Aravind Kumar: ఈడీ విచారణకు హాజరైన అరవింద్ కుమార్
ఫార్ములా ఈ-రేస్ కేసులో ఈడీ (Enforcement Directorate) విచారణ శరవేగంగా కొనసాగుతోంది.
దిశ, వెబ్‌డెస్క్: ఫార్ములా ఈ-రేస్ కేసులో ఈడీ (Enforcement Directorate) విచారణ శరవేగంగా కొనసాగుతోంది. తాజాగా, కేసులో A2గా ఉన్న సీనియర్ ఐఏఎస్ అరవింద్ కుమార్ (IAS Aravind Kumar) ఇవాళ ఈడీ ఎదుట విచారణకు హాజరయ్యారు. ఫార్ములా ఈ-రేసు (Formula E-Race) నిర్వహణలో మనీ లాండరింగ్ (Money Laundering), ఫెమా నిబంధనలను (FEMA Regulations) ఉల్లంఘించారనే అభియోగాలు ఆయనపై ఉన్నాయి. అయితే, బీఆర్ఎస్ ప్రభుత్వ (BRS Government) హయాంలో ఆయన ఎంఏ అండ్ యూడీ (MA & UD) డిపార్ట్‌మెంట్‌లో స్పెషల్ సెక్రటరీగా విధులు నిర్వర్తించారు. ఫార్ములా ఈ-రేస్ అగ్రిమెంట్ చేసుకునే సమయంలో అరవింద్ కుమార్ అత్యంత కీలకంగా వ్యవహరించారు. విచారణలో భాగంగా విదేశీ సంస్థకు నిధుల బదిలీపై ఆయనను ఈడీ అధికారులు ప్రశ్నించనున్నారు. ఎవరి ఆదేశాలతో నిధులు బదిలీ చేశారు.. ఎలా చేశారని అరవింద్ కుమార్‌ను ప్రశ్నించి అధికారులు ఆయన స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేయనున్నారు.
కాగా, ఇదే కేసులో బుధవారం హెచ్ఎండీఏ (HMDA) మాజీ చీఫ్ ఇంజనీర్ బీఎల్‌ఎన్ రెడ్డి (BLN Reddy)ని ఈడీ (ED) అధికారులు విచారించారు. విచారణ సందర్భంగా రేసు నిర్వహణకు ఫైల్ మూవ్ చేసినప్పుడు ఆర్థిక శాఖ నుంచి అనుమతి ఎందుకు తీసుకోలేదని ఆయనను అధికారులు ప్రశ్నించారు. విదేశాలకు నిధులు ట్రాన్స్‌ఫర్ చేసే ముందు ఆర్‌బీఐ (RBI) అనుమతి ఎందుకు తీసుకోలేదని అడిగారు, కేసుకు సంబంధించి ఆయా అంశాలపై బీఎల్‌ఎన్ రెడ్డిని ప్రశ్నించి ఆయన వాంగ్మూలాన్ని అధికారులు తీసుకున్నారు.