House Arrest : సీఎం డీజీపీకి ఆదేశాలివ్వడం విలనే హీరో పాత్ర వేయడం: ఆర్ఎస్పీ ఆసక్తికర ట్వీట్

బంగారు తెలంగాణ నేడు బందీఖానా అయిందని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు.

Update: 2024-09-13 05:41 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: బంగారు తెలంగాణ నేడు బందీఖానా అయిందని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా తాను హౌస్ అరెస్ట్ అయిన వీడియోలు షేర్ చేశారు. ఈ రోజు ఉదయం బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ఇంట్లో సమావేశానికి బయలుదేరుతుంటే పోలీసులు నేను వెళ్ళడానికి వీలు లేదని గృహనిర్బంధంలో ఉంచారని వెల్లడించారు. ఈ విధంగా మాజీ మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి తో సహా చాలా మంది సీనియర్ నాయకులను నిర్బంధించారని తెలిపారు. ఇదేం అన్యాయం? మా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనే స్వేచ్ఛ కూడా మాకు లేదా? సీఎం రేవంత్ నాటి సమైక్య ఆంధ్ర పాలన రోజులను గుర్తుకు తెస్తున్నారని నిలదీశారు.

నిన్న అరికెపూడి గాంధీ కేమో పూర్తి బందోబస్తు ఇచ్చి తమ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటికి తీసుకొని పోయి మరీ దాడి చేయించారని, న్యాయం చేయండి అని ప్రాధేయ పడిన కౌశిక్ రెడ్డి మీద ఉల్టా మళ్లీ కేసు పెట్టారని ఆరోపించారు. ఇక హైదరాబాదు బ్రాండు ఇమేజ్‌ను హైడ్రాలు-కోబ్రాలతో నాశనం చేసిన రేవంత్ దాన్ని కాపాడాలని డీజీపికి ఆదేశాలివ్వడం ఒక పెద్ద జోక్. ఇది విలనే హీరో పాత్ర వేయడం లాంటిది.. అని తీవ్ర విమర్శలు చేశారు.


Similar News