సీఎం కేసీఆర్‌కు బండి సంజయ్ స్ట్రాంగ్ కౌంటర్
రంగారెడ్డి జిల్లాలో సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
దిశ, డైనమిక్ బ్యూరో: రంగారెడ్డి జిల్లాలో సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార కార్యక్రమంలో దేశ ప్రధానిపై ఇష్టానుసారం వ్యాఖ్యలు చేయడంపై ఆయన మండిపడ్డారు. గురువారం మీడియాతో మాట్లాడిన బండి సంజయ్ కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. పంటలు కావాలా? మంటలు కావాలా అని కేసీఆర్ అడుగుతున్నారు.. మరి వరి వేస్తే ఉరే అని చెప్పిందెవరని బండి సంజయ్ ప్రశ్నించారు. తమ పార్టీ పేరుతో టీఆర్ఎస్ మత చిచ్చురేపే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. వద్దని చెప్పినా మునావర్ షోను నిర్వహించారని అతనేమైనా దేశభక్తుడా అని ప్రశ్నించారు. మునావర్ ఫారూఖీని పిలించింది మంత్రి కేటీఆర్ కాదా అని ప్రశ్నించారు. రంగారెడ్డి సభలో సీఎం కేసీఆర్ ఢిల్లీ లిక్కర్ స్కాంలో కల్వకుంట్ల కుటుంబంపై వస్తున్న ఆరోపణలపై ఎందుకు స్పందించలేదన్నారు.
అయోధ్యలో రామమందిరం విషయంలో సుప్రీం కోర్టు తీర్పు, ట్రిపుల్ తలాక్, ఆర్టికల్ 370 రద్దు చేసినా దేశంలో ఎక్కడ మత ఘర్షణలు జరగలేదని కానీ కేసీఆర్ మాత్రం ఘర్షణలను కోరుకుంటున్నారని ఆరోపించారు. తమ కుటుంబంపై వస్తున్న అవినీతి ఆరోపణలపై ప్రజల దృష్టిని మళ్లించేందుకే కల్వకుంట్ల కుటుంబం ఈ తరహా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ఈ అల్లర్లలో టీఆర్ఎస్, ఎంఐఎంలు రాజకీయంగా లబ్ధిపొందాలని చూస్తున్నాయని ఆ నిందను మాత్రం బీజేపీపై వేసే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. బీజేపీ పార్టీ అన్ని మతాలను గౌరవించే పార్టీ అని అన్నారు. ఎక్కడ దర్యాప్తులు జరిపినా వాటిలో కేసీఆర్ కుటుంబం పేర్లు బయటకు వస్తున్నాయని చెప్పారు.
ఇన్నాళ్లు మేధావులు, కవులు, కళాకారులను కేసీఆర్ విస్మరించాలని తీర ఇప్పుడు వారిని తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ ఎంత ప్రయత్నం చేసిన ప్రజలు టీఆర్ఎస్ ను ఓడించడం ఖాయమన్నారు. ఇకనైనా ముఖ్యమంత్రి అభివృద్ధిపై చర్చకు రావాలని అన్నారు.