రదర్శించడానికి పోలీసు బ్యాండ్‌లు; రాష్ట్ర వ్యాప్తంగా ఆర్ట్ ఎగ్జిబిషన్‌లు, సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయన్నారు. డిసెంబర్ 8వ తేదీన 130 మీ సేవా కేంద్రాలతోపాటు ఏడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ప్రాజెక్ట్‌లు ప్రారంభించబడతాయి. AI సిటీకి శంకుస్థాపన కార్యక్రమం, స్పోర్ట్స్ యూనివర్సిటీకి శంకుస్థాపన. డిసెంబరు 9వ తేదీన లక్షలాది మంది మహిళా శక్తి సభ్యుల సమక్షంలో సచివాలయ ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరణ. హుస్సేన్‌సాగర్‌లో ముగింపు వేడుకల్లో డ్రోన్ షో, బాణసంచా కాల్చడం, ఆర్ట్ గ్యాలరీ, తెలంగాణ సంస్కృతి, ప్రగతిని చాటిచెప్పే స్టాళ్లు ఉంటాయని అన్నారు.

పైన చేపట్టే కార్యక్రమాలలో జిల్లాకు సంబంధించిన కార్యక్రమాలలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా, గ్రామస్థాయిలో, మండల స్థాయి పరిధిలో, మున్సిపాలిటీల పరిధిలో నిర్వహించే కార్యక్రమాలకు ఎంపీడీఓలు, కమిషనర్లు బాధ్యతగా పనిచేయాలన్నారు. సంబంధిత అధికారులు సమన్వయంతో సమిష్టిగా పని చేసి విజయవంతం చేయాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. సర్వే డేటా నమోదు కార్యక్రమం పలు మండలాల్లో విజయవంతంగా చేయడం జరుగుతుందని, వెనుకబడిన మండలాలలో డేటా నమోదు కార్యక్రమం వేగవంతం చేయాలన్నారు. డేటా నమోదు కార్యక్రమం ఆదివారం వరకు వంద శాతం పూర్తి చేయాలని అన్నారు. క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత సర్వే డేటా నమోదు చేయాలని అన్నారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ ప్రతిమ సింగ్, డిఆర్ఓ సంగీత, జిల్లా ప్రజా పరిషత్ సీఈఓ కృష్ణ రెడ్డి, జిల్లా అధికారులు, మున్సిపల్ కమిషనర్స్, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.


Similar News