నేతలు పార్టీ మారుతున్న మౌనంగా ఉంటున్న బీఆర్ఎస్
బీఆర్ఎస్ పార్టీ ఆచితూచి అడుగులు వేస్తోంది. కొంతమంది అసంతృప్త నేతలు పార్టీ మారుతున్న మౌనం వీడడం లేదు. అవసరం ఉన్న చోట మాత్రమే నేతలకు తాయిలాలు ఇస్తోంది.
దిశ, తెలంగాణ బ్యూరో: బీఆర్ఎస్ పార్టీ ఆచితూచి అడుగులు వేస్తోంది. కొంతమంది అసంతృప్త నేతలు పార్టీ మారుతున్న మౌనం వీడడం లేదు. అవసరం ఉన్న చోట మాత్రమే నేతలకు తాయిలాలు ఇస్తోంది. అంతేకాదు పదవులు రాకపోయినా నేతలు పార్టీలో ఉంటేనే బెటర్ అనే భావనను కల్పిస్తోంది. మరోవైపు గులాబీ బాస్ కేసీఆర్ ప్రతి అంశాన్ని, రాజకీయ పరిణామాలను క్షుణ్నంగా పరిశీలిస్తున్నారు.
వారి పట్ల చూసీ చూడనట్లు గానే..
బీఆర్ఎస్ పార్టీలో అన్ని పార్టీలకు చెందిన కీలక నేతలు చేరారు. పార్టీలో ఉన్న నేతలతో పాటు ఒక్కో నియోజకవర్గం నుంచి ఇద్దరు ముగ్గురు టికెట్ ఆశించారు. అయితే కేసీఆర్ రాబో యే అసెంబ్లీ ఎన్నికల్లో సిట్టింగ్‌లకే పోటీ చేసే అవకాశం కల్పించారు. దీంతో కొంతమంది నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే అందులో పలువురితో సంప్రదింపులు జరిపారు. కొంతమందికి హామీలు సైతం ఇచ్చారు. అంతే కాదు మంత్రులకు ప్రతిష్టాత్మకంగా మారిన నియోజకవర్గాల్లో కార్పొరేషన్ పదవులను సైతం అప్పగించారు.
మరికొందరికి ఎమ్మెల్సీలతోపాటు నామినేటెడ్ హామీలు ఇచ్చారు. అయినప్పటికీ కొందరు పార్టీపై అసంతృప్తితో ఉన్నారు. వారిని మాత్రం చూసీచూడనట్టుగా వ్యవహరిస్తున్నట్లు సమాచారం. అందులో భాగంగానే కొంతమంది మాజీ ఎమ్మెల్యేలు, సిట్టింగ్ ఎమ్మెల్యేలు, నేతలు పార్టీ మారుతున్న వారిని బుజ్జగించే ప్రయత్నం చేయలేదు. కేసీఆర్ సైతం వారికి సమయం కేటాయించడం లేదని బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు.
అవసరం ఉన్నచోట తాయిలాలు
బీఆర్ఎస్ పార్టీ సర్వేల ఆధారంగానే పార్టీలోని నేతలను చేరదీస్తోంది. నేతపై ప్రజల్లో ఆదరణ లేకపోతే మాత్రం కనీసం మందలించే వారు కరువు అవుతున్నారు. అదే నేత ప్రభావంతో పాటు గెలుపోటములను నిర్దేశించే స్థాయిలో ఉన్న వారిని మాత్రం వదులుకోవడం లేదు. అందులో భాగంగానే రంగారెడ్డి జిల్లాలో బలమైన నేత ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డికి ఏకంగా మంత్రి పదవిని కట్టబెట్టారు. అదే విధంగా పటాన్ చెరువు నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డికి స్టేట్ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ పదవి, స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే రాజయ్యకు రైతుబంధు సమితి చైర్మన్ పదవి, జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డికి ఆర్టీసీ కార్పొరేషన్ చైర్మన్ పదవి, వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌కు రాష్ట్ర వ్యవసాయరంగ వ్యవహారాల ప్రభుత్వ సలహాదారుగా కేబినెట్ హోదా పదవిలో నియమించారు. అదే ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్, మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, ఉప్పల్ ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి, కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్ తదితరులకు మాత్రం మొండి చెయ్యి చూపడంతో నిరాశలో ఉన్నారు. ఇప్పటికే మైనంపల్లి రాజీనామా చేశారు.
ఉంటేనే బెటర్ అనుకునేలా..
బీఆర్ఎస్ మూడోసారి అధికారంలో వస్తుందనే భావనను కల్పిస్తుంది అధిష్టానం. ఒక వేళ పార్టీ మారితే చేరే పార్టీలో గుర్తింపు రాదని ఆ నేతలను డైలమాలో పడేస్తున్నారు. దీంతో పార్టీ లో టికెట్ రాకపోవడంతో అసంతృప్తితో పార్టీ మారాలని అనుకున్నవారికి అడ్డుకట్ట వేస్తున్నారు. పార్టీలో కొనసాగితే రాబోయే కాలంలోనైనా పదవులు వస్తాయనే ఆశను కల్పిస్తున్నారు. దీంతో పార్టీ విజయానికి కృషి చేయాల్సిన అనివార్య పరిస్థితి నెలకొంది. మరోవైపు కేసీఆర్ రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను ఆసక్తిగా గమనిస్తున్నారు. ప్రతిపక్షాలకు చెక్ పెట్టేలా చర్యలు చేపడుతున్నారు.
More News : తుంగతుర్తిలో శరవేగంగా మారుతున్న రాజకీయాలు