కేటీఆర్‌ను బర్తరఫ్ చేసే వరకు పోరాడుతాం: బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు
రాష్ట్రంలోని 30 లక్షల మంది నిరుద్యోగుల భవిష్యత్ కోసం బీజేపీ పోరాడుతోందని, ఉమ్మడి పాలమూరు జిల్లా కేంద్రంలో మంగళవారం నిర్వహించే ‘నిరుద్యోగ మార్చ్’కు పెద్ద ఎత్తున
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోని 30 లక్షల మంది నిరుద్యోగుల భవిష్యత్ కోసం బీజేపీ పోరాడుతోందని, ఉమ్మడి పాలమూరు జిల్లా కేంద్రంలో మంగళవారం నిర్వహించే ‘నిరుద్యోగ మార్చ్’కు పెద్ద ఎత్తున తరలిరావాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ పార్టీ కార్యకర్తలకు, యువతకు పిలుపునిచ్చారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీపై సీఎం స్పందించే వరకు తమ పోరాటం కొనసాగుతుందన్నారు. సిట్టింగ్ జడ్జితో విచారణ జరపడంతో పాటు ఐటీ శాఖ మంత్రిని బర్తరఫ్ చేసేదాకా, నిరుద్యోగులకు రూ.లక్ష పరిహారం ఇచ్చేదాకా తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.
నిరుద్యోగ మార్చ్‌ను సక్సెస్ చేయాలని సోమవారం ఉమ్మడి పాలమూరు పరిధిలోని పోలింగ్ బూత్ ఇన్ చార్జీలతో బండి సంజయ్ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు నిరుద్యోగుల గొంతు కోస్తోందన్నారు. రాష్ట్రంలో 1.91 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, వాటిని భర్తీ చేస్తానని హామీ ఇచ్చి మోసం చేశారన్నారు. అసెంబ్లీ వేదికగా 80 వేల ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పి నేటికీ ఒక్క ఉద్యోగం భర్తీ చేయకుండా కాలయాపన చేస్తున్నారని విమర్శలు గుప్పించారు.
21 నోటిఫికేషన్లు విడుదల చేసినా ఏ ఒక్కటీ సక్రమంగా నిర్వహించలేదని దుయ్యబట్టారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ పేరుతో నిరుద్యోగ యువత జీవితాలతో ఆడుకుంటోందని సంజయ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. కేసీఆర్ కుటుంబంపై లీకేజీపై ఆరోపణలు వస్తున్నా ఆయన మాత్రం ఇంతవరకు స్పందించకపోవడం సిగ్గుచేటని విమర్శించారు. పేపర్ లీకేజీకి ఐటీశాఖ నిర్లక్ష్యమే కారణమైనప్పటికీ కేసీఆర్ కొడుకును బర్తరఫ్ చేయకపోగా, ఆయనను కాపాడుకోవడానికి సీఎం యత్నిస్తున్నారని నేతలకు వివరించారు. సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని డిమాండ్ చేస్తుంటే.. సిట్ పేరుతో దోషులను కాపాడే యత్నం చేస్తున్నారని సంజయ్ విరుచుకుపడ్డారు. అందుకే ‘నిరుద్యోగ మార్చ్’కు ప్రతి ఒక్కరూ తరలిరావాలని, యువతను మార్చ్ లో భాగస్వామ్యం చేయాలని నేతలకు దిశానిర్దేశం చేశారు.