టికెట్ కోసం ట్రెండ్ మార్చిన BRS లీడర్స్.. KCR దృష్టిలో పడేందుకు నయా క్రియేటివిటీ..!
ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో టికెట్ల కోసం బీఆర్ఎస్ నేతలు పడుతున్న పాట్లు అన్నీ ఇన్నీ కావు.
దిశ, తెలంగాణ బ్యూరో: ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో టికెట్ల కోసం బీఆర్ఎస్ నేతలు పడుతున్న పాట్లు అన్నీ ఇన్నీ కావు. సీఎం కేసీఆర్ దృష్టిలో పడేందుకు మంత్రులు, ఎమ్మెల్యేలు ఎవరికి తోచిన రీతిలో వారు తమ క్రియేటివిటీని ప్రదర్శిస్తున్నారు. పచ్చబొట్లు వేయించుకుంటూ, పాలాభిషేకాలు చేస్తూ కేసీఆర్ వద్ద మార్కులు కొట్టేయాలని విశ్వ ప్రయత్నాలూ చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు గడువు సమీపిస్తుండటంతో బీఆర్ఎస్ నేతలు అధినేత కేసీఆర్ దృష్టిలో పడేందుకు తమ నైపుణ్యాలకు పదును పెడుతున్నారు.
ప్రజలకు ఎలా దగ్గర కావాలి.. ఏం చేస్తే గులాబీ బాస్ దృష్టిలో పడతామని కొత్త ఆలోచనలు చేస్తున్నారు. ఒక్కో లీడర్ వినూత్నంగా ఏదో ఒకటి చేస్తూ అధినేత నజర్ అంతా తమ మీదే పడే విధంగా వ్యూహాలు రచిస్తున్నారు. ఇప్పటి వరకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు కొత్తగా ప్రవేశ పెట్టినా, ఉద్యోగాల భర్తీ, వేతనాల పెంపు, అభివృద్ధి పనులకు శ్రీకారం చుడితే ఫ్లెక్సీలకు పాలాభిషేకాలు చేసే ఆచారం ఉండేది. ఇప్పుడు నేతలు దానికి భిన్నంగా ఆలోచిస్తున్నారు.
ట్రెండ్ మార్చిన నేతలు
అధినేత దృష్టిలో పడేందుకు నేతలు ట్రెండ్ చేంజ్ చేశారు. పచ్చబొట్లు, పాలాభిషేకాలకు శ్రీకారం చుడుతున్నారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఇటీవల మంత్రి సత్యవతి రాథోడ్ తన చేతిపై కేసీఆర్ పేరుతో పచ్చబొట్టు వేయించుకున్నారు. ఇంతకు ముందే ఆమె కేసీఆర్ మూడోసారి అధికారంలోకి వచ్చేంత వరకూ కాళ్లకు చెప్పులు వేసుకోనని ప్రకటించారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ సైతం తనదైన శైలీలో ముందుకు సాగుతున్నారు. మహబూబ్‌నగర్‌లో చేసిన అభివృద్ధికి గాను మహిళలు ఏకంగా ఆయనకు పాలాభిషేకం చేశారు.
మల్లారెడ్డిది డిఫరెంట్ స్టైల్
మంత్రి మల్లారెడ్డిది డిఫరెంట్ స్టైల్. కార్యక్రమం ఏదైనా డప్పు మోగితే చాలు ఆయన స్టెప్పులు వేసేస్తారు. కేసీఆర్ కుటుంబాన్ని పొగడ్తలతో ముంచెత్తుతారు. ఆయన చరిత్ర చెప్పుకోవడంతో పాటు ప్రజలను ఆకట్టుకునేలా ఉపన్యాసం ఇస్తారు. ఆయన బాటలోనే పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలూ నడుస్తున్నారు.
వేదిక ఏదైనా తమదైన శైలీలో ప్రసంగిస్తూ ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. సందర్భాన్ని బట్టి కేసీఆర్ ఫ్లెక్సీలకు పాలాభిషేకాలు దగ్గరుండి మరీ చేయిస్తున్నారు. గ్రామాలకు వెళ్లినప్పుడు చిన్నారులతో క్రికెట్ ఆడటం, రోడ్డు ప్రమాదాలు జరిగితే క్షతగాత్రులను దవాఖానలకు తరలించడం, ప్రజలను ఆత్మీయంగా పలకరిస్తూ మీడియాలో నిలిచే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు.
Also Read: యూత్ టార్గెట్‌గా KCR భారీ వ్యూహం.. CM స్కెచ్‌తో యువత BRSకు అట్రాక్ట్ అయినట్టేనా..?