అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్‌గా ప్రతీ పార్లమెంటు సెగ్మెంట్‌కు బీజేపీ ఎక్స్ పర్ట్ టీమ్
రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ వైఫల్యాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్ళడానికి, కేంద్ర ప్రభుత్వ పథకాలను వివరించడానికి ప్రతీ పార్లమెంటు సెగ్మెంట్‌కు ఒక నిపుణుల కమిటీని నియమించడానికి బీజేపీ సిద్ధమవుతున్నది.
దిశ, తెలంగాణ బ్యూరో : రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ వైఫల్యాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్ళడానికి, కేంద్ర ప్రభుత్వ పథకాలను వివరించడానికి ప్రతీ పార్లమెంటు సెగ్మెంట్‌కు ఒక నిపుణుల కమిటీని నియమించడానికి బీజేపీ సిద్ధమవుతున్నది. ఈ ప్లాన్ గురించి రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి సునీల్ బన్సల్ హైదరాబాద్ పార్టీ కార్యాలయంలో మంగళవారం రాత్రి రాష్ట్ర నేతలతో సమావేశమై వివరాలను వెల్లడించారు. ఒక్కో కమిటీలో 15 మంది సీనియర్ నేతలు ఉంటారని, ఇందులో కేంద్ర మంత్రులు, పార్టీ అగ్ర నాయకులు కూడా ఉంటారని తెలిపారు.
కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించడానికి జిల్లా కేంద్రం మొదలు మండల స్థాయి వరకు తీసుకెళ్తారని తెలిపారు. కేంద్రం నుంచి తెలంగాణకు ఏయే పథకాలు వస్తున్నాయో, అందుకు కేంద్రం నుంచి విడుదలవుతున్న నిధులెన్నో, వాటిని రాష్ట్ర ప్రభుత్వం తన సొంత పథకాలకు ఎలా మళ్ళిస్తున్నదో ప్రజలకు అర్థమయ్యే తీరులో చెప్పడమే నిపుణుల కమిటీ ప్రధాన కర్తవ్యమన్నారు.
అసెంబ్లీ ఎన్నికల్లో పవర్‌లోకి రావడంతో పాటు పార్లమెంటు ఎన్నికల్లో వీలైనన్ని ఎక్కువ స్థానాలు గెల్చుకోవడం లక్ష్యంగా దీర్ఘకాలిక వ్యూహానికి పదును పెడుతున్నట్లు ఆయన తెలిపారు. రాష్ట్ర పార్టీ నేతలతో జరిగిన సమావేశంలో భవిష్యత్తు వ్యూహాన్ని వివరించి నిర్దిష్ట కార్యాచరణపై దిశానిర్దేశం చేశారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఈ నెల 23న రాష్ట్రానికి వస్తున్నారని, ఆ రోజు చేవెళ్ల లో జరిగే బహిరంగ సభను విజయవంతం చేసేందుకు నేతలకు వర్క్ డివిజన్ చేశారు.
తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం తరఫున వివిధ పథకాల కింద వస్తున్న నిధులు, వాటి వినియోగం, రాష్ట్రంలోని స్కీమ్‌లకు ఖర్చు చేస్తున్న నిధులు తదితరాలన్నింటినీ వివరించడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంపై పోకస్ పెట్టాలని ఆయన సూచించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని నొక్కిచెప్పారు. కేంద్రం నుంచి మంత్రులు, పార్టీ సీనియర్ నేతలు, అగ్ర నాయకులు కూడా రాష్ట్రంలో ఇకపైన విస్తృతంగా పర్యటిస్తారని తెలిపారు.