సర్కారు కసరత్తుతో హై టెన్షన్.. బీఆర్ఎస్‌కు ‘రుణమాఫీ’ భయం!

తులకు రూ. రెండు లక్షల రుణమాఫీని ఏకకాలంలో అమలు చేయడానికి ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేసింది.

Update: 2024-06-19 01:58 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : రైతులకు రూ. రెండు లక్షల రుణమాఫీని ఏకకాలంలో అమలు చేయడానికి ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేసింది. ఇచ్చిన మాట ప్రకారం పంద్రాగస్టుకల్లా కంప్లీట్ చేయాలని టార్గెట్‌గా పెట్టుకున్నది. దీని కోసం నిధుల సమీకరణపై ఫోకస్ పెట్టింది. ఇదే సమయంలో ఆ స్కీమ్ అమలుపై గులాబీ పార్టీ సైతం సీరియస్ దృష్టి సారించింది. నిజంగానే రుణమాఫీ అమలైతే రైతుల్లో ఇప్పటివరకూ ఉన్న బీఆర్ఎస్ గ్రౌండ్ మొత్తంగానే ఖాళీ అవుతుందన్నది ఆ పార్టీ నేతలకు భయం పట్టుకున్నది. పదేండ్లుగా రైతుల ఆదరణతో పార్టీ బలంగా ఉన్నదని, రైతుబంధు లాంటి పథకాలే తమ పార్టీని పవర్‌లోకి తీసుకొచ్చాయని, ఇప్పుడు ఆ సెక్షన్ మొత్తం కాంగ్రెస్‌కు పాజిటివ్‌గా మారితే ఇక ప్రజల్లోకి వెళ్లడానికి అస్త్రాలే ఉండవన్నది గులాబీ పార్టీ ఆందోళన చెందుతున్నది.

భవిష్యత్తుపై టెన్షన్

రుణమాఫీ అమలు ఏకకాలంలో సాధ్యంకాదని బీఆర్ఎస్ భావిస్తున్నది. ఒకవేళ ఆ స్కీమ్ సక్సెస్ అయితే తమ పార్టీ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుందని బీఆర్ఎస్ నేతలు ఆందోళన చెందుతున్నారు. రైతుబంధు కన్నా రుణమాఫీ ఎఫెక్టు గణనీయంగా ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. ఒక్కసారిగా భారమంతా తగ్గిపోతే ఇక రైతుభరోసా, రైతుబీమా లాంటి అంశాలను రైతులు పట్టించుకోరని, వాటి అమలు కాస్త ఆలస్యమైనా ప్రభుత్వంపై పెద్దగా వ్యతిరేకత రాదని భావిస్తున్నారు. ఒకవైపు కాంగ్రెస్ వైఫల్యాలతో ప్రజల్లో ఆ పార్టీ పట్ల వ్యతిరేకత పెరుగుతూ ఉన్నదని ఇప్పటిదాకా గులాబీ నేతలు భావిస్తూ వచ్చారు. కానీ రుణమాఫీ అమలు చేస్తే సీన్ రివర్స్ అవుతుందని ఆందోళన చెందుతున్నారు.

జనంలోకి ఎలా వెళ్లాలి?

సకాలంలో రైతుబంధు సాయాన్ని అందించకపోవడంతో రైతుల్లో వస్తున్న వ్యతిరేకతను ఇంతకాలం రాజకీయంగా వాడుకుని ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ విమర్శించింది. రుణమాఫీని ఒకేసారి కంప్లీట్ చేస్తే ఇక ఏ అంశాన్ని పట్టుకుని జనంలోకి వెళ్లాలన్నది బీఆర్ఎస్‌ నేతలను వేధిస్తున్న ప్రశ్న. బీఆర్ఎస్ సైతం గతంలో రుణమాఫీ హామీ ఇచ్చింది. ఫస్ట్ టర్ములో నాలుగు విడతల్లో కంప్లీట్ చేసింది. సెకండ్ టర్ములో మాత్రం రూ.50 వేల వరకు మాత్రమే రుణాలను మాఫీ చేయగలిగింది. ఆ మేరకు రైతుల్లో అసంతృప్తి వ్యక్తమై.. చివరకు అసెంబ్లీ ఎన్నికల్లో అధికారాన్ని కోల్పోయింది. షెడ్యూలు ప్రకారం పంద్రాగస్టు కల్లా కాంగ్రెస్ రుణమాఫీ కంప్లీట్ చేస్తే.. అది అధికార పార్టీకి అడ్వాంటేజ్‌గా మారి బీఆర్ఎస్ ఉనికి ప్రశ్నార్థకమవుతుందన్నది గులాబీ లీడర్ల ఆవేదన.

జాతీయ, సహకార బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను చెల్లించడం రైతులకు గుదిబండగా మారింది. ఆ బరువు తగ్గుతుందేమోనని రుణమాఫీ స్కీమ్ కోసం ఎదురుచూస్తున్నారు. గతంలో ప్రభుత్వం దశలవారీగా అమలు చేసినా వడ్డీల భారంతో రైతులు ఇబ్బందిపడ్డారు. ఈసారి ఒకేసారి మొత్తం రెండు లక్షల రుణాలను మాఫీ చేయడానికి జరుగుతున్న కసరత్తుతో రైతుల్లో విశ్వాసం పెరుగుతుండగా.. విపక్షాల్లో రాజకీయ కోణం నుంచి ఒకింత ఆందోళన మొదలైంది. వరుసగా అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఓడిపోయిన పరిస్థితుల్లో గ్రామ స్థాయి నుంచి పార్టీని పునర్నిర్మించుకునేందుకు బీఆర్ఎస్ ప్రయత్నాలు చేస్తున్నది. ఇదే సమయంలో రుణమాఫీ అమలైతే రైతులను దగ్గర చేసుకోడానికి అవకాశాలు కరువు అవుతాయని గులాబీ లీడర్లలో కలవరం మొదలైంది.

సవాళ్లు.. ప్రతి సవాళ్లు..

రుణమాఫీ ఒకే విడతలో సాధ్యం కాదన్నది బీఆర్ఎస్‌ అభిప్రాయం. దాన్ని దృష్టిలో పెట్టుకునే మాజీ మంత్రి హరీశ్‌రావు సవాలు విసిరారు. ఆరు గ్యారంటీలతోపాటు రుణమాఫీని పంద్రాగస్టుకల్లా అమలు చేస్తే ఎమ్మెల్యే సభ్యత్వానికి రాజీనామా చేస్తానని ఓపెన్‌గానే సీఎం రేవంత్‌రెడ్డికి చాలెంజ్ విసిరారు. లోక్‌సభ ఎన్నికల సమయంలో వీరిద్దరి మధ్య సవాళ్ల సంవాదం హాట్ టాపిక్‌గా నిలిచింది. ఇప్పుడు రుణమాఫీ అమలు కోసం ప్రభుత్వంలో జరుగుతున్న హడావుడితో ఒకే విడతలో అమలు సాధ్యం కాదనే అనుమానం ఉన్నప్పటికీ, అంచనాలకు భిన్నంగా సక్సెస్ అయితే బీఆర్ఎస్‌కు ఎదురయ్యే సవాళ్లే ఇప్పుడు ఆ పార్టీలో చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ వైఫల్యాలపై ఆధారపడి పార్టీని మళ్లీ ప్రజల్లోకి తీసుకెళ్లాలని ప్లాన్ వేసుకున్నా.. ఈ స్కీమ్ అమలు తర్వాత పరిస్థితి ఏంటనేది మింగుడు పడని అంశంగా మారింది. సరిగ్గా కాంగ్రెస్ కోరుకుంటున్నది కూడా ఇదే.

బీఆర్ఎస్‌ను మళ్లీ కోలుకోకుండా చేయడానికి అన్ని అస్త్రాలనూ ప్రయోగించాలని చూస్తున్నది. ఒకవైపు ఆపరేషన్ ఆకర్ష్, మరోవైపు రుణమాఫీ అమలుతో ఆ పార్టీ నేతల నోళ్లను మూయించాలని భావిస్తున్నది. గ్రామాల్లో ఆ పార్టీకి స్థానం లేకుండా చేయాలనుకుంటున్నది. బీఆర్ఎస్‌ను రాజకీయంగా సమాధి చేయాలని రెండు ఎన్నికల్లో కాంగ్రెస్ పెట్టుకున్న టార్గెట్ సాధించి ఇప్పుడు రానున్న నాలుగున్నరేళ్ల పాటు ఆ పార్టీకి ఉనికి కూడా లేకుండా చేయాలనే దీర్ఘకాలిక లక్ష్యాన్ని రూపొందించుకున్నది. రుణమాఫీ అమలు తర్వాత బీఆర్ఎస్ భవిష్యత్తు ఏంటనేది ఆ పార్టీలోనే కాక రాష్ట్ర రాజకీయాల్లోనే కీలక అంశంగా మారనున్నది. ఇప్పటికే సొంత పార్టీ కేడర్‌ను కాంగ్రెస్‌లోకి వెళ్లకుండా నివారించుకోవడంలో అనుకున్న ఫలితాలను సాధించలేని బీఆర్ఎస్ ఇక ప్రజల్లో పార్టీని ఎలా కాపాడుకుంటుందన్నది చర్చనీయాంశంగా మారింది.

Also Read: గత ప్రభుత్వ అప్పులు, వడ్డీల కోసం.. రోజుకు రూ. 191 కోట్ల పేమెంట్..


Similar News