DHARANI: తెల్లారేసరికి రికార్డులు తారుమారు.. వేలాది ఎకరాల భూమి ప్రైవేటుపరం
ధరణి(Dharani) వచ్చినప్పటి నుంచి లెక్కలేనన్ని అక్రమాలు చోటుచేసుకున్నాయి. ధరణిని అడ్డుపెట్టుకొని పలువురు ఆఫీసర్లు తెల్లారేసరికల్లా రికార్డులు మార్చారు.
దిశ, తెలంగాణ బ్యూరో: ధరణి(Dharani) వచ్చినప్పటి నుంచి లెక్కలేనన్ని అక్రమాలు చోటుచేసుకున్నాయి. ధరణిని అడ్డుపెట్టుకొని పలువురు ఆఫీసర్లు తెల్లారేసరికల్లా రికార్డులు మార్చారు. అదేస్థాయిలో భూములూ చేతులు మారాయి. రూ.వేల కోట్ల లావాదేవీలు జరిగాయి. వేలాది ఎకరాల భూమి ప్రైవేటుపరం అయింది. 2018కి ముందు, తర్వాత పరిశీలిస్తే ప్రభుత్వ భూముల లెక్క తేటతెల్లమవుతున్నది. ప్రధానంగా రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల కలెక్టర్(Medchal Collector)గా పనిచేసిన ఐఏఎస్ అధికారి అమోయ్ కుమార్(Amoy Kumar IAS) ఆగడాలపై 10 నెలలుగా వరుసగా కథనాలు వెలువడ్డాయి. ఈ క్రమంలోనే మూడు రోజులపాటు ఈడీ విచారణ కూడా జరగడం అత్యంత ప్రాధాన్యత అంశంగా మారింది.
రెండు జిల్లాల్లోనూ ఆయన హయాంలో వందలాది ఎకరాల ప్రభుత్వ భూములు ప్రైవేటుపరం అయ్యాయన్న ఆరోపణలు ఉన్నాయి. వక్ఫ్, ఎండోమెంట్, భూదాన్ భూముల్లోనూ అక్రమాలు జరగడం.. వీటిపైనే ఈడీ సుదీర్ఘంగా విచారించడం జరిగిందని సమాచారం. అయితే.. గండిపేట, శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్, శంషాబాద్, మహేశ్వరం, కందుకూరు, బాలాపూర్, ఇబ్రహీంపట్నం, మంచాల మండలాల్లో కింది నుంచి రిజెక్ట్ చేస్తూ సమర్పించిన ఫైళ్లను ఐఏఎస్ అమోయ్ కుమార్ ఆమోదించడం వెనుక ఆంతర్యమేమిటన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఒకవేళ తహశీల్దార్లు, ఆర్డీవోలు కూడా ఆమోదించి ఉంటే ఆయనతోపాటు వీరంతా విచారణను ఎదుర్కోవాల్సి వచ్చేది. కానీ.. వారి ప్రమేయం లేకుండానే అమోయ్ కుమార్ భూదందాలో ఏక్ నిరంజన్‌గా మారి క్లియరెన్స్ ఇచ్చినట్లుగా రెవెన్యూ వర్గాల్లో ప్రచారం జరుగుతున్నది.
ఆ అధికారులంతా సేఫ్
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే ఈ ఫైల్స్ అన్నీ చకచకా కదిలినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. రంగారెడ్డి జిల్లాలోని ఓ మండలంలో దరఖాస్తు పెట్టుకున్న బడా బాబుకు సంబంధించి ఒక్క రోజులోనే ఫైల్ క్లియర్ అయిన ఉదంతాలు ఉన్నాయి. అప్లై చేయడమే తరువాయి.. ఇలా ఆమోదిస్తూ రికార్డులు మారిన ఉదాహరణలు ఉన్నాయి. సామాన్యుల ఫైళ్లు మూడేండ్లు తిరిగినా కలెక్టర్ పరిశీలనలోనే ఉందని చూపించడం ఆనవాయితీ. కానీ.. అదే మండలంలో కొందరు అప్లై చేసి 24 గంటలు కూడా గడవక ముందే క్లియర్ చేయడం గమనార్హం. ధరణి పోర్టల్‌లో తహశీల్దార్, ఆర్డీవో, అదనపు కలెక్టర్ క్లియర్ చేస్తేనే కలెక్టర్ ఎన్వోసీ ఇవ్వాలన్న రూల్ ఏమీ లేదు. అందుకే నామ్ కే వాస్తే రిపోర్టులతోనే కలెక్టర్ ఎన్వోసీలు, పీవోబీ క్లియరెన్స్‌లు ఇచ్చారన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దీంతో అమోయ్ కుమార్ హయాంలో పనిచేసిన తహశీల్దార్లు, ఆర్డీవోలు, అదనపు కలెక్టర్లు సేఫ్‌గా ఉన్నారని తెలుస్తున్నది.
సీసీఎల్ఏ బ్రేక్ వేసినా.. క్లియరెన్స్!
రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం ఖాజాగూడ సర్వే నం.27లోని ప్రభుత్వ భూమిపై బడా బాబుల కన్ను పడింది. అధికారులంతా ఎన్నికల బిజీగా ఉన్న సమయంలోనే హస్తగతం చేసుకునేలా వ్యూహరచన చేశారు. చుట్టూ ప్రహరీ నిర్మించి తమ స్వాధీనంలో ఉందని చూపించే ప్రయత్నాలు చేశారు. దీనికి క్లియరెన్స్ కోసం కలెక్టర్ అమోయ్ కుమార్ జీహెచ్ఎంసీకి లేఖ రాశారు. లేఖ నం.ఇ1/2970/2022, తేదీ.23.01.2023లో బేవర్లీ హిల్స్ ఓనర్స్ వెల్ఫేర్ సొసైటీ, ఐటీ కంపెనీ పేరిట ఎం/ఎస్ సోహిణి బిల్డర్స్ ఎల్ఎల్పీ వంటి కంపెనీ పేర్లను ప్రస్తావించారు. దీని ప్రకారం సర్వే నం.27/2లోని 27.18 ఎకరాల్లో భవన నిర్మాణ అనుమతులు జారీ చేసేందుకు ఎలాంటి అభ్యంతరం లేదని పేర్కొన్నారు. కానీ.. సీసీఎల్ఏ మాత్రం ఫైల్స్‌ని పరిశీలించి క్రయవిక్రయాలు చేపట్టరాదని స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖను అప్రమత్తం చేసింది. ఈ మేరకు సీసీఎల్ఏ నవీన్ మిట్టల్ ఈ కేసులో ప్రొసిడింగ్స్ నం.ఎస్ఈటీటీ.2/211/2023, తేదీ.5.8.2023 జారీ చేశారు. సర్వే నం.27/2లోని 27.18 ఎకరాలపై ఈ మేరకు ఆదేశాలు జారీ అయ్యాయి. సదరు ల్యాండ్‌ను పోరంబోకుదంటూ తేల్చారు. దీంతో అమోయ్ కుమార్ తీసుకున్న నిర్ణయానికి బ్రేకులు పడ్డాయి. ఆ తరువాత ఎవరి ఒత్తిడి మేరకు ఆయన రూ.2వేల కోట్ల విలువైన భూమిని పట్టాగా మార్చారు..? అనేది క్లారిటీ లేదు. మొత్తానికి ఇటీవల ఈ భూమికి క్లియరెన్స్ ఇచ్చినట్లుగా తెలిసింది.
స్టడీ చేయకుండానే..
రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం గంధంగూడ సర్వే నం.51లో 9.36 ఎకరాల భూమిపై కలెక్టర్ అమోయ్ కుమార్ తీసుకున్న నిర్ణయం వివాదాస్పదంగా మారింది. అంతకుముందు పనిచేసిన రఘునందన్ రావు వంటి సీనియర్ ఐఏఎస్ అధికారులు ఎందుకు తిరస్కరించారని కూడా స్టడీ చేయకుండానే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. గండిపేట తహశీల్దార్ పంపిన రిపోర్టు మేరకు ట్రిబ్యునల్ ఆర్డర్ అంటూ జారీ చేసి ధారాదత్తం చేశారు. అలాగే.. గంధంగూడ సర్వే నం.51లోని 9.36 ఎకరాలు మొన్నటి వరకు ప్రొహిబిటెడ్ రిజిస్టర్‌లో ఉండేది. ఇప్పుడది పట్టాగా మార్చేశారు. దీని విలువ రూ.200 కోట్ల పైమాటే. కలెక్టర్ అమోయ్ కుమార్ ఆర్డర్ కాపీలో గంధంగూడ ఒరిజినల్ సేత్వార్, ఖాస్రా పహానీ అందుబాటులో లేదని పేర్కొనడం గమనార్హం. ముంతకాబ్ రికార్డులు ఉన్నాయంటూ ఫైల్ క్లియర్ చేశారు. చెస్లా పహానీలో పట్టాదారు కాలంలో కంచె అని నమోదైందని, అయితే అది సర్కారుదేనని రుజువు చేయడానికి ఎలాంటి ఆధారాలు లేవని కలెక్టర్ పేర్కొన్నారు. అందుకే ఈ భూమిని ప్రైవేటు పట్టాగా మారుస్తున్నట్లు స్పెషల్ ట్రిబ్యునల్ ద్వారా ఆదేశాలు జారీ చేశారు.
సీలింగ్.. అయితేనేం?
రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లిలో హైటెక్ సిటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, హైరైజ్డ్ ప్రాజెక్టుల చెంతనే మిగిలిన సీలింగ్ సర్ ప్లస్ ల్యాండ్‌కి భారీ స్కెచ్ వేశారు. గుట్టల బేగంపేట సర్వే నం.60/1లో 50,395 చ.మీ.(60271 చ.గ. అంటే 12 ఎకరాల పైమాటే!)లో ఇప్పుడు ఖాళీగా ఉన్నది 15118 చ.మీ.(18080 చ.గ. అంటే సుమారు 3.30 ఎకరాలు) మాత్రమే. గజం విలువ రూ.2 లక్షల పైమాటే. అంటే ఈ ఖాళీ జాగ విలువ అక్షరాల 360 కోట్లకు పైగానే. దానిని సైతం ప్రైవేటీకరించేందుకు చూశారు. జిల్లా స్థాయిలోనే ఈ వ్యవహారాన్ని చక్కదిద్దారు. ఆ స్థలం విస్తీర్ణం పెద్దదిగా ఉండడం.. హైరైజ్డ్ ప్రాజెక్టు చేపట్టేందుకు అనువుగా ఉండడంతో రూ.1000 కోట్లకు పైగా విలువ జేసే ప్రాజెక్టును చేపట్టేందుకు కొన్ని డెవలపర్స్ వ్యూహరచన చేస్తున్నాయి. అందుకే ఈ సీలింగ్ ల్యాండ్‌ని చేజిక్కించుకునేందుకు అధికారుల చుట్టూ తిరిగారు. గతంలో పనిచేసిన అధికారులంతా దీనిని రిజెక్ట్ చేశారు. ఇప్పుడేమో ఆ డాక్యుమెంట్లను అధికారులు విశ్వసిస్తుండడం పలు అనుమానాలకు దారితీస్తున్నది. ఫేక్ డాక్యుమెంట్లా? ఒరిజినల్ డాక్యుమెంట్లా? అన్న ప్రశ్నకు అధికారుల నుంచి సమాధానం రావడం లేదు.