కాంగ్రెస్, రేవంత్‌పై BRS, బీజేపీ ఫేక్ ప్రచారం.. టీ కాంగ్రెస్ సంచలన ట్వీట్!
‘దిశ పేపర్’ పేరుతో సోషల్ మీడియాలో ఫేక్ క్లిప్పింగ్స్ చక్కర్లు కొడుతున్నాయి.
దిశ, డైనమిక్ బ్యూరో: ‘దిశ పేపర్’ పేరుతో సోషల్ మీడియాలో ఫేక్ క్లిప్పింగ్స్ చక్కర్లు కొడుతున్నాయి. దిశకు ఉన్న ప్రజాదరణ, ప్రచురించే వార్తలకు ఉన్న విశ్వసనీయతను అనుకూలంగా మల్చుకోడానికి ఉద్దేశపూర్వకంగా కొన్ని రాజకీయ శక్తులు క్లిప్పింగ్‌ను సామాజిక మాధ్యమాల్లో ప్రసారం చేస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా చంద్రబాబుతో రేవంత్ అర్ధరాత్రి భేటీ అయ్యారని, తెలంగాణ విలీన ప్రతిపాదనపై ఇద్దరి మధ్య కీలక చర్చ జరిగిందని పేపర్ క్లిప్పింగ్ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడంతో దిశ యాజమాన్యం సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది.
మరోవైపు ఈ ఫేక్ వార్తకు తమకు ఎలాంటి సంబంధం లేదని దిశ ఎడిటర్ స్పష్టంచేశారు. ఈ నేపథ్యంలోనే పేపర్ క్లిప్పింగ్‌పై టీ కాంగ్రెస్ పార్టీ ఇవాళ సోషల్ మీడియా వేదికగా స్పందించింది. కాంగ్రెస్ పార్టీపై, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై ఫేక్ ప్రచారం బీఆర్ఎస్, బీజేపీ చేస్తున్నాయని ఆరోపించింది. ఓటమి భయంతో ఇంత సిగ్గుమాలిన, నీతిలేని పనులు చేయడం వారి దిగజారుడు రాజకీయాలకు నిదర్శమని టీ కాంగ్రెస్ విమర్శిస్తూ ట్వీట్ చేసింది.