Harish Rao: అందరికీ రుణమాఫీ అయిందని భట్టి చెప్పడం హాస్యాస్పదం: మాజీ మంత్రి హరీశ్ రావు
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రూ.31వేల కోట్ల రుణమాఫీ పూర్తి చేశామని చెప్పడం హాస్యాస్పదం అని మాజీ మంత్రి తన్నీరు హరీష్‌రావు అన్నారు.
దిశ, తెలంగాణ బ్యూరో: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రూ.31వేల కోట్ల రుణమాఫీ పూర్తి చేశామని చెప్పడం హాస్యాస్పదం అని మాజీ మంత్రి తన్నీరు హరీష్‌రావు అన్నారు. రుణమాఫీపై కాంగ్రెస్ పార్టీ నాయకులు తలాతోక లేకుండా రోజుకో తీరుగా మాట్లాడటం సిగ్గుచేటని మంగళవారం ట్విట్టర్ వేదికగా ఆయన మండిపడ్డారు. ఇక ముఖ్యమంత్రి రుణమాఫీ పూర్తి చేసినట్లు డబ్బా కొడితే, మంత్రులు, ఎమ్మెల్యేలు మాత్రం రుణమాఫీ పూర్తి కాలేదంటున్నారని గుర్తు చేశారు.
మొన్న ఖమ్మం వేదికగా సీఎం రేవంత్‌రెడ్డి రూ.18 వేల కోట్లతో రుణమాఫీ పూర్తిగా చేసినట్లు ప్రకటిస్తే, ఇందుకు భిన్నంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రుణమాఫీ పూర్తిగా జరగలేదని, ఇంకా రూ.12 వేల కోట్లు కూడా విడుదల చేస్తామన్నారని తెలిపారు. మరో మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి ఇంకా రూ.17 లక్షల మంది రైతులకు రుణమాఫీ కాలేదంటూ స్టేట్‌మెంట్లు ఇచ్చారని ఎద్దేవా చేశారు. రాజీవ్‌గాంధీ జయంతి కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి, సీఎం రేవంత్‌రెడ్డి సమక్షంలోనే ఆయన పచ్చి అబద్ధం చెప్పారని, ఏకంగా రూ.31వేల కోట్ల రుణమాఫీ పూర్తి చేసినట్లు ప్రకటించారని ఆరోపించారు. ఇందులో ఏది నిజం? ఇందులో ఎవరి మాటలు నమ్మాలో సీఎం చెప్పాలని డిమాండ్ చేశారు.
ఒకవైపు రుణమాఫీ కాక రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఆందోళనలు చేస్తుంటే.. భరోసా ఇవ్వాల్సిన సీఎం, మంత్రులు నోటికొచ్చినట్లు మాట్లాడి మరింత గందరగోళం సృష్టిస్తున్నారని ఆరోపించారు. రుణమాఫీ జరిగి ఉంటే బ్యాంకులు, వ్యవసాయ కార్యాలయాలు, కలెక్టరేట్ల చుట్టూ రైతులు ఎందుకు చెప్పులరిగేలా తిరుగుతున్నారని ప్రశ్నించారు. ఎందుకు రోడ్లెక్కి రుణమాఫీ కాలేదనే ఆవేదనతో ఆందోళనలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ఇప్పటికైనా రైతు రుణమాఫీ పూర్తి కాలేదన్న వాస్తవాన్ని సీఎం ఒప్పుకుని రైతులకు క్షమాపణ చెప్పాలని, వెంటనే రుణమాఫీపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఆగస్టు 15 వరకు రైతులందరిని రుణ విముక్తులుగా చేస్తానన్న హామీని సీఎం ఇప్పటికైనా నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు.
కునారిల్లుతున్న పంచాయతీలు
నిధులు విడుదల చేయకపోవడంతో విధులు నిర్వహించడం కష్టంగా మారిందని ఆదిలాబాద్ జిల్లా, నార్నూర్ మండలానికి చెందిన 16 మంది పంచాయతీ కార్యదర్శులు సామూహికంగా సెలవులు పెట్టే దుస్థితి రావడం దురదృష్టకరం అని హరీష్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. క్షేత్ర స్థాయిలో పనిచేసే పంచాయతీ కార్యదర్శుల ఆవేదనను ప్రభుత్వం పట్టించుకోకపోవడం శోచనీయం అన్నారు. 9 నెలల కాంగ్రెస్ పాలనలో పారిశుధ్యం కుంటుపడిందని ధ్వజమెత్తారు. మురికి కూపాలుగా మారడం వల్ల మలేరియా, డెంగీ వంటి సీజనల్ వ్యాధులు ప్రభలుతున్నాయని, చివరకు ట్రాక్టర్ డీజిల్ డబ్బులు కూడా ఇవ్వలేని పరిస్థితి నెలకొందని ఆందోళన వ్యక్తం చేశారు.
కొన్నిచోట్ల పంచాయతీ కార్యదర్శులు అప్పులు చేసి గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణ కార్యక్రమాలు చేస్తున్నారని, రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొందని తెలిపారు. గ్రామ పంచాయతీ వ్యవస్థను తిరిగి గాడిన పెట్టేందుకు, పంచాయతీ కార్యదర్శులపై ఒత్తిడిని తగ్గించేందుకు నిధులు విడుదల చేయాలని మేము కోరితే ప్రభుత్వానికి చీమకుట్టినట్లైనా ఉండటం లేదని మండిపడ్డారు. ఇప్పటికైనా కళ్లు తెరిచి గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల చేయాలని, చేసిన పనులకు మాజీ సర్పంచులకు పెండింగ్ బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేశారు.