నల్లగొండలో మరో ఉప ఎన్నిక.. TRS ఎమ్మెల్యేపై బీజేపీ ఫోకస్!!

దిశ, తెలంగాణ బ్యూరో : వన్ షాట్.. టూ బర్డ్స్ తరహాలో రాజకీయంగా పావులు కదుపుతున్న బీజేపీ ఏకకాలంలో అటు కాంగ్రెస్, ఇటు టీఆర్ఎస్‌ను ఇరుకున పెట్టేందుకు వ్యూహాలను సిద్దం చేస్తున్నది.

Update: 2022-08-18 01:50 GMT

రాష్ట్రంలో మునుగోడు తర్వాత మరో ఉప ఎన్నిక రానున్నది. అది కూడా నల్లగొండ జిల్లాలోనే! ఇందుకోసం కమలనాథులు భారీ గ్రౌండ్ ప్రిపేర్ చేశారు. ఈ సారి అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేతో రాజీనామా చేయించి బై పోల్ కు వెళ్లాలని బీజేపీ భావిస్తున్నది. ఇప్పటికే సంప్రదింపులు పూర్తయినట్టు సమాచారం. కాంగ్రెస్ కంచుకోటగా పేరున్న నల్లగొండ జిల్లాలో ఆ పార్టీ అడ్రస్ గల్లంతు చేయడంతోపాటు అధికార పార్టీ అగ్రనేతలకూ కంటిమీద కునుకు లేకుండా చేయాలన్నది కాషాయ పార్టీ వేసిన మాస్టర్ ప్లాన్..!

దిశ, తెలంగాణ బ్యూరో : వన్ షాట్.. టూ బర్డ్స్ తరహాలో రాజకీయంగా పావులు కదుపుతున్న బీజేపీ ఏకకాలంలో అటు కాంగ్రెస్, ఇటు టీఆర్ఎస్‌ను ఇరుకున పెట్టేందుకు వ్యూహాలను సిద్దం చేస్తున్నది. ప్రస్తుతం ఒక్క సీటు కూడా లేని నల్లగొండ జిల్లాలో మునుగోడుతో బోణీ చేయాలనుకుంటున్నది. ఆ తర్వాత రెండో సీటును కూడా చేజిక్కించుకొనేందుకు మాస్టర్ ప్లాన్ వేసింది. ఆ జిల్లా నుంచే మరో ఉప ఎన్నిక వచ్చేలా రంగం సిద్ధం చేస్తున్నది. ఈసారి అధికార పార్టీ సిట్టింగ్ స్థానానికి ఎసరు పెట్టబోతున్నది. ఇప్పటికే ఆ నియోజకవర్గ ఎమ్మెల్యేతో ఒక రౌండ్ సంప్రదింపులు పూర్తయ్యాయి. చర్చలు సానుకూలంగా ముగిశాయని బీజేపీ వర్గాల సమాచారం. మునుగోడు ఉప ఎన్నిక ఫలితాలు రాగానే యాక్షన్ షురూ కానుంది. బీజేపీలో చేరడానికి ముందే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయించి ఉప ఎన్నికలో గెలుపును ఖాయం చేసుకోవాలనుకుంటున్నది. నల్లగొండ జిల్లా తమ పార్టీకి కంచుకోట అని కాంగ్రెస్ చెప్పుకుంటున్నందున 'ఆ పార్టీకి అంత సీన్ లేదు...' అని బీజేపీ రుజువు చేయాలనుకుంటున్నది. ఒక్క సీటు కూడా లేని జిల్లాల్లో గెలిస్తే అది రాష్ట్రంలోనే హాట్ టాపిక్ గా మారుతుందని భావిస్తున్నది. దీర్ఘకాలంగా తిష్టవేసుకున్న కాంగ్రెస్ పార్టీకి జిల్లాలో నూకలు చెల్లాయనే మెసేజ్‌ను జనంలోకి తీసుకెళ్లాలని ఆ పార్టీ లక్ష్యంగా పెట్టుకున్నది.

నల్లగొండ జిల్లాలో వచ్చే విజయాన్ని వరంగల్, ఖమ్మం జిల్లాల్లో కూడా ప్రభావం చూపేలా ప్రచారం చేసుకోవాలనుకుంటున్నది. ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పని అయిపోయిందని, అసలైన ప్రత్యామ్నాయం బీజేపీయే అనేది ప్రజల మైండ్‌లోకి ఎక్కేలా చేయడం కమలనాథులు దీర్ఘకాలిక యాక్షన్ ప్లాన్ రెడీ చేసుకున్నారు. నాగార్జునసాగర్ అసెంబ్లీకి ఉప ఎన్నిక జరిగే సమయానికి బీజేపీకి.. కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలకు దీటైన అభ్యర్థే దొరకలేదు. చివరకు ఓట్ల సంఖ్యలో మూడో స్థానంతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. నల్లగొండ జిల్లాలో పార్టీకి పెద్దగా పట్టు లేదనేది ప్రజలకు స్పష్టమైంది. దీనిని గ్రహించిన పార్టీ రాష్ట్ర నాయకత్వం మరోవైపు ఉత్తర తెలంగాణ నుంచి దక్షిణ తెలంగాణ వైపుకు విస్తరింపజేయడంపై ఫోకస్ పెట్టింది. పార్టీ స్టేట్ చీఫ్ పాదయాత్రను దక్షిణ తెలంగాణలో చేపట్టడానికి ఇది కూడా ఒక కారణమని తెలుస్తున్నది. పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో ప్రధాని మోడీ, అమిత్ షా ఇచ్చిన గైడెన్స్ తో రాష్ట్రంలో పార్టీ కార్యకలాపాలు విస్తృతమయ్యాయి. ప్రజా సమస్యలను టేకప్ చేయడంతో పాటు అధికార పార్టీని ఇరుకున పెట్టే వ్యూహాలూ ముమ్మరమయ్యాయి.

జాతీయ రాజకీయాలపై టీఆర్ఎస్ అధినేత సీరియస్ ప్రయత్నాలు చేస్తున్న సమయాన్ని రాష్ట్రంలో బీజేపీ విస్తరణకు సమర్ధవంతంగా వినియోగించుకోవడంపై దృష్టి పెట్టింది. ఒకవైపు పార్టీకి సొంత బలాన్ని పెంచుకొని కొత్త ప్రాంతాలకు విస్తరిస్తూనే కాంగ్రెస్, టీఆర్ఎస్ ల నుంచి చేరికలను పెంచుకునే వ్యూహానికి పదునుపెట్టింది. అందులో భాగమే చేరికల కోసం ప్రత్యేకంగా ఒక కమిటీని ఏర్పాటుచేసింది. ఈ క్రమంలో ఇప్పుడు టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల నుంచి సీనియర్లను, సిట్టింగ్‌లను, మాజీలను లాక్కునే ఆకర్ష్ ప్రణాళికను వేగవంతం చేసింది. మునుగోడు విషయంలో సక్సెస్ అయిన పార్టీ ఉప ఎన్నిక పూర్తికాగానే అదే జిల్లా నుంచి మరో సిట్టింగ్‌ ఎమ్మెల్యేని లాక్కొని వెంటనే ఉప ఎన్నిక అనివార్యమయ్యేలా ప్లాన్‌ రెడీ చేసింది. అసెంబ్లీ ఎన్నికలు వచ్చేంతవరకూ సీఎం కేసీఆర్‌ను ఉప ఎన్నికలమీద దృష్టి కేంద్రీకరించేలా, ఉచ్చులోకి లాగే ఎత్తుగడలను బీజేపీ అవలంబించాలనుకుంటున్నది. టీఆర్ఎస్‌తో మైండ్ గేమ్ ఆడుతూ ఆ పార్టీని డిఫెన్స్ లో పడేయాలనుకుంటున్నది. మునుగోడు ఉప ఎన్నిక హీటెక్కిన సమయంలో టీఆర్ఎస్ నాయకుల దృష్టి కేంద్రీకరించే టైమ్‌ను చూసుకొని ఆ పార్టీ ఊహకు అందని విధంగా మరో అసెంబ్లీ సెగ్మెంట్‌వైపు బీజేపీ వెళ్లింది. అక్కడి సిట్టింగ్‌తో సక్సెస్‌ఫుల్‌గా చర్చలు పూర్తిచేసింది. మునుగోడు పోలింగ్ అయిపోగానే అదే జిల్లాలో రెండో ఉప ఎన్నికకు గ్రౌండ్‌ను రెడీ చేసుకుంటుంది. నల్లగొండ జిల్లాలో తన సొంత పార్టీ లీడర్లను, కేడర్‌ను నిలబెట్టుకోవడంపై ఫోకస్ పెట్టే సమయంలో మరో జిల్లాల్లో ఆపరేషన్ ఆకర్ష్‌ ను వేగవంతం చేసి మరికొందరిని లాగేయాలనుకుంటున్నది.

టీఆర్ఎస్ అంచనాలకు అందని తీరులో బీజేపీ మైండ్ గేమ్ ఆడుతున్నది. పెద్ద లీడర్లు చేజారిపోకుండా జాగ్రత్తలు తీసుకునేలోపే సర్పంచ్‌ల మొదలు జెడ్పీటీసీల వరకు బీజేపీ లాగేసుకుంటున్నది. టీఆర్ఎస్‌పై ముప్పేట దాడి చేస్తూనే కాంగ్రెస్ పార్టీ కూడా సర్దుకోలేని తీరులో వ్యవహరిస్తున్నది. పార్టీలో అంతర్గత ఘర్షణలకూ బీజేపీ తనదైన తీరులో మూడో కంటికి తెలియకుండా ముసలం పుట్టిస్తున్నది. మునుగోడు పోలింగ్ ముగిసేలోపే కాంగ్రెస్ పార్టీకి చెందిన పలు జిల్లాల్లోని మాజీలను, జిల్లా అధ్యక్ష స్థాయి నాయకులను తనవైపుకు తిప్పుకోనున్నది. నల్లగొండ జిల్లాలో రెండో ఉప ఎన్నిక జరిగేది ఎక్కడ అనేది త్వరలోనే చర్చనీయాంశంగా మారనున్నది.

Read More:

మునుగోడుకు ఉప ఎన్నిక రావడానికి కారణం ఇదే: గుత్తా

Tags:    

Similar News