phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసుల దూకుడు.. మొన్న చిరుమర్తి నేడు జైపాల్ యాదవ్

ఫోన్ ట్యాపింగ్ కేసులో కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ విచారణకు హాజరయ్యారు.

Update: 2024-11-16 07:25 GMT

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణను సిట్ వేగవంతం చేసింది. ఇన్నాళ్లు పోలీసులు అధికారులను ప్రశ్నించిన దర్యాప్తు బృందం ఇక ప్రజాప్రతినిధుల లింకులపై ఫోకస్ పెట్టింది. ఈ నేపథ్యంలో కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ కు నోటీసులు అందాయి. దీంతో ఆయన ఇవాళ విచారణ నిమిత్తం జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్ కు హాజరయ్యారు. ఆయన స్టేట్ మెంట్ ను పోలీసులు రికార్డు చేస్తున్నట్లు తెలుస్తోంది. కాగా ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇటీవల నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య యాదవ్ ను అధికారులు ప్రశ్నించారు. ఇదే కేసులో అరెస్టయి జైల్లో ఉన్న అడిషనల్ ఎస్పీ(సస్పెండెడ్) తిరుపతన్నతో గతంలో ఫోన్ లో మాట్లాడిన కాల్ డేటా ఆధారంగా లింగయ్యను పలు కోణాల్లో విచారించారు.

పోలీసుల దూకుడు క్యాడర్ లో టెన్షన్:

ఫోన్ ట్యాపింగ్ అంశంలో గత కొంత కాలంగా సైలెంట్ గా సాగిన దర్యాప్తులో అనూహ్యంగా మాజీ ప్రజాప్రతినిధులకు నోటీసులు అందడంతో కేసు మరో టర్న్ తీసుకుంది. ఎఫ్ఎస్ఎల్ రిపోర్టు ఆధారంగా ఉమ్మడి నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాలకు చెందిన నలుగురు మాజీ ఎమ్మెల్యేలకు నోటీసులు ఇవ్వడం వారిని వరుసబెట్టి విచారణకు పిలవడంతో ప్రతిపక్ష బీఆర్ఎస్ క్యాడర్ లో అలజడి రేగుతోంది. పార్టీ అధికారంలో ఉండగా జరిగిన ఈ వ్యవహారంలో ఏ క్షణంలో ఏం జరగబోతున్నదనే చర్చ జోరందుకుంది. ఇన్నాళ్లు అధికారులు ఇచ్చిన స్టేట్ మెంట్ తో దర్యాప్తు చేసిన అధికారులు ఈ కేసులో సాకేతికపరమైన ఆధారాలు సంపాదించినట్లు తెలుస్తోంది. ఆ సమచారంలో ఈ వ్యవహారంలో అనుమానం కలిగిన వారిని విచారణకు పిలిచి వారి స్టేట్మెంట్లను నమోదు చేస్తుండటం రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారుతున్నది.

Tags:    

Similar News