BIG News: బీసీ రిజర్వేషన్లపై ఉత్కంఠ.. ఇంకా ప్రారంభం కాని ఇంటింటి సర్వే

స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయి?

Update: 2024-08-31 02:27 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయి?.. బీసీ రిజర్వేషన్ ఎలా ఫైనల్ అవుతుంది?.. ఇప్పటివరకు ఇంటింటి సర్వే చేయకపోవడంతో మరింత ఆలస్యమవుతుందా?.. కొత్త బీసీ కమిషన్ వచ్చినా అవగాహనకు టైమ్ పడుతుందా?... ఇలాంటి అనేక సందేహాలే ఇప్పుడు అందరిలోనూ వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే గ్రామ పంచాయతీల పాలన గడువు ముగిసి ఏడు నెలలు కావస్తున్నది. ప్రస్తుతం పర్సన్ ఇన్‌చార్జి పాలన సాగుతున్నది. పాలకమండళ్లు లేకపోవడంతో కేంద్ర ఫైనాన్స్ కమిషన్ నుంచి గ్రాంట్ల విడుదల ఆగిపోయింది. మాజీ సర్పంచులకు ప్రభుత్వం నుంచి పెండింగ్ బిల్లుల పేమెంట్స్ సైతం నిలిచిపోయాయి. వీలైనంత తొందరగా స్థానిక సంస్థల ఎన్నికలు కంప్లీట్ చేయాలని భావించిన సీఎం రేవంత్.. నెల రోజుల క్రితమే సుదీర్ఘ రివ్యూ నిర్వహించారు. కానీ ఇప్పటికీ బీసీ రిజర్వేషన్ ఖరారు కాకపోవడంతో ఏ ఫార్ములాను ప్రభుత్వం అమలు చేస్తుందన్న సందేహం నెలకొన్నది.

నేటితో పూర్తి ముగియనున్న పదవీ కాలం

బీసీ రిజర్వేషన్ ఫార్ములాను ఫైనల్ చేయాల్సిన స్టేట్ బీసీ కమిషన్ పదవీకాలం నేటితో పూర్తి కానున్నది. చైర్మన్, సభ్యుల పదవీకాలాన్ని పొడిగించేందుకు లేదా వారినే కంటిన్యూ చేసేందుకు ప్రభుత్వం సుముఖంగా లేదన్న వార్తలు వినిపిస్తున్నాయి. కొత్త కమిషన్‌ను ఆగస్టు 31లోగా ప్రకటించేందుకు సర్కార్ సన్నాహాలు చేస్తున్నది. కేంద్ర ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన లేటెస్ట్ ఓటర్ల జాబితాను ఆధారంగా చేసుకుని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ ఇంటింటి సర్వే చేసి బీసీ ఓటర్లు, జనాభాను నిర్ధారించాల్సి ఉన్నది. దీనికి తోడు గ్రామాల్లో రాజకీయ వెనకబాటుతనంపై బీసీ కమిషన్ అన్ని జిల్లాల్లోనూ అధ్యయనం చేసి నివేదిక రూపొందించాల్సి ఉన్నది. ఈ ప్రక్రియలేవీ ఇంకా షురూ కాలేదు. కొత్త బీసీ కమిషన్ కొలువుదీరిన తర్వాతే ఈ ప్రాసెస్ ముందుకు వెళ్లే చాన్స్ ఉన్నది.

అధ్యయనం, ఫార్ములా ఖరారుకు రెండు నెలల సమయం

మూడేండ్లుగా పని చేసిన బీసీ కమిషన్ వివిధ రాష్ట్రాల్లో పర్యటించి అక్కడ అమలవుతున్న రిజర్వేషన్ ఫార్ములాపై అధ్యయనం చేసింది. కానీ గడువు ముగిసిపోవడంతో కొత్త కమిషన్ ఈ అంశాలను అవగాహన చేసుకుని పని మొదలు పెట్టేందుకు సమయం పట్టే అవకాశం ఉన్నది. పంచాయతీరాజ్ శాఖ ఇంటింటి సర్వే, బీసీ జనాభా/ఓటర్ల వివరాల సేకరణ, బీసీల రాజకీయ వెనకబాటుతనంపై కమిషన్ జిల్లాల అధ్యయనం, రిజర్వేషన్ ఫార్ములా ఖరారు.. వీటన్నింటికీ కనీసంగా రెండు నెలలకు పైగానే సమయం పట్టొచ్చని అంచనా. ఇదే సమయంలో ఎన్నికలు నిర్వహించేందుకు స్టేట్ ఎలక్షన్ కమిషన్ ప్రక్రియను మొదలు పెట్టింది. సెప్టెంబర్ 6న ముసాయిదా ఓటర్ల జాబితాను విడుదల చేసి అదే నెల 21 ఫైనల్ ఓటరు లిస్టును ప్రకటించడానికి సమాయత్తం అవుతున్నది.

కర్తవ్యంగా రిజర్వేషన్ల ప్రక్రియ

ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు 50% దాటొద్దని సుప్రీంకోర్టు తాజాగా స్పష్టత ఇచ్చింది. గ్రామాల్లో బీసీల రాజకీయ వెనకబాటుతనంపై అధ్యయనం చేసి రిజర్వేషన్‌ను ఫైనల్ చేయాలనీ నిర్దేశించింది. గత ఎన్నికల సమయంలో అమలు చేసిన ఫార్ములాను రిపీట్ చేయడంపైనా ఆంక్షలు విధించింది. దీంతో బీసీ రిజర్వేషన్లను ఫిక్స్ చేయడం కొత్త కమిషన్‌కు తప్పనిసరి కర్తవ్యంగా మారింది. ఇంకోవైపు రాష్ట్ర వ్యాప్తంగా కులగణన చేపట్టేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినా ఆ ప్రక్రియ మొదలు కాలేదు. గతంలో కర్ణాటక, బిహార్ తదితర రాష్ట్రాల్లో జరిగిన సర్వేపై కమిషన్ అధ్యయనం చేసినా దాని పదవీకాలం ముగియడంతో కొత్త కమిషన్ చైర్మన్, సభ్యులు లోతుగా స్టడీ చేయడం అనివార్యంగా మారింది.

ప్రభుత్వానికి సవాలుగా 42శాతం అమలు

బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్ కల్పిస్తామని అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ హామీనిచ్చింది. ఎస్సీ, ఎస్టీలకు ఎలాగూ 22% అమలు చేయాల్సి ఉన్నందున సుప్రీంకోర్టు గైడ్‌లైన్స్ ప్రకారం 50%లో బీసీలకు మిగిలేది 28% మాత్రమే. గత ఎన్నికల్లో 34% అమలు చేసినా అది ఆ ఒక్క ఎన్నికలకు మాత్రమే సుప్రీంకోర్టు పరిమితం చేసింది. హామీ ఇచ్చినట్లుగా 42% అమలు చేయడం కాంగ్రెస్‌కు సవాలుగా మారింది. జనరల్ కోటాలోనూ బీసీలకు మిగిలిన 14% రిజర్వేషన్‌ ఇచ్చి హామీని నిలబెట్టుకున్నట్లుగా ప్రకటిస్తుందేమో అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.


Similar News