BREAKING: రేవంత్‌రెడ్డికి అజ్ఞానం, అహంకారం నెత్తికెక్కాయి: తెలంగాణ విఠల్ సెన్సేషనల్ కామెంట్స్
డీఎస్సీ, గ్రూప్స్ పరీక్షలు వాయిదా వేయబోమని, షెడ్యూల్ ప్రకారం యధావిధిగా పరీక్షలు నిర్వహించి తీరుతామని సీఎం రేవంత్‌రెడ్డి తాజాగా చేసిన వ్యాఖ్యలపై నిరుద్యోగులు భగ్గుమన్నారు.
దిశ, వెబ్‌డెస్క్: డీఎస్సీ, గ్రూప్స్ పరీక్షలు వాయిదా వేయబోమని, షెడ్యూల్ ప్రకారం యధావిధిగా పరీక్షలు నిర్వహించి తీరుతామని సీఎం రేవంత్‌రెడ్డి తాజాగా చేసిన వ్యాఖ్యలపై నిరుద్యోగులు భగ్గుమన్నారు. హైదరాబాద్ అశోక్‌నగర్‌లో నిరుద్యోగులు సీఎం డౌన్.. డౌన్ అంటూ నినాదాలు చేశారు. గ్రూప్-2, 3 పోస్టుల సంఖ్య పెంచడంతో పాటు, డీఎస్సీ పరీక్షలను వాయిదా వేయాలని డిమాండ్ చేశారు. అయితే, ఉద్యమకారుడు తెలంగాణ విఠల్ నిరుద్యోగుల నిరసనకు సంఘీభావం తెలిపేందుకు అక్కడి వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మాట్లడుతూ.. రేవంత్‌రెడ్డికి అజ్ఞానం, అహంకారం నెత్తికెక్కాయంటూ ఫైర్ అయ్యారు. ‘మార్పు రావాలి.. కాంగ్రెస్ రావాలి’ అన్న నినాదానికి 30 లక్షల నిరుద్యోగులు ఓట్లు వేసి రేవంత్‌ను సీఎం పీఠం మీద కూర్చోబెట్టారని తెలిపారు. ప్రజాపాలనలో నిరుద్యోగులు అర్ధరాత్రి నిరసన చేస్తుంటే వాళ్లు అడ్డా కూలీలు, కోచింగ్ సెంటర్ల మాఫీయా అంటూ వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. నిరసనకు నిరుద్యోగులు ఎవరూ డబ్బులిస్తే రాలేదని, తమ జీవితాలను తీర్చిదిద్దుకునేందుకే ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు స్వచ్ఛందంగా వచ్చారని అన్నారు. ఇకనైనా ముఖ్యమంత్రి అహంకారంకి పోకుండా నిరుద్యోగులతో చర్చలు జరిపి వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలని తెలంగాణ విఠల్ విజ్ఞప్తి చేశారు.