రాజకీయ శరణార్థిగా గుర్తించండి.. అమెరికా ప్రభుత్వానికి ప్రభాకర్‌రావు రిక్వెస్ట్
ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎస్‌ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్‌రావు అరెస్టు నుంచి తప్పించుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
దిశ, సిటీ క్రైం: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎస్‌ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్‌రావు అరెస్టు నుంచి తప్పించుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా తనను శరణార్ధిగా చూడాలని ఆయన అమెరికా ప్రభుత్వానికి పిటిషన్ ద్వారా వేడుకున్నట్లు శుక్రవారం వెలుగులోకి వచ్చింది. ఈ ఏడాది మార్చి నెలలో ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ పోలీసు అధికారులు ప్రణీత్ రావు, భుజంగరావు, తిరుపతన్న, రాధాకిషన్ రావు అరెస్టు తర్వాత ప్రభాకర్ రావు అమెరికా వెళ్లిపోయాడు. 9 నెలలుగా దర్యాప్తునకు సహకరిస్తానని చెబుతూ మరో వైపు పోలీసుల అరెస్టు నుంచి తప్పించుకునేందుకు అన్ని మార్గాలను అన్వేషిస్తున్నట్లు సమాచారం.
కౌంటర్ ఇచ్చేందుకు పోలీసులు రెడీ
ప్రభాకర్ రావు అమెరికా ప్రభుత్వానికి తాను రాజకీయ శరణార్థిగా వచ్చానని, తనకు రక్షణ కల్పించాలని అక్కడి ప్రభుత్వానికి పిటిషన్ పెట్టుకున్నట్లు సమాచారం. ఈ పిటిషన్ లో తాను తెలంగాణ పోలీసు శాఖలో ఉన్నత స్థాయిలో పని చేశానని, ఈ నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం తనను వేధిస్తోందని, తీవ్రమైన అనారోగ్య సమస్యతో అమెరికాలో వైద్య చికిత్స పొందుతున్నానని వివరించారు. తెలంగాణ ప్రభుత్వం రాజకీయ కక్షతో వేధిస్తున్న అంశాలను పరిగణలోకి తీసుకుని తనను అమెరికాలో రాజకీయ శరణార్థిగా గుర్తించి రక్షణ కల్పించాలని వేడుకున్నట్లు సమాచారం. అయితే దీనిపై హైదరాబాద్ పోలీసులు గట్టిగా కౌంటర్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. సరైన ఆధారాలతో విదేశాంగ శాఖ ద్వారా అమెరికా ప్రభుత్వానికి వివరించేందుకు సిద్ధమవుతున్నారు.
నా పాస్ పోర్టును రద్దు చేయొద్దు
ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో భాగంగా హైదరాబాద్ పోలీసులు ఇప్పటికే కోర్టు ఇచ్చిన నాన్ బెయిలబుల్ వారెంట్ ఆధారంగా ప్రభాకర్ రావు పాసుపోర్టును ఇంపౌండ్(జప్తు) చేసినట్లు ఇప్పటికే పాసుపోర్టు అధికారుల ద్వారా కేంద్ర విదేశాంగ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. విషయం తెలుసుకున్న ప్రభాకర్ రావు ఆన్ లైన్ లో అమెరికా నుంచి తన పాసుపోర్టును రద్దు చేయొద్దని పిటిషన్ రూపంలో కోరారు. దీనిని విచారించిన కేంద్ర విదేశాంగ శాఖ ప్రభాకర్ రావు రిక్వెస్టును కొట్టివేసినట్లు పోలీసు వర్గాలు చెబుతున్నాయి. మరో వైపు శ్రవన్ రావును కూడా రప్పించేందుకు పోలీసులు చర్యలు చేపడుతున్నారు.
ఇంటర్ పోల్‌కు చేరిన రెడ్ కార్నర్ నోటీసు
ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావు, శ్రవణ్ రావుకు జారీ చేసిన రెడ్ కార్నర్ నోటీసులు ఇంటర్ పోల్ వరకు చేరాయి. కానీ కొన్ని చిన్న ఎంక్వైరీల కారణంగా తిరిగి సీబీఐ చెంతకు చేరాయి. అయితే ఇంటర్ పోల్ అధికారులు ఎంక్వైరీకి సంబంధించిన ప్రశ్నలకు సమాధానాలను ఇచ్చారు. ప్రస్త్తుతం నోటీసుల వ్యవహారం సిబిఐ దగ్గర ఉంది. అమెరికాలో నిందితులకు రెడ్ కార్నర్ నోటీసులు అందేలా ప్రక్రీయను పోలీసులు వేగవంతం చేశారు.