రేవంత్, బాబుల భేటీ వివరాలను రివీల్ చేసిన భట్టి.. సమస్యల పరిష్కారం కోసం AP, తెలంగాణ భారీ స్కెచ్

రెండు తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీలో అనేక అంశాలపై లోతుగా చర్చలు జరిగాయని, పదేళ్లుగా పరిష్కారం కానీ రాష్ట్ర విభజన అంశాలపై

Update: 2024-07-06 15:55 GMT

దిశ, వెబ్‌డెస్క్: రెండు తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీలో అనేక అంశాలపై లోతుగా చర్చలు జరిగాయని, పదేళ్లుగా పరిష్కారం కానీ రాష్ట్ర విభజన అంశాలపై మాట్లాడుకున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు. ఏపీ, తెలంగాణ సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డిల భేటీ అనంతరం ఏపీ మంత్రులతో కలిసి భట్టి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా రెండు రాష్ట్రాల సీఎంల సమావేశంలో చర్చించిన అంశాలను భట్టికి మీడియాకు వివరించారు. గత కొన్ని ఏండ్లుగా అపరిష్కృతంగా ఉన్న రాష్ట్ర విభజన సమస్యలను త్వరగా పరిష్కరించుకోవాలని నిర్ణయించుకున్నామని తెలిపారు. ఈ సమావేశంతోనే సమస్యలు అన్నీ పరిష్కారం అవుతాయని అనుకోవడం లేదని, సమస్యల పరిష్కార మార్గాలపై వ్యవస్థ ఏర్పాటు చేసుకోవాల్సిఉందని, ఈ మేరకు ఉన్నత స్థాయిలో అధికారులతో కమిటీ ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు.

ఈ కమిటీలో ఇరు రాష్ట్రాల సీఎస్‌లు, రెండు రాష్ట్రాల నుండి ముగ్గురు ముగ్గురు సభ్యులు ఉంటారని వెల్లడించారు. ఈ కమిటీ ద్వారా అనేక సమస్యలను పరిష్కరించుకుంటామని, అధికారుల కమిటీ పరిష్కరించలేని సమస్యలపై మంత్రులతో కూడిన కమిటీ వేస్తామని చెప్పారు. మంత్రుల కమిటీలో కూడా ప్రాబ్లమ్స్ సాల్వ్ కాకపోతే సీఎంల స్థాయిలో చర్చలు ఉంటాయని స్పష్టం చేశారు. డ్రగ్స్‌కు వ్యతిరేకంగా యాంటీ నార్కొటిక్స్ డ్రైవ్స్ చేయాలని నిర్ణయించామని, సైబర్ క్రైమ్స్ అరికట్టేందుకు చర్యలు తీసుకున్నామని తెలిపారు. డ్రగ్స్, సైబర్ క్రైమ్స్‌పై ఇరు రాష్ట్రాలు కలిసి పనిచేయాలని నిర్ణయించామని చెప్పారు. డ్రగ్స్, సైబర్ క్రైమ్స్ అరికట్టేందుకు ఇకపై ఏపీ, తెలంగాణ కలిసి పని చేస్తాయని భట్టి స్పష్టం చేశారు. 


Similar News