ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియడం లేదు.. హైడ్రాపై ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు
తెలంగాణ ప్రభుత్వం ప్రాతిష్టాత్మకంగా తీసుకొచ్చిన హైడ్రాపై బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ తీవ్ర విమర్శలు చేశారు.
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ప్రభుత్వం ప్రాతిష్టాత్మకంగా తీసుకొచ్చిన హైడ్రా(Hydra)పై బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్(Etela Rajender) తీవ్ర విమర్శలు చేశారు. శనివారం ఎంపీ డీకే అరుణతో కలిసి బోడుప్పల్‌లోని వక్ఫ్ స్థలాలను ఎంపీ ఈటల రాజేందర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. హైడ్రా దెబ్బకు బ్యాంకులు ఎవరికీ రుణాలు ఇవ్వట్లేదని అన్నారు. అసలు పేదవారు లోన్ తీసుకోకుండా ఇళ్ళు కట్టుకునే అవకాశం ఉందా? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. హైడ్రా పిచ్చోని చేతిలో రాయిలా మారిందని మండిపడ్డారు. హైడ్రా వచ్చిన నాటి నుంచి ఎప్పుడు ఏమవుతుందోనని భయపడుతున్నారని అన్నారు.
హైదరాబాద్‌లో ఉన్న భూముల సమస్యలపై వెంటనే అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ గ్లోబల్ సిటీ, దాని బ్రాండ్ ఇమేజ్‌ను దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. వ్యాపారం, రిజిస్ట్రేషన్లు అన్నీ పడిపోయాయని గుర్తుచేశారు. ఇదిలా ఉండగా.. హైదరాబాద్ నగరంలో చెరువుల పరిరక్షణే లక్ష్యంగా హైడ్రా దూసుకెళ్తోంది. చెరువులు, నాలాల కబ్జాలపై ఫోకస్ చేసిన హైడ్రా.. ఆక్రమణలను తొలగిస్తోంది. ఇప్పటివరకు 23 ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేసింది. దాదాపు 262 అక్రమ నిర్మాణాలను కూల్చేసింది. తద్వారా 117 ఎకరాలకుపైగా భూమిని స్వాధీనం చేసుకుంది.