వరంగల్‌లో దారుణం.. బాలికపై సీఐ అత్యాచారయత్నం
వరంగల్ పోలీస్ కమిషనరేట్(Warangal Police Commissionerate) పరిధిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. బాలికపై సీఐ రవికుమార్(CI Ravi Kumar) అత్యాచారయత్నం చేశారు.
దిశ, వెబ్‌డెస్క్/వరంగల్ బ్యూరో: ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఓ బాలికపై రవికుమార్ అనే సీఐ ర్యాంక్ అధికారి అత్యాచారయత్నానికి పాల్పడినట్లుగా ఆరోపిస్తూ బుధవారం కాజీపేట పీఎస్‌లో కేసు నమోదైంది. ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం.. హన్మకొండ పట్టణం వడ్డెపల్లి ప్రాంతంలోని ఓ అపార్ట్‌మెంట్‌లో పొరుగున ఉండే బాలికను ఇంట్లోకి పిలిచి అత్యాచారయత్నానికి పాల్పడగా బాలిక తప్పించుకుని వెళ్లి విషయం తల్లిదండ్రులకు తెలిపింది. తల్లిదండ్రులు వెంటనే కాజీపేట పోలీస్ స్టేషన్‌కు వెళ్లి సీఐ రవికుమార్‌పై ఫిర్యాదు చేయడంతో అధికారులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.
ప్రస్తుతం సీఐ పరారీలో ఉన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇదిలా ఉండగా వరంగల్ కమిషనరేట్ పరిధిలో పనిచేస్తున్న సీఐ రవికుమార్‌ను కమిషనర్ అంబర్ కిశోర్ ఝా కొద్దిరోజుల క్రితం ఐజీకి అటాచ్ చేసినట్లు సమాచారం. పోలీస్ అధికారి బాలికపై లైగింక దాడికి పాల్పడినట్లుగా ఆరోపణలతో కూడిన కేసు నమోదు కావడంతో సంచలనం సృష్టిచింది. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో పోలీసులపై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. సమాజంలో అత్యాచార ఘటనలు జరుగకుండా చర్యలు తీసుకోవాల్సిన పోలీసులే దారుణాలకు పాల్పడటం ఏంటని స్థానిక రాజకీయ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.