BIG News: అన్నదాతలకు భారీ గుడ్‌న్యూస్.. రెండు రోజుల్లో రుణమాఫీ గైడ్‌లైన్స్

‘ఒకటి, రెండు రోజుల్లోనే రుణమాఫీకి గైడ్ లైన్స్ రిలీజ్ చేస్తాం. ఆగస్టు చివరికల్లా రైతురుణ మాఫీ పూర్తి చేస్తాం. రూ.31వేల కోట్ల కంటే ఎక్కువవుతుంది.

Update: 2024-07-10 02:54 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: ‘ఒకటి, రెండు రోజుల్లోనే రుణమాఫీకి గైడ్ లైన్స్ రిలీజ్ చేస్తాం. ఆగస్టు చివరికల్లా రైతురుణ మాఫీ పూర్తి చేస్తాం. రూ.31వేల కోట్ల కంటే ఎక్కువవుతుంది. కడుపు గట్టుకొని నిధులను సమీకరిస్తున్నాం. ఇప్పటికే రూ.9 వేల కోట్లు వ్యవసాయ శాఖకు ఇచ్చాం. మిగతా నిధులు కూడా పలు వనరుల ద్వారా సేకరిస్తున్నాం. ఎన్ని ఎకరాల వరకు ఇవ్వాలన్నది తేల్చేందుకు రైతులు, రైతు సంఘాలు, మేధావుల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకుంటున్నాం. నేడు ఖమ్మం నుంచే రైతు సమావేశాల నిర్వహణ ద్వారా అభిప్రాయ సేకరణకు శ్రీకారం చుడుతున్నాం.

ఈ పథకం ఉద్దేశమే పెట్టుబడి సాయం. అలాంటప్పుడు పెద్దోళ్లకు ఎందుకు ఇవ్వాలి? వ్యవసాయం చేయని వారికి ఎందుకు ఇవ్వాలి? సన్న చిన్నకారు రైతుల వరకే అవసరమని నా వ్యక్తిగత అభిప్రాయం. అందుకే నేను, నా కుటుంబం రైతుబంధు సాయం తీసుకోవడం లేదు. చెక్కులు వాపస్ చేశాం. రైతు భరోసా ఇచ్చేందుకు కూడా ఏర్పాట్లు చేస్తున్నాం’ అని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం సచివాలయంలోని తన చాంబర్‌లో మీడియాతో చిట్‌చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలను మీడియాతో పంచుకున్నారు. ప్రధానంగా రైతుబంధు, రైతుభరోసా, ధరణి పోర్టల్, కొత్త ఆర్వోఆర్ చట్టం, ఇందిరమ్మ ఇండ్లు వంటి వాటిపై మాట్లాడారు.

రైతుబంధు దుర్వినియోగం

గత ప్రభుత్వం వివిధ ప్రాజెక్టులకు, ప్రజాప్రయోజనాల కోసం సేకరించిన భూములకు, నేషనల్ హైవేకు కూడా రైతుబంధు ఇచ్చారని మంత్రి పొంగులేటి అభిప్రాయపడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా 5 లక్షల ఎకరాలకు పైగా నాన్ అగ్రికల్చర్ ల్యాండ్‌కి రైతుబంధు సాయం అందించారని పేర్కొన్నారు. ఐదేండ్లల్లో రూ.వేల కోట్లు రైతుబంధు పేరిట దుర్వినియోగమైందని తెలిపారు. జలయజ్ఞం మొదలుకొని అనేక ప్రాజెక్టుల కోసం సేకరించిన భూములకు కూడా పాసు పుస్తకాలు ఇచ్చారని.. వాటన్నింటినీ గుర్తించామని వెల్లడించారు.

6 నెలల్లో ఎంతో పురోగతి

హైదరాబాద్‌లో ఈ ఆర్నెళ్లలో కమర్షియల్ స్పేస్ డిమాండ్ పెరిగిందని, తాము చేపట్టిన కార్యక్రమాల వల్లే ఇదంతా జరిగిందని మంత్రి శ్రీనివాసరెడ్డి చెప్పారు. రెసిడెన్షియల్, ఇండస్ట్రియల్ గ్రోత్ కూడా తప్పకుండా వస్తుందని, రీజినల్ రింగ్ రోడ్డు, రేడియల్ రోడ్లు వంటివి చేపడుతున్నామని, వీటి ద్వారా పెట్టుబడులు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. రూ.683 కోట్లతో అమ్మ ఆదర్శ స్కూళ్లను డెవలప్ చేశామని, అనేక కార్యక్రమాలు చేపట్టినా తాము చెప్పుకోలేకపోయామని అన్నారు. వాస్తవాలను ప్రజల ముందు ఉంచడంలో తాము వెనుకబడినట్లు చెప్పారు.

అప్పులన్నీ మీద పడ్డాయి..

కౌలు రైతుల గుర్తింపులో సమస్యలు ఉన్నాయని, అందుకే నిపుణులు, సంఘాలతో సమావేశాలు ఏర్పాటు చేస్తున్నామని మంత్రి తెలిపారు. ఉమ్మడి జిల్లాల వారీగా ఈ సమావేశాలు ఉంటాయన్నారు. నిధుల సమస్య తీవ్రంగా ఉన్నప్పటికీ సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నామని, గత ప్రభుత్వం రూ.6.82 లక్షల కోట్ల అప్పు చేసిందని, వడ్డీ, ఈఎంఐలు కట్టే బాధ్యత తమపై పడిందని చెప్పుకొచ్చారు. ‘అప్పు తండ్రి చేసిండు. తీర్చే బాధ్యత నుంచి కొడుకు తప్పుకోలేడు కదా’ అని అన్నారు. క్రెడిబిలిటీని కాపాడుకోకపోతే తిరిగి అప్పు పుట్టే పరిస్థితి ఉండదని పేర్కొన్నారు. వివిధ శాఖల్లో అనేక ప్రాజెక్టులు మిడిల్‌లో ఉన్నాయని, ప్రేస్టేజ్‌కి పోయి వాటిని మధ్యలోనే వదిలేయలేమని, అన్ని డిపార్టుమెంట్లలోనూ ఇవి ఉన్నాయని తెలిపారు. వాటన్నింటినీ పూర్తి చేసేందుకే ప్రయత్నిస్తున్నామని చెప్పారు. రెవెన్యూ రీ జనరేట్ చేసేది వ్యవసాయం, పరిశ్రమలే అని, వాటి కోసం ఖర్చు చేయకతప్పదని పేర్కొన్నారు.

ధరణి పోర్టల్ ఓ ఫెయిల్యూర్ సిస్టం..

ధరణి పోర్టల్ అనేది ఫెయిల్యూర్ సిస్టం అని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. 33 మాడ్యూళ్లు ఏం అవసరమని.. సమస్య ఉందని అప్లై చేస్తే అది ఏ కేటగిరి అనేది అధికారి నిర్ణయించి పరిష్కరించాలని తెలిపారు. పాత విధానానికి మొత్తం మారుస్తామని, అందుకే కొత్త ఆర్వోఆర్ చట్టాన్ని తీసుకొస్తున్నామని చెప్పారు. అందులో అప్పీల్ వ్యవస్థ ఉంటుందని తెలిపారు. గతంలో ఫిర్యాదుకు అవకాశం లేకుండా రాజ్యాంగ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడడం వల్లే రైతులు ఇబ్బందులు పడ్డారని అన్నారు. ధరణి పోర్టల్‌లోని పెండింగ్ అప్లికేషన్లు అన్నిటినీ పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని, త్వరలోనే ఈ ప్రక్రియ పూర్తవుతుందని తెలిపారు. ధరణి పోర్టల్‌లో స్లాట్ బుక్ చేసుకొని వివిధ కారణాలతో నిలిచిపోయిన ట్రాన్సాక్షన్లకు సంబంధించిన స్టాంప్ డ్యూటీ రూ.33 కోట్ల వరకు ఉందని, ఆ అమౌంట్‌ని త్వరలోనే తిరిగి చెల్లిస్తామని తెలిపారు. ఇక నుంచి అమౌంట్‌ ఆర్నెళ్లపాటు రెవెన్యూ శాఖ ప్రత్యేక ఖాతాకే చేరేలా చూస్తామని, ఆర్నెళ్ల తర్వాతే ప్రధాన అకౌంట్‌కి వెళ్లేలా ప్రత్యేక వ్యవస్థను రూపొందిస్తామని వివరించారు. దీని ద్వారా స్లాట్ క్యాన్సిల్ చేసుకున్న వెంటనే వారి సొమ్మును తిరిగి చెల్లించే వీలు ఉంటుందన్నారు.

59 జీవో ద్వారా రూ.వేల కోట్ల దోపిడీ

గత ప్రభుత్వంలోని పెద్దలు జీవో 59ని అడ్డం పెట్టుకొని గతేడాది ఫిబ్రవరి నుంచి అక్టోబరు వరకు రూ.వేల కోట్ల విలువైన భూములను కొల్లగొట్టారని, వాటన్నింటిని గుర్తించి హోల్డ్‌లో పెట్టామని, ఖాళీ జాగాలను సైతం రెగ్యులరైజ్ చేశారని మంత్రి పొంగులేటి ఫైర్ అయ్యారు. బినామీ పేర్లతో ఎకరం రూ.100 కోట్లు పలికే భూములను రాయించుకున్నారని, ఇందులో 900 గజాల నుంచి 999 గజాల వరకూ ఉన్నాయని తెలిపారు. ఖాళీ జాగాలను రెగ్యులరైజ్ చేసేందుకు నిబంధనలు అంగీకరించవని, అయినా పెద్దలు అడ్వాంటేజీగా తీసుకున్నారని ఆరోపించారు. ఇప్పటికే వీటిపై ఎలాంటి ట్రాన్సాక్షన్స్ జరగకుండా చర్యలు తీసుకున్నామని తెలిపారు. అలాగే పెండింగులోని ఎల్ఆర్ఎస్, 59 జీవో దరఖాస్తులను పరిశీలించి రెగ్యులరైజ్ చేస్తామన్నారు. 100 గజాలలోపు స్థలాలకు సంబంధించి ముందు చేయాలని అధికారులను ఆదేశించామని వివరించారు. మిగతావి కూడా జెన్యూన్‌గా ఉంటే వాటిని సైతం తప్పకుండా చేస్తామని, అలాగే గ్రామ పంచాయతీ లే అవుట్లలో మిగిలిన ప్లాట్లను క్రయవిక్రయాలు చేపట్టాలని అధికారులను ఆదేశించామని స్పష్టం చేశారు.

శాస్త్రీయంగా మార్కెట్ విలువల పెంపు

రాష్ట్రంలో 2011లోనే శాస్త్రీయంగా భూముల మార్కెట్ విలువల ధరలను నిర్ణయించారని, ఆ తర్వాత 2021–22 సంవత్సరంలో రెండుసార్లు పద్ధతి లేకుండా రెసిడెన్షియల్, కమర్షియల్, అగ్రికల్చర్ బేస్డ్‌గా గంపగుత్తగా 30, 40, 50 శాతం వంతున పెంచారని, ఇప్పుడు అలాంటి పొరపాట్లకు తావులేకుండా చూస్తామని మంత్రి పొంగులేటి తెలిపారు. ప్రతీ సర్వే నంబరు ఆధారంగా, ప్రాంతం ప్రాతిపదికన.. బహిరంగ మార్కెట్లో ఏ విధంగా ఉన్నదో తెలుసుకుంటున్నామని, త్వరలోనే ప్రజల ముందు ఉంచుతామని మంత్రి స్పష్టం చేశారు. ఆగస్టు ఫస్ట్ నుంచా, ఆ తర్వాతా అనేది త్వరలోనే చెప్తామన్నారు. రాష్ట్రంలో 36 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల నుంచే 80 శాతం ఆదాయం లభిస్తోందని, మిగతా వాటి నుంచి 20 శాతం వస్తోందని తెలిపారు. అందుకే కొద్ది నెలల్లో ఈ 36 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను కార్పొరేట్ కంపెనీల ద్వారా వారి సీఎస్సాఆర్ ఫండ్స్‌తో నిర్మిస్తామని వివరించారు. సబ్ రిజిస్ట్రార్ల బదిలీల ప్రక్రియలో ఎలాంటి పైరవీలు నడువవని, ఎవరైనా సీఎం పేషీ నుంచో, ఇతర మంత్రులు, ఎమ్మెల్యేల ద్వారానో లెటర్ పట్టుకొని వచ్చినా, ఫోన్లు చేయించినా వారిని బార్డర్‌కి ట్రాన్స్‌ఫర్ చేస్తామని హెచ్చరించారు. కొందరు రూ.కోటి వరకు ఇచ్చేందుకు ఎమ్మెల్యేల ద్వారా పైరవీలు చేసిన రోజులు ఉన్నాయని, ఇప్పుడలాంటి వ్యవస్థ పనిచేయదని, నేను ఒక్క మాట పడడానికి కూడా సిద్ధంగా లేనని స్పష్టం చేశారు.

గ్రామ రెవెన్యూ వ్యవస్థ అవసరం

వీఆర్వో, వీఆర్ఏ వ్యవస్థను తిరిగి తీసుకొస్తామా? లేదా? అనేది ప్రధానం కాదని, కానీ.. గ్రామీణ రెవెన్యూ వ్యవస్థ అవసరం ఉందని మంత్రి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. వారు లేక ప్రభుత్వ భూముల రక్షణ, ఎల్ఆర్ఎస్ వంటి అప్లికేషన్ల పరిశీలన, ధరణి దరఖాస్తుల పరిశీలన కష్టమవుతోందన్నారు. గ్రామాల నుంచి ఎలాంటి ఫీడ్ బ్యాక్ రావడం లేదని, ప్రతి ఊరిలోనూ రెవెన్యూకు ఓ మనిషి ఉండాలని తన వ్యక్తిగత అభిప్రాయం అని పేర్కొన్నారు. ఇదే అంశంపై కేబినేట్‌లో చర్చించి నిర్ణయం తీసుకుంటామని, 11వేల గ్రామాలకు 11వేల మంది అవసరం ఉంటుందని చెప్పారు. అయితే గతంలో తప్పిదాలకు పాల్పడిన వీఆర్వోలపై చర్యలు ఉంటాయన్నారు. మిషన్ భగీరథ పూర్తయ్యిందంటూ గత ప్రభుత్వం కేంద్రాన్ని మోసం చేసి నిధులను చేజార్చుకుందన్నారు. మంత్రి సీతక్క సర్వే చేయిస్తే ఇప్పటికీ రాష్ట్రవ్యాప్తంగా 35 నుంచి 38 శాతం వరకు నల్లాలు లేనే లేవు అనేది వెల్లడైందన్నారు. కేసీఆర్ సర్కార్ మాత్రం రూ.39 వేల కోట్లు ఖర్చు చేసినట్లు, పథకం పూర్తి చేసినట్లు కేంద్రానికి గొప్పలు చెప్పుకోవడంతో నిధులు రాలేదన్నారు. రాష్ట్రవ్యాప్తంగా బోగస్ రేషన్ కార్డులు, బోగస్ పెన్షన్లు ఉన్నాయని తెలిపారు. హెల్త్ సర్వీస్ కోసం రేషన్ కార్డులు వాడుతున్నారని, రేషన్ మాత్రం బ్లాక్ మార్కెట్‌కి తరలుతోందని, అందుకే రేషన్ కార్డు, హెల్త్ కార్డు సెపరేట్ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారని వివరించారు. ఆయుష్మాన్ భారత్ వంటి పథకాలను సద్వినియోగం చేసుకోవాలని, వాటిలో కొన్ని రోగాలను కూడా యాడ్ చేయాలన్న ఆలోచన ఉందని తెలిపారు.

ఓఆర్ఆర్, ఆర్ఆర్ఆర్ మధ్య హౌజింగ్ బోర్డులు

రాష్ట్రంలో రానున్న ఐదేండ్లలో 20 లక్షల ఇండ్లు పూర్తి చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నదని మంత్రి స్పష్టం చేశారు. యూపీ, ఏపీ రాష్ట్రాల్లో పేదలకు ఇండ్ల పథకంపై అధ్యయనం చేశామని, మరో మూడు రాష్ట్రాల్లో అధికార బృందం స్టడీ చేస్తున్నదని తెలిపారు. రిపోర్టును బట్టి విధాన నిర్ణయాలు ఉంటాయన్నారు. హైదరాబాద్ పరిసరాల్లో సామాన్యుడు ఇల్లు కొనుక్కునే అవకాశం లేకుండాపోయిందని, అందుకే ఓఆర్ఆర్, ఆర్ఆర్ఆర్ మధ్య ఉన్న ప్రభుత్వ భూముల్లో హౌజింగ్ బోర్డు కాలనీలను నిర్మించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు వెల్లడించారు. నిర్మాణం కూడా ప్రభుత్వమే చేపట్టాలని, మధ్యతరగతి వర్గాలకు అనుకూలంగా ఉండేలా ప్లాన్ చేస్తున్నదని తెలిపారు. త్వరలోనే మిగిలిన రాజీవ్ స్వగృహ ఇండ్లను వేలం వేస్తామని, ధరలను నిర్ణయించేందుకు హౌజింగ్ బోర్డులతో కూడిన కమిటీని నియమించామని తెలిపారు. అలాగే అర్ధంతరంగా ఆగిపోయిన రాజీవ్ గృహకల్ప, డబుల్ బెడ్రూం ఇండ్లను పూర్తి చేసేందుకు నిధులను కేటాయిస్తామని, వాటిని అర్హులైన నిరుపేదలకు అందిస్తామని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు.

రంకెలేస్తే ఊరుకోం..

‘ప్రజలు కాంగ్రెస్ పార్టీకి 64 సీట్లు ఇచ్చారు. ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాం. ప్రమాణ స్వీకారం చేయకముందు నుంచే ఈ ప్రభుత్వం ఉండదంటూ కామెంట్స్ చేస్తే సహించాలా? బీజేపీతో బ్యాక్ ఎండ్‌లో సపోర్ట్ తీసుకొని మమ్మల్ని దించే యోచన చేశారు. ఈ ప్రభుత్వం కూలుతుందంటే ఎందుకు ఊరుకోవాలి. ఇలాంటి రంకెలేస్తే ఊరుకునేది లేదు. ఆ రంకెలను కంట్రోల్ చేసే వరకు ముందడుగు వేస్తూనే ఉంటాం. తాతకు పెట్టిన బొచ్చ తలాపునే ఉంటుంది. గతంలో ప్రజలు బీఆర్ఎస్‌కు 88 సీట్లు ఇచ్చారు. వాటితో సరిపెట్టుకోకుండా కాంగ్రెస్ పార్టీపై ఫోకస్ పెట్టారు. 19 నుంచి ఆరింటికే పరిమితం చేసిన విషయాన్ని ఎలా మర్చిపోతాం. కేసీఆర్ ప్రతిపక్ష హోదాలోనే అసెంబ్లీకి రావాలని వ్యక్తిగతంగా కోరుకుంటున్నా. అయితే ఎక్కడితో ఆగుతుందో నేను చెప్పలేను. మేం గేట్లు తెరిస్తే ఎవరూ మిగలరు. ఇది జాతీయ పార్టీ.. ఎవరైనా, ఎక్కడి నుంచైనా గేట్ తీసుకొని వచ్చే వెసులుబాటు ఉంది. ఎవరిని చేర్చుకోవాలో, ఎవరిని వద్దనాలో పార్టీ నిర్ణయిస్తుంది.’

ఆషాఢం తర్వాత మంత్రివర్గ విస్తరణ

‘ఆషాఢం తర్వాత మంత్రివర్గ విస్తరణ ఉండొచ్చు. మొన్ననే ఉండేది.. కానీ కొన్ని కారణాలతో ఆగింది. ఈ నెలాఖరుకు బడ్జెట్ ఆమోదం ఉంటుంది. కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టిన మరుసటి రోజు నుంచే అసెంబ్లీ సమావేశాలు ఉండొచ్చు. రాష్ట్రానికి ప్రధాని వస్తే భేషజాలకు పోకుండా ప్రొటోకాల్ ప్రకారం గౌరవిస్తాం. అలాగే వారు కూడా అన్ని రాష్ట్రాలను సమానంగా చూస్తూ నిధుల విషయంలో సహకరించాలి. ప్రధానిని కలిసినంత మాత్రాన ఏదో జరిగిందని ప్రతిపక్షాలు ప్రచారం తగదు.


Similar News