రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసిన BRS, MIM.. స్కెచ్ అదిరిపోయిందిగా..?
కాంగ్రెస్ ఇటీవల ప్రకటించిన ఆరు గ్యారంటీలు, హస్తం పార్టీకి దశాబ్ధాలుగా తెలంగాణలో ఉన్న ఓటు బ్యాంకును దృష్టిలో ఉంచుకుని అధికార బీఆర్ఎస్, దాని మిత్ర పక్షం ఎంఐఎం అలర్ట్ అయ్యాయి.
దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ ఇటీవల ప్రకటించిన ఆరు గ్యారంటీలు, హస్తం పార్టీకి దశాబ్ధాలుగా తెలంగాణలో ఉన్న ఓటు బ్యాంకును దృష్టిలో ఉంచుకుని అధికార బీఆర్ఎస్, దాని మిత్ర పక్షం ఎంఐఎం అలర్ట్ అయ్యాయి. ఎన్నికలు దగ్గర పడుతుండటంతో ముస్లిం ఓట్లు కాంగ్రెస్ పార్టీకి మళ్లకుండా ఉండేందుకు రేవంత్ రెడ్డిని టార్గెట్ చేశాయి. రేవంత్ ఆర్ఎస్ఎస్ భావజాలం కలిగిన వ్యక్తి అని ఎంఐఎం ముఖ్యనేతలు అసదుద్దీన్, అక్బరుద్దీన్ ఇటీవల మండిపడ్డారు. గతంలో కాంగ్రెస్‌కు వరుసగా మద్దతు తెలిపిన ఎంఐఎం ఇటీవల రూటు మార్చింది. తమకు తగిన ప్రాధాన్యత ఇవ్వడంతో ఈ సారి తాము పోటీ చేయని స్థానాల్లో మామూ(కేసీఆర్)కు మద్ధతు ఇవ్వాలని ఇటీవల అసదుద్దీన్ బహిరంగ సభల్లో చెబుతూ వస్తున్నారు. ఇక, బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం ఒకటే అని కాంగ్రెస్ ఆరోపిస్తూ వస్తుంది.
ముస్లిం ఓటు బ్యాంకు లక్ష్యంగా..
రాష్ట్ర వ్యాప్తంగా ముస్లిం జనాభా 40 లక్షల వరకు ఉంటుందని అంచనా.. హైదరాబాద్‌తో పాటు నిజామాబాద్, ఆదిలాబాద్, నల్గొండ, మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాల్లో ముస్లిం ఓటర్లు అధికంగా ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 30-40 సెగ్మెంట్లలో నిర్ణయాత్మకంగా వీరి ఓట్లు ఉన్నాయి. దీంతో కాంగ్రెస్ పార్టీకి ముస్లిం ఓటర్లను దూరం చేయాలని బీఆర్ఎస్, ఎంఐఎం స్కెచ్ వేశాయి. తమ పార్టీ ముస్లింలకు చేసిన అభివృద్ధి సైడ్ చేసి మరి రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ టార్గెట్ చేసింది. కేసీఆర్ కూతురు పట్ల బీజేపీ సాఫ్ట్ వైఖరితో ఈ రెండు పార్టీలు ఒకటే అనే అనుమానం ముస్లిం ఓటర్లలో బలంగా ఉంది. దీన్ని గమనించే రెండు పార్టీలు కాంగ్రెస్ టార్గెట్‌గా తమ ఎదురుదాడికి పదును పెట్టాయి.
రేవంత్ రెడ్డిపై ఆ ముద్ర వేసేలా..
టీపీసీసీ చీఫ్‌గా రేవంత్ రెడ్డి పగ్గాలు చేపట్టిన నాటి నుంచి కాంగ్రెస్ వరుసగా తన గ్రాఫ్ పెంచుకుంటోంది. ఇక ఇటీవల ఆరు గ్యారంటీల ప్రకటనతో కాంగ్రెస్ పార్టీలో ముఖ్య నేతలు చేరడం, నల్లగొండ, ఖమ్మం, మహబూబ్ నగర్‌లో కాంగ్రెస్ రోజు రోజుకి బలోపేతం కావడం, ఈ మూడు జిల్లాల్లో క్లీన్ స్వీప్ చేస్తే అధికారం నల్లేరు మీద నడక అని హస్తం పార్టీ భావిస్తోంది. దీంతో ఈ విషయాలను నిశితంగా పరిశీలించిన కారు పార్టీ మిత్ర పక్షాన్ని సైతం అలర్ట్ చేసింది. కాంగ్రెస్ పార్టీపై మాటల దాడి చేయడంతో ముస్లిం ఓటర్లను తమ వైపునకు తిప్పుకోగలిగితే సానుకూల ఫలితాలు వస్తాయని ఈ రెండు పార్టీలు భావిస్తున్నాయి.
ఇక బీజేపీ విధానాలతో గుర్రుగా ఉన్న ముస్లిం ఓటర్లు.. కారు పార్టీ, కాషాయం పార్టీతో మిలాఖత్ అయిందనే భావనలో ఉన్నారు. దీంతో ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్‌ను ఎంచుకునే అవకాశం ఉన్నందునే కారు, పతంగి పార్టీలు టీపీసీసీ చీఫ్‌ను టార్గెట్ చేశాయని పొలిటికల్ ఎక్స్‌పర్ట్స్ అంటున్నారు. మంత్రి కేటీఆర్ సైతం ఇటీవల రేవంత్‌పై విమర్శలకు పదును పెట్టారు. సభ ఏదైనా రేవంత్ ప్రస్తావన ఉండేలా ఆయన బీజేపీ వ్యక్తి అని ప్రజల్లో మెసేజ్ వెళ్లేలా స్పీచ్‌లు ఇస్తున్నారు.
గాంధీభవన్‌లో గాడ్సేను కూర్చోబెట్టారని, ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉన్న వ్యక్తిని పీసీసీ చీఫ్ ఎలా చేస్తారంటూ పంజాబ్ మాజీ సీఎం అమరీందర్ సింగ్ సోనియా గాంధీకి లేఖ రాశారని మంత్రి కేటీఆర్ తరచూ ప్రస్తావిస్తున్నారు. రేవంత్ రెడ్డిపై ఆర్ఎస్ఎస్ ముద్రను గట్టిగా వేయగలిగితే ముస్లిం ఓటర్లు కాంగ్రెస్ పార్టీ వైపు మళ్లరని రెండు మిత్ర పక్ష పార్టీలు బలంగా విశ్వసిస్తున్నాయి. ఇందులో భాగంగా పథకం ప్రకారమే రేవంత్ రెడ్డిపై ఆర్ఎస్ఎస్ ముద్ర వేయాలని తద్వారా ఎన్నికల్లో లబ్ధి పొందాలని భావిస్తున్నారు. మరి బీఆర్ఎస్, మజ్లిస్ వేసిన ఎత్తులు ఏ మేరకు ఫలిస్తాయి.. ముస్లిం ఓటర్లు ఎవరికి బాసటగా నిలుస్తారనేది మరి కొన్ని రోజుల్లో తేలనుంది.