మూసీ పునరుజ్జీవనను అడ్డుకోవాలనే బీఆర్ఎస్ నేతల రాద్ధాంతం : ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

మూసీ పునరుజ్జీవన కార్యక్రమాన్ని అడ్డుకోవాలనే బీఆర్ఎస్ నేతలు రాద్ధాంతం చేస్తు నిర్వాసితులను రెచ్చగొడుతున్నారని సీనియర్ కాంగ్రెస్ నేత, ఎమ్మెల్సీ టీ.జీవన్ రెడ్డి విమర్శించారు.

Update: 2024-10-18 09:44 GMT

దిశ, వెబ్ డెస్క్ : మూసీ పునరుజ్జీవన కార్యక్రమాన్ని అడ్డుకోవాలనే బీఆర్ఎస్ నేతలు రాద్ధాంతం చేస్తు నిర్వాసితులను రెచ్చగొడుతున్నారని సీనియర్ కాంగ్రెస్ నేత, ఎమ్మెల్సీ టీ.జీవన్ రెడ్డి విమర్శించారు. మల్లన్న సాగర్, మూసీ బాధితుల వద్దకు పోదాం అంటూ సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి టీ. హరీష్ రావు సవాల్ చేయడం పట్ల జీవన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మల్లన్న సాగర్ కు హరీష్ రావు వెళితే అక్కడి జనమే అడ్డుకున్న సంగతి మరువరాదని గుర్తుచేశారు. మేము నిర్వాసితులకు అండగా ఎప్పుడు అక్కడ ఉండే వాళ్ళమేనని, మల్లన్న సాగర్ నిర్వాసితుల పట్ల కేసీఆర్ ప్రభుత్వం చేసిన దుర్మార్గాలను వారు మరిచిపోలేదన్నారు. గతంలో హుస్సేన్ సాగర్ నీళ్లు కొబ్బరి నీళ్లు చేస్తా అన్నారని ఏమైందని? హరీష్ రావును జీవన్ రెడ్డి ప్రశ్నించారు. మూసీ మీద మీకున్న అభ్యంతరం ఏంటి..? అని హరీష్ రావును ప్రశ్నించారు. ప్రభుత్వానికి మూసీ ప్రక్షాళనపై సలహాలు సూచనలు ఇవ్వకుండా.. మురికి అలాగే ఉండాలి అంటారా అని మండిపడ్డారు.

మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టును అడ్డుకోవాలన్న ఆలోచనే తప్పితే.. కేటీఆర్, హరీష్ లకు సలహా ఇచ్చే ఆలోచన లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం బీఆర్ఎస్ రాజకీయాలను తిప్పికొట్టి వెంటనే మూసీ ప్రక్షాళన చేపట్టాలని, హుస్సేన్ సాగర్ ను సైతం ప్రక్షాళన చేయాలన్నారు. ఇప్పటికే ప్రభుత్వం చాలవరకు మూసీ నిర్వాసితులను తరలించిందని, బఫర్ జోన్ లో వారికి పునరావాస చర్యలు తీసుకుంటుందని స్పష్టతనిచ్చిందని, ఇంకా దీనిపై బీఆర్ఎస్ రాద్దాంతం అనవసరమన్నారు. బీఆరెఎస్ పదేళ్ల పాలనలో ఆ పార్టీ చెప్పిన ఎన్నికల హామీలన్ని అమలుకు నోచుకోక తెలంగాణ వనరులు కొల్లగొట్టబడ్డాయని విమర్శించారు. బీఆర్ఎస్ ఇస్తామన్న లక్ష ఉద్యోగాలు ఇవ్వలేదని, మేము పది నెల్లలో 30 వేల ఉద్యోగాలు ఇచ్చామన్నారు. గ్రూప్ 1 ఇప్పటికే ఓసారి వాయిదా వేశారని, ఉద్యోగాలు ఇస్తే, మూసీ ప్రక్షాళన చేస్తే కాంగ్రెస్ కు పేరొస్తుందని బీఆర్ఎస్, బీజేపీలు అడ్దుపడుతున్నాయని ఆరోపించారు. 


Similar News