CM Revanth: ‘భూభార‌తి’ని అమ‌లు చేయాల్సిన బాధ్యత అధికారుల‌దే

త్వరలోనే కొత్త ఆర్వోఆర్ భూ భార‌తి అమ‌ల్లోకి రానుంద‌ని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. భూ భార‌తి రాక‌తో రాష్ట్రంలోని రైతుల‌కు మెరుగైన రెవెన్యూ సేవ‌లు అందుబాటులోకి వ‌స్తాయ‌న్నారు.

Update: 2025-01-02 14:42 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: త్వరలోనే కొత్త ఆర్వోఆర్ భూ భార‌తి అమ‌ల్లోకి రానుంద‌ని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. భూ భార‌తి రాక‌తో రాష్ట్రంలోని రైతుల‌కు మెరుగైన రెవెన్యూ సేవ‌లు అందుబాటులోకి వ‌స్తాయ‌న్నారు. కొత్త చ‌ట్టంతోనే భూ స‌మ‌స్యల‌కు సైతం ప‌రిష్కారం ల‌భిస్తుంద‌న్నారు. తెలంగాణ త‌హ‌శీల్దార్స్ అసోసియేష‌న్‌(టీజీటీఏ), తెలంగాణ రెవెన్యూ స‌ర్వీసెస్ అసోసియేష‌న్‌(టీజీఆర్ఎస్ఏ) నూత‌న సంవ‌త్సర డైరీల ఆవిష్కర‌ణ గురువారం సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా తెలంగాణ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ క‌మిటీ ఛైర్మన్‌ వి.ల‌చ్చిరెడ్డితో సీఎం రేవంత్‌రెడ్డి కొత్త ఆర్వోఆర్ చ‌ట్టం, దానిలోని ప్రధాన అంశాల గురించి చ‌ర్చించారు. ధ‌ర‌ణితో రాష్ట్రంలో భూ స‌మ‌స్యలు పెరిగాయ‌న్నారు. రైతుల‌కు, ప్రజ‌ల‌కు రెవెన్యూ సేవ‌ల‌ను వేగంగా, సుల‌భంగా అందించే ల‌క్ష్యంతోనే భూభార‌తిని తీసుకొస్తున్నట్టుగా చెప్పారు. జిల్లా స్థాయిలోనే అన్ని ర‌కాల భూ స‌మ‌స్యల‌కు ప‌రిష్కారం ల‌భించే విధంగా కొత్త చ‌ట్టంలో ఉంద‌న్నారు. ఇదే కాకుండా రెవెన్యూ అధికారుల‌కు సైతం వివిధ స్థాయిల్లో అధికారాల‌ను క‌ల్పించిన విష‌యాన్ని గుర్తు చేశారు. కొత్త రెవెన్యూ చ‌ట్టాన్ని ప్రజ‌ల్లోకి తీసుకెళ్లడ‌మే కాకుండా స‌మ‌ర్ధవంతంగా అమ‌లు చేయాల్సిన బాధ్యత కూడా రెవెన్యూ అధికారుల‌, ఉద్యోగుల మీద‌నే ఉంద‌న్నారు. భూ భార‌తిలో క‌ల్పించిన అధికారాల వికేంద్రీక‌ర‌ణ‌తో క్షేత్ర స్థాయిలోనే రైతుల‌కు కావాల్సిన రెవెన్యూ సేవ‌లు అందుబాటులోకి వ‌స్తాయ‌న్నారు. ఇదే కాకుండా ప్రతి రెవెన్యూ గ్రామంలోనూ ఒక రెవెన్యూ అధికారి ఉండేలా కూడా చూస్తున్నట్లు చెప్పారు.

త‌హ‌శీల్దార్ల బ‌దిలీల‌ను చేప‌ట్టండి: వి.ల‌చ్చిరెడ్డి

రాష్ట్రంలో ఎన్నిక‌ల స‌మయంలో త‌హ‌శీల్దార్లను వివిధ జిల్లాల‌కు బ‌దిలీ చేశార‌ని వి.ల‌చ్చిరెడ్డి సీఎం రేవంత్‌రెడ్డికి వివ‌రించారు. ఎన్నిక‌ల స‌మ‌యంలో బ‌దిలీ అయిన త‌హ‌శీల్దార్లను నేటి వ‌ర‌కు సొంత జిల్లాల‌కు బ‌దిలీ చేయ‌లేద‌న్నారు. దీంతో వారంతా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వివ‌రించారు. దీనిపై సానుకూలంగా స్పందించిన సీఎం సాధ్యమైనంత త్వర‌లోనే బ‌దిలీల ప్రక్రియ జ‌రిగేలా చ‌ర్యలు చేప‌డతామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో డిప్యూటీ క‌లెక్టర్స్ అసోసియేష‌న్ రాష్ట్ర ప్రధాన కార్యద‌ర్శి కె.రామ‌కృష్ణ, తెలంగాణ త‌హ‌శీల్దార్స్ అసోసియేష‌న్ రాష్ట్ర అధ్యక్ష కార్యద‌ర్శులు ఎస్‌.రాములు, ర‌మేష్ పాక‌, సెక్రట‌రీ జ‌న‌ర‌ల్ ఫూల్‌సింగ్ చౌహాన్‌, శ్రీ‌నివాసులు, తెలంగాణ రెవెన్యూ స‌ర్వీసెస్ అసోసియేష‌న్ రాష్ట్ర అధ్యక్ష కార్యద‌ర్శులు బాణాల రాంరెడ్డి, వి.భిక్షం, మ‌హిళా అధ్యక్షురాలు సుజాత‌చౌహాన్‌, మ‌ల్లేష్‌, త‌దిత‌రులు ఉన్నారు.



 


Tags:    

Similar News