స్పీడ్ పెంచిన కాషాయ పార్టీ.. లోకల్ ఎన్నికల కోసం కసరత్తు షురూ

భవిష్యత్ ఎన్నికలపై బీజేపీ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకుంటోంది. ఎన్నికల కసరత్తును ముమ్మరం చేసింది.

Update: 2024-10-26 02:20 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: భవిష్యత్ ఎన్నికలపై బీజేపీ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకుంటోంది. ఎన్నికల కసరత్తును ముమ్మరం చేసింది. ఇప్పటి నుంచే వ్యూహరచనకు పదును పెట్టింది. ఈ నేపథ్యంలో ఇతర పార్టీలతో పోలిస్తే కాషాయ పార్టీ స్పీడ్ పెంచింది. తెలంగాణలో త్వరలో లోకల్ బాడీ ఎలక్షన్స్ జరగనున్నాయి. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగే అవకాశాలు ఉన్నాయి. అందుకే కమలనాథులు ఇప్పటి నుంచే అలర్ట్ అవువుతున్నారు. ప్రభుత్వానికి చెక్ పెట్టాలని వ్యూహ రచన చేస్తున్నారు. అందుకోసం ప్రత్యేకంగా కమిటీలను బీజేపీ సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. ఎమ్మెల్సీ ఎన్నికలకు త్వరలో అభ్యర్థులను ప్రకటించాలని బీజేపీ భావిస్తోంది.

రాష్ట్ర లీడర్లకు బన్సల్ దిశా నిర్దేశం

తెలంగాణలో పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయాలని బీజేపీ అనుకుంటోంది. అందులోభాగంగానే సభ్యత్వ నమోదును చేపడుతోంది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న పలు నిర్ణయాలు తమకు కలిసొస్తాయని, వాటితో పాటు ఈ సభ్యత్వ నమోదు అంశం సైతం తమకు ప్లస్ అవుతుందని కాషాయ పార్టీ భావిస్తోంది. తెలంగాణలో త్వరలో ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్, కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. అలాగే ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్, కరీంనగర్ జిల్లాల్లో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ సైతం జరగనుంది. వాటితో పాటు ఉమ్మడి నల్లగొండ, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ జరగనుంది. ఈ ఎన్నికలకు పార్టీ ఇప్పటి నుంచే ముందుకెళ్తోంది. ఇప్పటికే సునిల్ బన్సల్ పార్టీ రాష్ట్ర లీడర్లకు సైతం ఈ అంశాలపై దిశానిర్దేశం చేశారు. సంసిద్ధంగా ఉండాలని సూచించారు.

అభ్యర్థులపై అభిప్రాయ సేకరణకు ముగ్గురితో కమిటీ!

ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై బీజేపీ ఇప్పటికే కసరత్తు ముమ్మరం చేసింది. అభ్యర్థులపై అభిప్రాయ సేకరణకు ముగ్గురితో కమిటీని ఏర్పాటు చేసినట్టు సమాచారం. ఈ కమిటీలో మాజీ ఎమ్మెల్యేలు చింతల రామచంద్రారెడ్డి, ప్రేమ్ సింగ్ రాథోడ్, మరో నేత ప్రేమ్ రాజ్ యాదవ్ ఉన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్న ప్రాంతాల జిల్లాల అధ్యక్షులు, ముఖ్య నేతలతో ఈ కమిటీ సమావేశమైనట్టు తెలిసింది. వచ్చిన దరఖాస్తులను పరిశీలించి ఆయా జిల్లా లీడర్ల అభిప్రాయాలు తీసుకొని పార్టీ నాయకత్వానికి రిపోర్ట్ ఇవ్వనున్నట్టు సమాచారం. కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానంలో ప్రముఖ విద్యాసంస్థల యజమానిని రంగంలోకి దింపే ఆలోచనలో బీజేపీ ఉన్నట్టు తెలుస్తోంది.

రాష్ట్రంలో త్వరలో జరగబోయే ఎన్నికల కోసం బీజేపీ పలు కమిటీలను నియమించినట్టు విశ్వసనీయ సమాచారం. అందులో ఎమ్మెల్సీ ఎన్నికల కమిటీ, ఆందోళన కార్యక్రమాల కమిటీ, స్థానిక సంస్థల ఎన్నికల కమిటీలు ఉన్నట్టు తెలిసింది. బీజేపీ ఇతర కమిటీల్లో ఎంపీలు, ఎమ్మెల్యేలు, మాజీ ప్రజాప్రతినిధులను నియమించారు. అయితే ఈ కమిటీలను పార్టీ ఇప్పటి వరకు అధికారికంగా ప్రకటించలేదు. దీనిపై స్పష్టత రావాల్సి ఉంది.

కమిటీలు ఇవే..

  • ఎమ్మెల్సీ ఎన్నికల కమిటీ
  • ధర్మపురి అర్వింద్(ఎంపీ)
  • పాల్వాయి హరీశ్‌బాబు(ఎమ్మెల్యే)
  • ఏవీఎన్ రెడ్డి(ఎమ్మెల్సీ)
  • ఎన్.రామచందర్‌రావు(మాజీ ఎమ్మెల్సీ)
  • దుగ్యాల ప్రదీప్ కుమార్, కాసం వెంకటేశ్వర్లు(పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు)

ఆందోళన కార్యక్రమాల కమిటీ

  • ఏలేటి మహేశ్వర్‌రెడ్డి(బీజేఎల్పీ నేత)
  • డీకే అరుణ(ఎంపీ)
  • గోడెం నగేశ్(ఎంపీ)
  • సూర్యనారాయణ గుప్త(ఎమ్మెల్యే)
  • వెంకటేశ్ నేతకాని(మాజీ ఎంపీ)
  • సైదిరెడ్డి(మాజీ ఎమ్మెల్యే)
  • ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ (మాజీ ఎమ్మెల్యే)
  • ప్రేమేందర్‌రెడ్డి(పార్టీ ప్రధాన కార్యదర్శి)
  • భరత్ (రాష్ట్ర నాయకుడు)

స్థానిక సంస్థల ఎన్నికల కమిటీ

  • ఈటల రాజేందర్(ఎంపీ)
  • కొండా విశ్వేశ్వర్‌రెడ్డి(ఎంపీ)
  • కాటిపల్లి వెంకట రమణారెడ్డి(ఎమ్మెల్యే)
  • పైడి రాకేశ్‌రెడ్డి(ఎమ్మెల్యే)
  • చింతల రామచంద్రారెడ్డి(మాజీ ఎమ్మెల్యే)
  • బూర నర్సయ్య గౌడ్(మాజీ ఎంపీ)
  • అరూరి రమేశ్(మాజీ ఎమ్మెల్యే)
  • వినోద్‌రావు(ఎమ్మెల్యే అభ్యర్థి)
  • బంగారు శృతి(పార్టీ ప్రధాన కార్యదర్శి)

Similar News